లేటెస్ట్

'ఐన్యూస్‌'ను 'రవిప్రకాష్‌' కొనుగోలు చేశారా...!?

టివి9 నుంచి అవమానకరంగా తొలగింపబడ్డ..ఆ ఛానెల్‌ మాజీ సిఇఒ 'రవిప్రకాష్‌' 'ఐన్యూస్‌'ను టేకోవర్‌ చేశారని ఉదయం నుంచి మీడియా సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. నిన్న టివి9 నూతన యాజమాన్యం 'రవిప్రకాష్‌'ను తొలగిస్తున్నా మని వెల్లడించడంతో...ఆగ్రహం వ్యక్తం చేసిన 'రవిప్రకాష్‌' జర్నలిజంలో విలువలు పెంపొందించడం కోసం ఎంతవరకైనా వెళతానని ప్రకటించారు. దీంతో..ఆయన నూతన ఛానెల్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అయితే ఆయన ఇప్పటికే స్వంతంగా 'మోజో' టీవీని నిడిపిస్తున్నారు. తాజాగా సంఘటనలతో ఆయన పూర్తిగా 'మోజో' టివికే అంకితం అవుతారని అందరూ భావించగా..ఉదయం నుంచి ఆయన ఐన్యూస్‌ను టేకోవర్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.దీనిపై జర్నలిస్టు వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొందరు ఆయన 'ఐన్యూస్‌'ను కొనుగోలు చేసినట్లు చెబుతుండగా, మరి కొందరు అదంతా అసత్యమని చెబుతున్నారు. 

ప్రస్తుతం 'ఐన్యూస్‌'ను మాజీ ముఖ్యమంత్రి 'కిరణ్‌కుమార్‌రెడ్డి' సోదరుడు నడిపిస్తున్నారు. అంతంత మాత్రంగా నడుస్తోన్న ఐన్యూస్‌ను వదులుకునేందుకు ఆయన సిద్ధం అయ్యారు. దీంతో..ఈ ఛానెల్‌ను 'రవిప్రకాష్‌' టేకోవర్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కొందరు సీనియర్‌ జర్నలిస్టులు స్పందిస్తూ..ఇంకా ఇది మాటల దశలోనే ఉందని, కొనుగోలు వ్యవహారాలు జరగలేదని అంటున్నారు. ఐన్యూస్‌ ఎండి 'సంతోష్‌రెడ్డి'తో కొందరు జర్నలిస్టులు మాట్లాడగా...కొనుగోలు జరగలేదని, ఒకవేళ 'రవిప్రకాష్‌' కొనేందుకు ముందుకు వస్తే సంతోషిస్తానని చెప్పారని ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద..అవమానకర పరిస్థితుల్లో టివి9 నుంచి బయటకు వచ్చిన 'రవిప్రకాష్‌' తానేమిటో నిరూపించుకునేందుకు మరో ఛానెల్‌ను ప్రారంభిస్తారని ఎక్కువ మంది జర్నలిస్టులు నమ్ముతున్నారు. ఒకవైపు ఫోర్జరీ కేసు, మరో వైపు నిధుల మళ్లింపు కేసును ఎదుర్కొంటున్న 'రవిప్రకాష్‌' నూతన ఛానెల్‌ను ప్రారంభించి విజయవంతం అవుతారా..? అనే ప్రశ్నలు సీనియర్‌ జర్నలిస్టుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం..ఏమి జరుగుతుందో..?

(765)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ