WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

మళ్లీ వార్తల్లోకి వచ్చిన 'మైసూరారెడ్డి'...!

అప్పుడెప్పుడో...పిల్లాడు పిలిస్తే...సహాయం చేయడానికి వెళ్తున్నాని చెప్పి...'జగన్‌' పార్టీలోకి జంప్‌చేసిన సీనియర్‌ రాజకీయ నాయకుడు 'ఎం.వి.మైసూరారెడ్డి' 'జగన్‌' దెబ్బ రుచి చూశాక...బయట కనిపించకుండా తిరుగుతున్న ఆయన ఈరోజు హఠాత్తుగా వార్తల్లోకి వచ్చారు..! పెద్దనోట్ల రద్దుపై సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై తక్షణం స్పందించాలంటూ ఆయన హైకోర్టులో రిట్‌పిటీషన్‌ దాఖలు చేశారు. తమ సొంత సొమ్మును తాము తీసుకోకుండా బ్యాంక్‌లు అడ్డుకుంటున్నాయని...ఇది ఐపి పెట్టడమేనని ఆయన ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు. రద్దు అయిన నోట్లు బ్యాంక్‌ల్లో జమ చేసినా...తిరిగి ఖాతాదారులకు ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్లకు ఇస్తామన్న 2.5లక్షలు కూడా బ్యాంక్‌లు ఇవ్వడం లేదని, రోజుకు రూ.2వేలు ఇస్తామన్న బ్యాంకులు ఇప్పుడు ఆ డబ్బు కూడా ఇవ్వడం లేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు.  ఆయన వేసిన పిటీషన్‌పై హైకోర్టు రేపు విచారణ జరపబోతోంది. 

      కాగా మరో వైపు 'మైసూరారెడ్డి' తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 'జగన్‌'ను నమ్ముకుని వైకాపాలో చేరితే తన వయస్సుకూడా గౌరవం ఇవ్వకుండా 'జగన్‌' వ్యవహరించిన తీరుతో ఆపార్టీని వీడిన ఆయన ఇప్పుడు అధికార టిడిపి వైపు చేరాలని చూస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నేత సిఎం రమేష్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేయాలన్న సిఎం రమేష్‌ విజ్ఞప్తిని ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థి వివేకానందరెడ్డిని ఓడించడానికి వీరిద్దరూ వ్యూహాలుపన్నుతున్నట్లు కడప పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో టిడిపి తన రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని రెండోసారి ఇవ్వనందుకు నిరసనగా ఆయన వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. అయితే గతం...గతహ: అన్నట్లు ఆయన భావిస్తున్నారట.మళ్లీ టిడిపిలో చేరేందుకు అధినేత చంద్రబాబుతో సయోధ్యకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇటీవల ఒక ప్రెస్‌కాన్పరెన్స్‌లో మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో 'చంద్రబాబు' తప్పేంలేదని వెనకేసుకొచ్చారు. అంతే కాకుండా అది ఒక కేసే కాదని..దాని గురించి 'బాబు' భయపడాల్సిన అవసరమే లేదని ఘంటాపథంగా చెబుతున్నారు. అంటే మళ్లీ టిడిపిలో చేరాలనే ప్రయత్నాల్లో భాగంగానే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.


(417)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ