WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నారాయణ' పెత్తనం...నెల్లూరు టిడిపి కొంపముంచనుందా...?

నెల్లూరు జిల్లాలో ఇంతకు ముందు టిడిపి, కాంగ్రెస్‌ ప్రభుత్వాలలో జరగని సంఘటనలు తాజాగా జరుగుతున్నాయి. మున్సిపల్‌ మంత్రి నారాయణ నెల్లూరు జిల్లాలో అధికార యంత్రాగాన్ని శాసించడం, ఆయనకు జిల్లా పార్టీ అధ్యక్షుడు 'బీదరవిచంద్ర' సహకరించడంతో పాటు 'నారాయణ' సామాజికవర్గానికి చెందిన కొంత మంది నాయకులు పలురకాలైన పనులు చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యావ్యాపారం చేస్తూ నెల్లూరు జిల్లా నుండి ఇతర జిల్లాలకు వలస వెళ్లిన 'నారాయణ' ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవి పొందారు. నెల్లూరు జిల్లాలో పెత్తనం చేయడంపై 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన నాయకులతో పాటు కార్యకర్తలు కూడా భరించలేకపోతున్నారు. ఒక అధికారిని బదిలీ చేయాలన్నా...ప్రమోషన్‌ ఇప్పించాలన్నా...ఫోస్టింగ్‌ కావాలన్నా...'నారాయణ' సిఫార్సు లేనిది సాధ్యపడదట. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవించదర్‌ కూడా 'నారాయణ' బాటలోనే నడుస్తూ ఇతర వర్గాల్లో పార్టీపై వ్యతిరేకత తీవ్రతను పెంచుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

   నెల్లూరు జిల్లాలో ఇన్నేళ్లనుండి అధికారం చెలాయించిన 'రెడ్డి' సామాజికవర్గనాయకులు, పార్టీకి చెందిన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ప్రతినిధులు 'నారాయణ' పెత్తనాన్ని సహించలేకపోతున్నారు. ఈ విధమైన పరిస్థితి మరికొన్నాళ్లు కొనసాగితే ఇంతకు ముందు ఎన్నికల్లో నాలుగు సీట్లు వచ్చాయని...ఈసారి సింగిల్‌ సీటు కూడా రాదని అధికారపార్టీ నాయకులు చెబుతున్నారు. 'రెడ్డి' సామాజికవర్గం ఓటర్లు అధికంగా ఉన్న ఈ జిల్లాలో 'బలిజ' సామాజికవర్గానికి చెందిన విద్యావ్యాపారి 'నారాయణ' పెత్తనం చేయడం ఏమిటి...? జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ రవిచంద్ర ఆయనకు వంత పాడడం ఏమిటి...?వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారేమో...? అని వ్యంగ్యంగా పార్టీ నాయకులు అంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం అవుతుంది. ఈ జిల్లాలో తమ సిఫార్సులకు 'నారాయణ' 'రవిచంద్ర'లు విలువ ఇవ్వడం లేదని, ఓడిపోయిన టిడిపి అభ్యర్థులతో పాటు, స్థానిక సంస్థల ప్రతినిధులు 'చినబాబు' దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాకు ఎప్పుడు వస్తారో తెలియదు...ఏమి చేస్తారో తెలియదు...! అర్థరాత్రి పర్యటనలతో అధికారులను, ఉద్యోగులను అదరగొట్టారని పత్రికల్లో ప్రచురించాకే మాకు తెలుస్తుంది. ఇదంతా 'నారాయణ' 'రెడ్డి' సామాజికవర్గాన్ని అణదొగ్గేందుకే నియంత లాగా వ్యవహరిస్తున్నారని ఆయనను తీవ్రంగా వ్యతిరేకించే 'రెడ్డి' సామాజికవర్గం నమ్ముతుంది. 

   గత 40సంవత్సరాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, 'నెల్లూరు' జిల్లాలో అధికారాన్ని 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారే గుప్పెటలో పెట్టుకునే వారు. ఎన్నికల్లో గెలిచిన వారే మంత్రి పదవి పొందేవారు. తాజా పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఒకటి రెండు నియోజకవర్గాల్లో మాత్రమే కొంత శాతం 'నారాయణ' సామాజికవర్గ ఓటర్లు ఉన్నారని, రాజకీయంగా వారు ఏనాడూ తెరపైకి రాలేదని, ప్రస్తుతం ఆ సామాజికవర్గం అధికారం చెలాయిస్తుంటే మండిపడుతున్నారని తెలుగుదేశం పార్టీకి ఆది నుండి మద్దతుదారులైన నాయకులు కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ 'నారాయణ' పెత్తనం 'నెల్లూరు' టిడిపి కొంపముంచబోతోంది. ఇప్పటికైనా 'చంద్రబాబు' కళ్లు తెరవకుంటే 'జగన్‌' కంచుకోటను మరింత బలేపేతం చేసినట్లు అవుతుందని రాజకీయవిశ్లేషకులు కూడా చెబుతున్నారు.

(358)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ