ఇక ఎన్నికల బరిలోకి 'పవన్‌'...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఇక ఎన్నికల బరిలోకి 'పవన్‌'...!

పవర్‌స్టార్‌,జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ ఇక ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. ఆయన చాలా సంవత్సరాల క్రితమే రాజకీయాల్లోకి వచ్చినా...ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2009లో 'చిరంజీవి' ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆ పార్టీ తరుపున ప్రచారం చేసిన 'పవన్‌' అప్పుడు ఎన్నికల బరిలోకి దిగలేదు. కానీ నాటి ఎన్నికల్లో 'పవన్‌' ప్రసంగాలు ఓటర్లను ఉర్రూతలూగించాయి. తరువాత ప్రజారాజ్యం వైఫల్యంతో ఆయన కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే రాష్ట్ర విభజనతో ఆయన బిజెపి, టిడిపి కూటమి తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. 'పవన్‌' మద్దతుతో టిడిపి విజయం సాధించిందని ఆయన మద్దతు దారులు చెప్పుకుంటారు. అదంతా గడిచిన వ్యవహారం..కాగా ఇటీవల కాలంలో ఆయన తన పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వనందుకు నిరసనగా ఆయన ప్రజాచైతన్య సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి, కాకినాడలలో సభలు నిర్వహించిన ఆయన తాజాగా అనంతపురంలో ఈ రోజు సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేస్తుందనేది సుస్పష్టమైంది. అంతే కాకుండా పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని అనంతపురంలో ఏర్పాటు చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. దరిమిలా రాయలసీమపై ఆయన ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సభలో రాయలసీమ వెనుకబాటుతనంపై ఆయన మాట్లాడారు. పనిలో పనిగా రెయిన్‌గన్‌లతో కరువును పారద్రోలలేమని సుతిమెత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు కురిపించారు. తరిమెళ నాగిరెడ్డి,లోక్‌నాయక్‌ వంటి వారి స్ఫూర్తితో పోరాడతానని, అనంతపురం కరువుపై ప్రధాని మోడీతో చర్చిస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీపై వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ తలోరకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మొత్తం మీద 'పవన్‌' ప్రసంగం తరువాత తేలిందేమిటంటే...రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బలంగా పోరాడుతారని స్పష్టంగా తేలిపోయింది. మరి ఇతర పక్షాలు 'పవన్‌'ను ఎలా ఎదుర్కొంటాయో...?

(309)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ