WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రవాణాశాఖ'లో తగ్గని అవినీతి...!

'రవాణాశాఖ'లో అవినీతిని తగ్గించేందుకు ఆశాఖ కమీషనర్‌ 'బాలసుబ్రహ్మణ్యం' చేపట్టిన చర్యలు కొంత మేర విజయవంతం అయ్యాయి. అనేక మంది అవినీతి అధికారులపై ఎసిబి దాడులు నిర్వహించింది. వందల కోట్ల రూపాయల అక్రమధనం బయటపడింది.అయినా సరే..ఇప్పటికీ ఆశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులు సరికొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. ఇంతకు ముందు నేరుగా లంచాలు తీసుకునే ఈ వర్గాలు తాజాగా ఏజెంట్లకు కోడ్‌ నెంబర్లు ఇస్తూ ముక్కుపిండి లంచాలు వసూళ్లు చేస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయాల్లో పని ఉందంటే తప్పనిసరిగా ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వారు కల్పిస్తున్నారు.ఏజెంట్లు పనులను చక్కబెట్టి వేలాది రూపాయలను వసూలు చేసుకుంటూ తమ వంతు వాటాలను కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కార్యాలయాల్లో పనిచేయాల్సిన స్వైపింగ్‌ యంత్రాలు పనిచేయడం లేదని రెండు,మూడు రోజుల తరువాత మళ్లీ రండి అని తిరిగి పంపిస్తున్నారు. 

   దీంతో ఏజెంట్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వాహనదారులకు ఏర్పడింది. నెంబర్‌ ప్లేట్లకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒకవైపు రవాణాశాఖలో అవినీతిని తగ్గించగలిగానని 'బాలసుబ్రహ్మణ్యం' భావిస్తున్నా కింది స్థాయిలో కొంత వరకు అవినీతి తగ్గినా అది పూర్తిగా నిర్మూలన కాలేదు. స్వైపింగ్‌ యంత్రాలు పాడు అయిపోయాయని, సర్వర్‌డౌన్‌ అయిందని, వాహనదారులను ఇబ్బంది పెడుతూ 'మీరు ఫలానా వారిని కలిస్తే..మీ పనులు వెంటనే అయిపోతాయని అక్కడి సిబ్బంది చెప్పడంతో...చేసేదేమీ లేదని...వీరందరూ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే ఒక్కొక్క ఏజెంట్‌కు ఒక్కొక్క కోడ్‌ నెంబర్‌ను ఈ శాఖ అధికారులు కేటాయించారు. ఆ నంబర్‌ను బట్టి ఆ పనిని ఆగమేఘాలపై పూర్తి చేస్తారు..అటువంటి అధికారుల విషయం 'బాలసుబ్రహ్మణ్యం' దృష్టికి వచ్చింది. ఎసిబి అధికారులకు కొంత మంది ఫిర్యాదు చేశారు. పారదర్శకత అనేది కేవలం కార్యాలయ బోర్డులకే పరిమితమవుతుంది తప్ప...అవినీతి మాత్రం తగ్గలేదని, ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేసినా వారిని పరోక్షంగా ప్రోత్సహిస్తూ భారీగా దండుకుంటున్నారు. స్వైపింగ్‌ యంత్రాలను వారే చెడగొడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పెద్దనోట్లను రద్దు చేయడంతో స్వైపింగ్‌ యంత్రాలను ఏర్పాటు చేయడం, అధికారులకు, సిబ్బంది మింగుడుపడడం లేదు..అందుకే అవి ఎప్పుడూ మర్మమత్తులోనే ఉన్నాయని చెబుతున్నారు.  దీనిపై ప్రత్యేక దృష్టిసారించేందుకు 'బాలసుబ్రహ్మణ్యం' సిద్ధం అవుతున్నారు. ఏది ఏమైనా లంచాలకు అల‌వాటు పడ్డ సిబ్బంది కొంత దూకుడు తగ్గించారే తప్ప...నూతన మార్గాలను అన్వేషించి లంచాలను దండుకుంటూనే ఉన్నారు.

(262)
  • (0)
  • -
  • (0)


అభిప్రాయాలూ