లేటెస్ట్

'ద్వివేది' ఇప్పుడెందుకు సెలవు పెట్టారు...!?

ఆంధ్రప్రదేశ్‌లో అధికారులకు, ప్రజాప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్‌ రోజు రోజుకు ముదిరి పాకానపడుతోంది. ఎన్నికల కోడ్‌ పేరుతో ప్రజా ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమీషనర్‌ అడ్డం పడుతున్నారని టిడిపి వర్గాలు ఆరోపిస్తుండగా..మరోవైపు ప్రజాప్రభుత్వానికి పాలించే అధికారాలు లేవని సిఎస్‌, సిఈఓ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ జరిగిన తరువాత...ఎన్నికల కోడ్‌ పేరు చెప్పి...పనిచేయకుండా అడ్డుకుంటు న్నారని, ఇతర రాష్ట్రాల్లో లేని కోడ్‌ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఎందుకని టిడిపి వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. తమను పనిచేయకుండా...ఎవరూ అడ్డకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. సిఎస్‌, సిఇఒ ఎలా అడ్డుకుంటారో తాను చూస్తానని, మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తానని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి ఈ నెల10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. అయితే ఎన్నికల సంఘం అనుమతి కోసం 'సిఎస్‌' లేఖ రాయడం, అది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడంతో..మంత్రివర్గ సమావేశం వాయిదా 14వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం..మంత్రివర్గంలో ఏమి చర్చించాలనే దానిపై సిఎస్‌, ఎన్నికల కమీషనర్‌ ఒక ఏజెండాను కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పంపారు. వారు ఏజెండాను పరిశీలించి..అనుమతి ఇస్తేనే మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఒకవేళ వారు కనుక అనుమతి ఇవ్వకపోతే..మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశం లేదు. 

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ 'ద్వివేది' సెలవుపై వెళుతున్నారు. హఠాత్తుగా ఆయన ఎందుకు సెలవుపై వెళుతున్నారనే దానిపై ఎవరికీ స్పష్టమైన అంచనాలు లేవు. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులకు సహజంగా సెలవులు ఉండవు. కానీ..'ద్వివేది'కి మాత్రం సెలవులు దొరికాయి. వ్యక్తిగత వ్యవహారాలపై సెలవుపై వెళుతోన్న 'ద్వివేది' తిరిగి 16వ తేదీన విధులకు హాజరవుతారు. ఈ లోపు మంత్రివర్గ సమావేశం అంశం ఏమవుతుందన్నది తేలిపోతుంది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం మంత్రివర్గ సమావేశం జరపడానికి అంగీకరించకపోతే ఇబ్బందికర పరిస్థితి ఎదురవు తుందన్న భావనతోనే ఎన్నికల కమీషనర్‌ సెలవుపై వెళుతున్నారని ప్రచారం జరుగుతోంది. తాను ఉండగా..మంత్రివర్గ సమావేశానికి అనుమతి రాకపోతే..టిడిపి శ్రేణులు, నాయకులు తనపై దాడి చేస్తారేమోనన్న భయంతోనే 'ద్వివేది' సెలవుపై వెళుతున్నారా..? భవిష్యత్‌లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, అనవసర అపోహలు తనపై వచ్చే అవకాశం ఉండడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా..? లేక నిజంగానే వ్యక్తిగత సెలవు కావాల్సి వెళ్లారా...? అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఏది ఏమైనా కీలకమైన తరుణంలో 'ద్వివేది' సెలవుపై వెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. 

(658)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ