WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పరిటాల' దెబ్బకు 'వైకాపా' అబ్బా...!

అనంతపురం జిల్లాలో తమకు ఉన్న పట్టును మరోసారి నిరూపించుకుంది 'పరిటాల' కుటుంబం. 'పరిటాల' హత్య తరువాత జిల్లాలో తమ బలం పెరిగిందని అప్పట్లో కాంగ్రెస్‌, తరువాత వైకాపా శ్రేణులు భావించాయి. 'రవి' హత్యానంతరం జిల్లాలో 'పరిటాల' కుటుంబ హవా తగ్గుతుందని,తమదే పెత్తనమని వారు భావించారు. అయితే 'రవి' లేకపోయినా 'పరిటాల' మాటే వేదవాక్కు అని ఆ జిల్లా వాసులు భావిస్తున్నారు. తాజాగా జరిగిన 'కనగానపల్లి' ఎంపిపి ఎన్నికల్లో ఆ విషయం రుజువైంది. గత ఎంపిపి ఎన్నికల్లో అధికార టిడిపికి మెజార్టీ రావడం టిడిపికి చెందిన వారు ఎంపిపి పదవి దక్కించుకోవడం జరిగిపోయింది. అయితే ఇటీవల కాలంలో టిడిపిలో విభేదాలు వచ్చి ఇద్దరు ఎంపిటిసి సభ్యులు ప్రతిపక్ష వైకాపాలో చేరారు. 'వై.ఎస్‌.జగన్‌' వారికి స్వయంగా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.దీంతో 'కనగానపల్లి' ఎంపిపిలో స్పష్టమైన మెజార్టీ వైకాపాకు వచ్చింది. మొత్తం 11మంది ఎంపిటిసి సభ్యుల్లో ఏడుగురు వైకాపాకు చెందిన వారు ఉండడంతో ఇక 'కనగానపల్లి' వైకాపా వంశమైనట్లేనని ఆపార్టీ వర్గాలు భావించాయి. అయితే ఇక్కడే 'పరిటాల' కుటుంబం చక్రం తిప్పింది. ఈ రోజు జరిగిన ఎంపిపి ఎన్నికల్లో ఆరు ఓట్లు టిడిపి అభ్యర్థి 'పద్మగీత'కు లభించగా, వైకాపా అభ్యర్థికి ఐదు లభించాయి. దీంతో ఎంపిపిని టిడిపి ఎగరేసుకుపోయింది. ఎన్నికలకు ముందు ఎంపిటిసిలతో మంత్రి సునీత స్వయంగా కలసి మాట్లాడడంతో ఇటీవల పార్టీ ఫిరాయించిన 'సురేందర్‌, వెంకట్రామిరెడ్డి'లు కూడా టిడిపికే ఓటు వేశారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న వైకాపాకు అవమానాలు తప్పలేదు. తమ అధినేత 'సురేందర్‌,వెంకట్రామిరెడ్డి'లను ప్రోత్సహించినా వారు 'పరిటాల' దెబ్బకు దడిసి టిడిపికి ఓటు వేశారని వైకాపా నేతలు అంతరంగిక సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. మొత్తం మీద 'పరిటాల రవి' ఉన్నా లేకున్నా... అనంతపురం జిల్లాలో 'పరిటాల' కుటుంబానికి ఎదురు లేదని మరోసారి ఈ సంఘటనతో రుజువైందని జిల్లా టిడిపి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు.


(2491)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ