WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నోట్ల రద్దుపై స్పందించిన 'జగన్‌'...!

అమ్మయ్య...ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ నోరు విప్పారు. దాదాపు పక్షం రోజుల పాటు ఆయన పెద్దనోట్లరద్దుపై నోరు తెరుస్తారేమోనని రాష్ట్రంలోని ప్రజలు, రాజకీయ పక్షాలు ఎదురు చూశాయి. అధికార తెలుగుదేశం పార్టీ అయితే ఆయనను రెచ్చగొట్టినా ఆయన ఎక్కడా నోరు మెదపలేదు. పెద్దనోట్ల రద్దుపై 'మోడీ' ప్రకటన చేయడంతోనే అధికార టిడిపికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తొలిసారి 'జగన్‌'పై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. 'జగన్‌' ఇడుపులపాయలో నేలమాగాళిలో దాచిపెట్టిన నల్లధనం ఇక చెల్లదని ఆయన ఎద్దేవా చేశారు. ఆయనతో పాటు ఇతర టిడిపి నేతలు కూడా చాలా మంది 'జగన్‌'పై విమర్శలు కురిపించారు. అయినా ఆయన కానీ...ఆయన పార్టీ నాయకుల కానీ ఈ..విషయంపై పెద్దగా స్పందించలేదు. కేవలం ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాత్రమే స్పందించారు. దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు ఈ విషయంపై ఏదో ఒక స్పందన తెలియజేశాయి. కొందరు అనుకూలంగా మరి కొందరు వ్యతిరేకంగా స్పందించారు. కొంత మంది ఉద్యమబాటపట్టారు. పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ సిఎంలు దేశ రాజధానిలో ధర్నాకు దిగారు. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా ఎటిఎంల వద్ద నిరసన తెలియజేశారు. ఇక సిఎం చంద్రబాబునాయుడు పెద్దనోట్ల రద్దుపై హర్షం వ్యక్తం చేస్తూనే...2వేల నోట్‌ను తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. తరువాత ఈ నిర్ణయం వల్ల పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. దేశంలో,రాష్ట్రంలో ఇన్నిరకాల స్పందనలు వ్యక్తం అవుతున్నా యువనాయకుడు 'జగన్‌' మాత్రం నోరు తెరవలేదు. నిన్న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలోనూ ఆయన ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. చివరకు ఈ రోజు ఆయన ఈ విషయంపై స్పందించారు. బ్లాక్‌మనీని అరికడతామంటే...చివరకు సామాన్యుడు కూడా దాన్ని స్వాగతిస్తారని చెప్పారు. 'మోడీ' గారు బ్లాక్‌మనీని అరికడతామని ప్రకటన చేస్తే మంచి కార్యక్రమమే అనుకున్నాం... మనమంతా సామాన్యులు...పైన వాళ్లు నిర్ణయం తీసుకుని మనకు చెబుతారు..మనం రిసీవింగ్‌లో ఉన్నాం..కాబట్టి ప్రతిపక్షం...ప్రజల గొంతును వినిపిస్తుంది. ఇప్పుడు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తున్నాం..అంటూ 'జగన్‌' చెప్పుకొచ్చారు.

(1124)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ