WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కొడాలి'కి ఎదురుదెబ్బ...!

గుడివాడ వైకాపా ఎమ్మెల్యే 'కొడాలి నాని'కి ఎదురు దెబ్బ తగిలింది. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా మారిన గుడివాడ ఎమ్మెల్యే 'కొడాలినాని'పై పైచేయి సాధించేందుకు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. గుడివాడ మున్సిపల్‌ ఛైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు నేడు తెలుగుదేశం పార్టీలో చేరడం 'నాని'కి మింగుడు పడని విషయమే. గత మున్సిపల్‌ ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం టిడిపి గాలి వీచినా...'గుడివాడ'లో మాత్రం 'నాని' వైకాపా అభ్యర్థిని గెలిపించగలిగారు. అంతే కాకుండా ఎమ్మెల్యేగా కూడా విజయం సాధించి నియోజకవర్గంలో తనకు తిరుగులేదని రుజువు చేశారు. మున్సిపాల్టీలో మొత్తం 21 మందిని కౌన్సిలర్లును గెలిపించుకుని మున్సిపల్‌ ఛైర్మన్‌గా తన సన్నిహితుడైన 'యలవర్తి శ్రీనివాసరావు'ను ఎన్నిక చేయించుకున్నారు. అయితే ఇప్పుడు 'యలవర్తి'తో పాటు మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు పార్టీ మారడంతో 'గుడివాడ' మున్సిపాల్టీలో టిడిపి జెండా ఎగురనుంది. అంతే కాకుండా ఇన్నాళ్లూ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అండగా ఉంటున్న గుడివాడ పట్టణంలో ఇప్పుడు పట్టుకోల్పోవడం 'నాని'కి ఎదురుదెబ్బే. గత అసెంబ్లీ ఎన్నిలప్పుడే 'నాని' గెలవకూడదని టిడిపి అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే ఆ ఎన్నికల్లో రూరల్‌ ఏరియాల్లో టిడిపి మంచి మెజార్టీ సాధించినా పట్టణంలో వైకాపా ఎదురుదాడి చేయడంతో 'నాని' గెలుపొందగలిగారు. 2004 ఎన్నికల్లో జూ.ఎన్టీఆర్‌ అండతో టిడిపి టిక్కెట్‌ తెచ్చుకుని ఎన్నికల్లో గెలిచిన 'నాని' అప్పటి నుంచి టిడిపిలో ప్రత్యేకంగా ఉండేవారు. తాను పార్టీకి విధేయుడు కానట్లు కేవలం జూ.ఎన్టీఆర్‌, హరికృష్ణకే విధేయుడినన్నట్లు ప్రవర్తించేవారు. అప్పట్లో చంద్రబాబు కూడా చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ 2009 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన 'నాని' అప్పటి నుంచి టిడిపి అధినేతపై విమర్శలు గుప్పించడం ప్రారంభించారు. అదే సమయంలో ఆయన వైకాపాలో చేరిపోయి, అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేశారు. దీంతో 2014 ఎన్నికల్లో ఆయన గుడివాడ నుంచి ఎలా గెలుస్తారో చూస్తామని కొంత మంది టిడిపి నాయకులు సవాళ్లు చేశారు. అయితే ఆయన వాళ్లను సమర్థంగా ఢీ కొట్టి మళ్లీ గెలిచారు. ఆయన గెలిచినా టిడిపి అధికారంలోకి రావడంతో 'నాని' హవాకు కొంత బ్రేక్‌ పడింది. ఇదే సమయంలో టిడిపి అధినాయకత్వం 'గుడివాడ'పై ప్రత్యేక దృష్టిని పెట్టి 'నాని'ని అదుపులోకి తెచ్చుకుంది. అసెంబ్లీలో 'నాని' వ్యవహరించిన తీరును సాకుగా చూపించి అనర్హత వేటు వేయాలని భావించినా...'నాని' క్షమాపణ చెప్పడంతో ఆయన బయటపడ్డారు. దాంతో టిడిపి 'గుడివాడ'పై ప్రత్యేక దృష్టి పెట్టి వైకాపాకు చెందిన 'ఛైర్మన్‌'కు గాలం వేసింది. ఇప్పుడు గుడివాడ మున్సిపల్‌ ఛైర్మన్‌, మరో తొమ్మిది మంది కౌన్సిలర్లు టిడిపిలో చేరడంతో 'నాని'కి ఇక కష్టాలు మొదలైనట్లే.

(2099)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ