WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ ర్యాంకుల వెనుక కలెక్టర్‌ భాస్కర్‌...!

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 14అంశాలను అమలు చేయడంలో పశ్చిమగోదావరి జిల్లాకు ఆరు ర్యాంకులతో పాటు టాప్‌ ర్యాంక్‌ గోపాలపురం నియోజకవర్గానికి రావడం వెనుక ఆ జిల్లా కలెక్టర్‌ 'కాటంనేని భాస్కర్‌' ప్రత్యేక దృష్టి సారించడమే కారణమని జిల్లా అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ జిల్లాకు ఆ ర్యాంకులు రావడం వెనుక కలెక్టర్‌ భాస్కర్‌ కృషే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పరోక్షంగా కొనియాడుతున్నారు. 14 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ర్యాంకులను ప్రకటించారు. వీటిలో స్థూలఆదాయం, తలసరి ఆదాయం, విద్యుత్‌ వినియోగం, నీటికనెషన్లు, బహిరంగ మలవిసర్జన నిర్మూలన కార్యక్రమం, నీరు-ప్రగతి, జనాభా మరణాలు రేటు, మీ కోసం ధరఖాస్తుల పరిష్కారం, ఎన్టీఆర్‌వైద్యసేవలు, ఫించన్లు, రోడ్లు, పదోతరగతి ఉత్తీర్ణతశాతం పెంచడంలో కలెక్టర్‌ భాస్కర్‌ ఎంతో కృషి చేశారని ఆ జిల్లాకు చెందిన రాజకీయనాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నాయకులు, ప్రజాప్రతినిధులు అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ ఆయా నియోజకవర్గాలపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిసారించి నిత్యం అధికారులను పరుగులు పెట్టించి ఆయా ప్రతినిధులతో సమన్వయంతో వ్యవహరించడం, ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించడంలో ఈ ర్యాంకులు వచ్చాయని కొందరు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 

  మిగతా జిల్లాల కన్నా..పశ్చిమగోదావరి జిల్లాలో అధికార అవినీతి తగ్గిన నేపథ్యంలో ఈ ర్యాంకులు రావడానికి కారణమయ్యాయని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు చెబుతున్నారు. కలెక్టర్‌ భాస్కర్‌ జాయింట్‌ కలెక్టర్‌ కోటేశ్వరరావుతో పాటు ఇతర జిల్లాస్థాయి అధికారులు నిజాయితీపరులు కావడంతో ఈ ర్యాంకులు దక్కాయని ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి తీసుకుని 'పశ్చిమ' కలెక్టర్‌ ఏ విధంగా విజయ పథంలోకి దూసుకెళ్లారో మిగతా కలెక్టర్లు కూడా అదే రీతిలో ముందుకు పోవాలని కలెక్టర్ల సమావేశంలో 'చంద్రబాబు' కోరారు. గడిచిన రెండున్నరేళ్లగా కొంత మంది ప్రజాప్రతినిధులు సహకరించకపోయినప్పటికీ అధికారులను, ఉద్యోగులను ఒకతాటిపై నడిపించి, కుల,మత,రాజకీయపార్టీలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతికి తావివ్వకుండా పారదర్శకంగా వ్యవహరించడం వల్లనే ఈ ర్యాంకులు లభించాయన్నది వాస్తవం. కొంత మంది ప్రజాప్రతినిధులు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ, ఉండి ఎమ్మెల్యే శివరామరాజు, భీమవరం ఎమ్మెల్యే అంజిబాబులు నిజాయితీపరులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ కారణంతోనే వారి నియోజకవర్గాల్లో నిజాయితీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘనత జిల్లా కలెక్టర్‌ భాస్కర్‌కు, ఆయన ఆధ్వర్యంలో పనిచేసిన కోటేశ్వరరావుకు ఇతర శాఖ అధికారులకు దక్కిందని చెప్పవచ్చు.


(251)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ