కన్నాను చేర్చకుంటారా...? బిజెపి పెద్దల అక్కసు...!
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ర్టాలను, తెలుగు ప్రజలను ఇంకా కుదిపేస్తూనే ఉంది. టిడిపి, జనసేన, కమ్యూనిస్టుపార్టీలు, ఇతర పార్టీలు, చంద్రబాబు అభిమానులు, సానుభూతిపరులు ఆయన అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. దేశ, అంతర్జాతీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆయన అరెస్టును ఖండిస్తూ ఉన్నారు. మరి కొందరు ఆయనకు మద్దతుగా ఉద్యమాల్లోకి వస్తున్నారు. అయితే..అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే..చంద్రబాబు అరెస్టు జరిగి దాదాపు పక్షం రోజులు దాటిపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కానీ, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానీ స్పందించకపోవడం. కాంగ్రెస్ అంటే మొదటి నుంచి టిడిపికి వ్యతిరేకం లేదా..ఆయన అరెస్టును తాము ఖండించిన తరువాత చంద్రబాబు ఎప్పటికైనా మరలా బిజెపి గూటికి పోతే..నవ్వుల పాలవుతామనే భావనతో వారు ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారనుకోవాలి. వారి సంగతిని పక్కన పెడితే..చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో మూగనోము పాటిస్తున్న ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యవహారం పూర్తిగా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏలో ఉన్న టిడిపి రాష్ట్ర ప్రయోజనాలను బిజెపి కాపాడడం లేదని, రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెబుతూ ఎన్డీఏతో తెగతెంపులు చేసుకుంది. బిజెపితో తెగతెంపులు చేసుకున్న తరువాత టిడిపి బిజెపి పెద్దలపై దూకుడుగా దాడి చేసింది. అయితే..దానికి ప్రతిఫలంగా బిజెపి పెద్దలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించి టిడిపిని ఘోరంగా ఓడించారు. ఇదంతా గతం..అయితే...తరువాత బిజెపి పెద్దలతో ఏర్పడిన అగాధాన్ని పూడ్చుకోవడానికి చంద్రబాబు, ఆయన పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకటి రెండుసార్లు ప్రధాని మోడీతో కలిసి వ్యక్తిగతంగా తాను ఆయనకు వ్యతిరేకం కాదని, గతంలో రాష్ట్ర ప్రయోజనాలకోసమే విభేదించాల్సి వచ్చిందని చెప్పారు. దాని తరువాత ఆయన దాదాపు ఎన్డీఏలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం సాగింది. అయితే అందరి ఊహలను తలకిందులు చేస్తూనే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిల్క్ డెవలప్‌మెంట్లో కుంభకోణం జరిగిందని దానికి చంద్రబాబే కారణమని ఆయనను అరెస్టు చేసింది. ఈ అరెస్టు దేశ,ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆయన అరెస్టు అక్రమమని, చంద్రబాబు చేశాడంటున్న అవినీతికి ఆధారాలు లేవని, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయనను సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిందని, దేశ, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే..గత పక్షం రోజుల నుంచి దక్షిణాది రాష్ర్టాల్లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిలో తీవ్ర అలజడి నెలకొన్నా, ఉద్యమాలు సాగుతున్నా, పార్లమెంట్‌లో దీని గురించి ప్రశ్నించినా..కేంద్ర పెద్దల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో దాదాపు 90శాతం మంది ప్రజలు బిజెపి పెద్దలు, జగన్ కలిసే చంద్రబాబును అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు. ప్రజల అభిప్రాయం ఈ విధంగా ఉందని తెలుస్తున్నా బిజెపి పెద్దలు మాత్రం నోరు మెదపడం లేదు. దీంతో..చంద్రబాబు అరెస్టు జగన్ చేయించినా..బిజెపి పెద్దలే చేయించారనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే..చంద్రబాబు అరెస్టు గురించి బిజెపి నేతల వద్ద కొందరు ప్రస్తావించగా..ఆయనను అరెస్టు చేస్తే తామెందుకు స్పందించాలని, తమ పార్టీ పెద్దలు ఎందుకు స్పందించాలని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణను తాము వద్దంటున్నా టిడిపిలో చేర్చుకున్నారని, అదే విధంగా మరి కొంత మంది కీలక నాయకులను చేర్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారని, గతంలో కాంగ్రెస్‌తో జతకట్టి తమను ఓడించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారని, అదే విధంగా రాబోయే ఎన్నికల్లో దక్షిణాదిలో కూటమి ఏర్పాటు చేసి మళ్లీ కేంద్రంలో తాము అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అటువంటి వారిని ఎలా ఉపేక్షిస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు తమ అధికారానికి అడ్డం వస్తాడనే భావనతోనే బిజెపిపెద్దలు జగన్‌ను అడ్డుపెట్టుకుని అరెస్టు చేయించారనే ప్రజల భావనను నిజమన్నట్లు ఆ నాయకులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు అడ్డు తొలగించుకునేందుకే..బిజెపి పెద్దలు ప్రయత్నిస్తున్నారని, జగన్ ఇంత అరాచకంగా వ్యవహిరిస్తున్నా..వారు ఉపేక్షిస్తున్నారంటే..దానికి కారణం ఇదేనని మరి కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కనీసం ఎన్నికల్లో పోటీచేస్తారో..చెయ్యరో..తెలియని షర్మిలను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేస్తే ఆమెకు ప్రధాని మోడీ ఫోన్ చేసి పరామర్శించారని, అదే చంద్రబాబు విషయంలో మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని, రాజకీయాలను పక్కన పెట్టినా అయినా ఆయన వయస్సును గౌరవించైనా మోడీ పరామర్శించి ఉండాల్సిందని కొందరు బిజెపి నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. కాగా మోడీ వ్యక్తిగత ద్వేషంతోనే చంద్రబాబు పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారనే భావన తెలుగు ప్రజల్లో వ్యక్తం అవుతోంది. మొత్తం మీద..తమ మాట వినడనే అనుమానంతోనే..చంద్రబాబును అరెస్టు చేయించి ఆనందపడుతున్నారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.