WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కలెక్టర్‌ గిరి కోసం...'శ్రీనివాసరాజు' యత్నాలు...!

తిరుమల జెఇఒగా ఆరు సంవత్సరాల నుండి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీనివాసరాజు కలెక్టర్‌ పోస్టు కోసం ప్రముఖులతో సిఎం కార్యాలయానికి సిఫార్సు చేయిస్తున్నారట. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కొంత మంది అధికారపార్టీ నాయకుల సిఫార్సుల కోసం శ్రీనివాసరాజు ప్రయత్నించారు. కానీ 'మీకు సిఫార్సు చేసే ప్రసక్తే లేదని...ఆయన సామాజికవర్గానికి చెందిన అధికారపార్టీ నాయకులు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. దీంతో ఆయన దృష్టి తాజాగా గుంటూరు,తూర్పుగోదావరి జిల్లాలపై పడింది. గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండేను బదిలీ చేయడం ఖాయమని బయటకు పొక్కడంతో ఆ జిల్లా మంత్రి చుట్టూ శ్రీనివాసరాజు ప్రదిక్షణలు చేస్తున్నారట. కానీ..గుంటూరులో 'రాజు'ను నియమించే ప్రసక్తేలేదని సిఎంఒ తేల్చి చెప్పిందట. తిరుమలలో ఆరు సంవత్సరాలు పనిచేసి బోరు కొట్టిందేమోనని...కలెక్టర్‌ గిరితో మార్పు కావాలని..శ్రీనివాసరాజు కోరుకుంటున్నారట. వాస్తవానికి ఆయనపై అనేక విమర్శలు, ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరిన నేపథ్యంలో ఎక్కడ విచారణ జరిపి తన పరువు, ప్రతిష్టను మంటగలుపుతారనే భయాందోళనతో తెలివిగా ముందుచూపుతో తిరుమల నుండి తప్పుకొని జిల్లా కలెక్టర్‌గా వెళ్లాలని శ్రీనివాసరాజు శతవిధాగాలు ప్రయత్నిస్తున్నారు. ఆయనను తిరుమలలో కొనసాగించేందుకు ప్రముఖులు సిఫార్సు చేస్తారే కానీ... కలెక్టర్‌గా నియమించమని సిఫార్సు చేసే ప్రసక్తే లేదని కొందరు ప్రముఖులు చెప్పడంతో ఆయన తాజాగా రాష్ట్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఒకప్పుడు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడుకు అత్యంత సన్నిహితుడైన 'రాజు' ఆ తరువాత ఏం జరిగిందో ఏమో కానీ...యనమల ఆయనను దరి చేరనివ్వడం లేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా వెళ్లాలని నిన్నటి వరకు అనుకున్న 'రాజు' తాజాగా తన దృష్టిని గుంటూరుపై మళ్లించారు. ఈ జిల్లాకు కలెక్టర్‌గా నియమించే ముందు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను ముఖ్యమంత్రి సంప్రదిస్తారు. కోడెల దృష్టిలో శ్రీనివాసరాజు లేరు. ఆయన సమర్థుడైన, నిజాయితీపరుడైన ఐఎఎస్‌ అధికారి కోసం వెతుకుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను గుంటూరు జిల్లాకు బదిలీ చేయాలని చంద్రబాబును స్వయంగా కలసి 'కోడెల' కోరగా 'పోలవరం' పూర్తి అయ్యేదాక 'భాస్కర్‌'ను బదిలీ చేయనని సిఎం చెప్పడం జరిగింది. దీంతో ఆయన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్‌ పి.లక్ష్మీనర్సింహ్మంను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించాలని 'కోడెల' కోరినట్లు 'శ్రీనివాసరాజు'కు తెలిసింది. దీంతో ఆయన కృష్ణా జిల్లా కలెక్టర్‌గా వెళ్లేందుకు ఆ జిల్లా మంత్రుల సిఫార్సుల కోసం వేట ప్రారంభించారు. కానీ...ప్రస్తుత ఆ జిల్లా కలెక్టర్‌ అహ్మద్‌బాబును సిఎం బదిలీ చేయరు. ఇప్పటికే ఆయనను బదిలీ చేయాలని ఆ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రయత్నించి విఫలమయ్యారు. జిల్లా కలెక్టర్‌గా వెళ్లేందుకు దారులు మూసుకుపోవడంతో మరే జిల్లాకైనా కలెక్టర్‌గా వెళ్లేందుకు శ్రీనివాసరాజు ప్రయత్నిస్తున్నారు. తిరుమల వెంకన్న ఆశీస్సులు ఎంత వరకు పనిచేస్తాయో...?

(299)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ