లేటెస్ట్

మంత్రివర్గ సమావేశం లేనట్లేనా...!?

ప్రజాసమస్యలపై చర్చించి, వారి సమస్యల పరిష్కారం కోసం సూచనలు చేయాలని భావించి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితి, శ్రీకాకుళంలో 'పెడా' తుఫాన్‌, మంచినీటి సమస్య, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి తగిన చర్యలు తీసుకోవాలనుకుంటే ఎన్నికల కోడ్‌తో మంత్రివర్గ సమావేశం వాయిదా పడుతూ వస్తోంది. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడు మంత్రివర్గ సమావేశం జరగడానికి వీలు లేదని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి కావాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై ఒక స్క్రీనింగ్‌ కమిటీని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలను గుర్తించి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు నోట్‌ పంపారు. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్‌ నుంచి ఇంత వరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. మొదట 10వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయాలని భావించినా..ఎన్నికల కమీషన్‌ జోక్యంతో అది ఆగిపోయింది. దరిమిలా 14వ తేదీన మంత్రివర్గ సమావేశం ఉంటుందని టిడిపి వర్గాలు పేర్కొన్నాయి. అయితే మారిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశంపై ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. 

14వ తేదీన మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేస్తే...ఎన్నికల ఫలితాలు రావడానికి 8 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ కొద్ది రోజుల కోసం మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు కొని తెచ్చుకోవడం ఎందుకు...? మరో వారం రోజుల్లో అటో..ఇటో తేలిపోతుంది.. కనుక..ఇప్పుడు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు అవసరం లేదని ఆయన భావిస్తున్నారని టిడిపి వర్గాలు పేర్కొంటు న్నాయి. ఎన్నికల కోడ్‌ ఉందని, తమదే సర్వాధికారం అన్నట్లు మాట్లాడుతున్న అధికారులను దారిలో పెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సమావేశం గురించి మాట్లాడారని,వాస్తవానికి ఆయన మంత్రివర్గ సమావేశం పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. మొత్తం మీద..మంత్రివర్గ సమావేశం అంటూ హడావుడి చేసిన టిడిపి పెద్దలు ఇప్పుడు దానిపై ఆసక్తి చూపడం లేదని, టైమే లేదని చెబుతున్నారని, ఇటువంటి దానికి ఎందుకు అనవసర హంగామా సృష్టించారనే ప్రశ్నలు స్వంత పార్టీ నుంచే వ్యక్తం అవుతున్నాయి.

(255)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ