WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వంశీ'పై 'జగన్‌' వల...!

మరో రెండేళ్ల తరువాత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండి ప్రజలలో పట్టుఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని 'జగన్‌' చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. తాజాగా ఆయన తెలుగుదేశంపార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి 'చంద్రబాబు' వైఖరిపై అసంతృప్తిగా ఉన్న వారిని తనపార్టీలో చేర్చుకోవాలని వ్యూహం పన్నారు. ఈ నేపథ్యంలో 'గన్నవరం' ఎమ్మెల్యే 'వంశీ'ని టార్గెట్‌ చేశారట. గతంలో 'విజయవాడ' పట్టణంలో వైకాపా అధినేత 'జగన్‌'ను పట్టపగలు వాటేసుకుని తమ మిత్రత్వాన్ని చూపించుకున్న 'వంశీ' ఇప్పుడు మళ్లీ అటువంటి పనే చేయబోతున్నారా...? టిడిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 'వంశీ' చేసిన పని...అప్పట్లో టిడిపి నాయకులకు, కార్యకర్తలకు చిర్రెత్తించింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలని వారు బహిరంగంగా డిమాండ్‌ చేశారు. దీంతో తాను చేసిన తప్పును తెలుసుకున్న 'వంశీ' అధినేత 'చంద్రబాబు' వద్దకువెళ్లి 'సారీ' చెప్పి...మళ్లీ ఇటువంటి పనులు మళ్లీ చేయనని చెప్పి వచ్చారు...! అప్పట్లో 'వంశీ' చేసిన పని వల్ల ఆయనకు 'గన్నవరం' టిక్కెట్‌ ఇవ్వకూడదని 'చంద్రబాబు' నిర్ణయించారు. అయితే తరువాత ఆయనపై భారీ స్థాయిలో వత్తిడి రావడంతో ఆయనకు టిక్కెట్‌ను ఇచ్చారు. ఎన్నికల్లో టిడిపి గెలిచినా 'వంశీ'ని 'బాబు' కొంచెం దూరంగానే ఉంచుతున్నారు. అప్పట్లో ఆయన చేసిన పనిని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు 'బాబు'..'వంశీ' మధ్య ఉన్న విభేదాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. 

  ఈ పరిస్థితుల్లో 'వంశీ' పార్టీ మార్పుపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.  ఈ నియోజకవర్గంలో ఒక సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువమంది ఓటర్లు. వారంతా అధికార టిడిపి పక్షాన నిలవడం ఖాయం...ఈ విషయం 'వంశీ'కి తెలుసు. ఏదో విధంగా ఆయనను టిడిపి నుండి బయటకు తీసుకురావాలని ఆయన సన్నిహితులైన ముగ్గురు మిత్రులను రంగంలోకి దించాలని 'జగన్‌' ఆలోచిస్తున్నారట. ఆ ముగ్గురిలో ఒకరు 'గుడివాడ' ఎమ్మెల్యే 'కొడాలి నాని' కాగా...మరో ఇద్దరు గత ఎన్నికల్లో 'జగన్‌'పార్టీ తరుపున పోటీ చేసిన ఓడిపోయిన 'పేర్నినాని, వంగవీటి రాధాకృష్ణ'లు. ఒకప్పుడు ఈ నలుగురు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేవారు. ఇది రాజకీయ నాయకులందరికీ తెలుసు. 'కొడాలి నాని' టిడిపి నుండి 'జగన్‌'పార్టీలో చేరి 'గుడివాడ' నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఒక సమయంలో 'నాని' కూడా 'టిడిపి'లో చేరతారని ప్రచారం జరిగినా...జిల్లా పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడం ఆ ప్రచారం నిలిచిపోయింది. 

   తాను టిడిపిలో చేరేందుకు ప్రయత్నించలేదని...తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారం చేశారని 'నాని' వాపోయారు. 'గన్నవరం' నియోజకవర్గంలో పూర్తిగా పట్టుసాధించగలిగారంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యపడిందని ఆయనకు కూడా తెలుసు. అది స్వంత బలం కాదని, రాజకీయంగా తప్పటడుగులు వేస్తే..పదవులు కోల్పోవలసి వస్తుందని 'వంశీ' సన్నిహితులు చెబుతున్నారు. దీనిపై 'వంశీ'ని సంప్రదించేందుకు 'జనం ప్రత్యేక ప్రతినిధి' పలుసార్లు ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. మిత్రుల బలవంతంపై పార్టీ మారతారా...? లేక స్వంత కాళ్లపై నిలబడి 'టిడిపి'లోనే కొనసాగుతారా...? అనే విషయంపై ఆయన అనుచర వర్గాన్ని పలువురు ప్రశ్నించగా 'మా నాయకుడు..టిడిపిని వీడిపోయే సమస్య లేదు...ఎవరెన్ని కుట్రలు పన్నినా...ఒత్తిడిలు తెచ్చినా..'వంశీ' టిడిపిలోనే కొనసాగుతారు..మళ్లీ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గతంలో కన్నా రెట్టింపు మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంత మందిని కాదని..'వంశీ' పార్టీ నుండి బయటకుపోయే ప్రసక్తేలేదని స్పష్టం అవుతుంది. కానీ..'జగన్‌' తన ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించబోతున్నారు. పాత మిత్రులతో ఇప్పటికీ సన్నిహితంగా మెలిగే 'వంశీ' రాజకీయాలు వేరు...స్నేహితులు వేరు అనే విధంగా ఉంటారా...? లేక స్నేహితుల సలహానే పాటించి పార్టీ మారతారా...? వేచి చూడాల్సిందే...!


(584)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ