WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కిరణ్‌'ను 'కాంగ్రెస్‌' కూడా వద్దన్నదట...!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆఖరి సిఎం 'నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి'కి ఇప్పుడు ఏదీ కలసి రావడం లేదు. ఇటీవల రాజకీయ పెళ్లి చేసుకోవాలని భావించి అంతా సిద్ధం చేసుకుంటే పిల్లను ఇచ్చేవారు లేరని తేలడంతో పాత పెళ్లాంతో సర్దుకోవాలనుకున్నారట. అయితే పాత ఇంటిలోకి రానివ్వడానికి ఆ ఇంటి యజమాని ఒప్పుకోవడం లేదట. ఒకప్పుడు తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశానని, మరి నన్నేపార్టీలోకి రానివ్వరా? అంటూ ఆయన వాపోతున్నారట. ఇంతకీ పాత ఇళ్లు అంటే ఏమిటనుకుంటున్నారా...? కాంగ్రెస్‌ పార్టీ అండి...! తనను ఏ పార్టీ అయితే సిఎం సీటులో కూర్చోబెట్టిందో అదే పార్టీని తిరస్కరించి మళ్లీ అదే పార్టీలోకి రానివ్వమని బతిమలాడడం 'కిరణ్‌' ఉన్న స్థితికి నిదర్శనం. నిన్న మొన్నటి దాకా 'వైకాపా'లో చేరాలని భావించినా...'జగన్‌' ఆయనను రానివ్వమని తేల్చి చెప్పడంతో ఆ వైపు దారులు మూసుకుపోయాయి. ఇక కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును పట్టుకుని 'బిజెపి'లోకి వెళదామన్నా అక్కడా పరిస్థితులు అనుకూలించలేదు...దీంతో అధికార టిడిపి వైపు తమ్ముళ్లను పంపించాలని చూసినా 'చంద్రబాబు' ముందు ఆయన పప్పులు ఉడకలేదు..దీంతో కొత్త పార్టీ 'జనసేన'లో చేరాలని భావించినా అక్కడ 'పవన్‌'కు తప్ప వేరే వారికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇక మాజీ పార్టీనే మిగిలింది. అయితే కాంగ్రెస్‌ పార్టీలోకి కూడా ఆయనను రానివ్వడం లేదట. ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆయనను పార్టీలో చేర్చుకునేది లేదని తేల్చి చెప్పారట. ఒకప్పుడు తన మంత్రివర్గంలో పనిచేసిన 'రఘువీరారెడ్డి' ఇప్పుడు ఈరకంగా మాట్లాడడంతో 'కిరణ్‌' దిగ్బ్రాంతికి గురయ్యాడట. తాను పార్టీలోకి వస్తే మంగళహారతులు పడతారనుకుంటే ఇదేమిటి...? రఘువీరారెడ్డి ఇలా చేస్తున్నారని సన్నిహితులతో వాపోతున్నారట. ఒకప్పుడు అధికారం ఉందని విర్రవీగిన 'కిరణ్‌' అధికారాంతాన జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నారట. చేసుకున్నవారికి చేసుకున్నంత...అన్నారు..ఇటువంటి వ్యక్తులను చూసే...!


(1035)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ