WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

గత సీఎంల వద్ద జర్నలిస్ట్ లు పని చేయలేదా?

అప్పుడెందుకు నోరెత్తలేదు?

25 మంది జర్నలిస్ట్ ల కడుపు కొట్టడానికేనా ఈ కుట్ర?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు అధికారికంగా లంచాలు ఇచ్చారు అంటూ.. న్యాయవాది ప్రశాంత్ భూషణ్   అర్థరహితమైన అరాచకమైన వ్యాఖ్య చేయడం, దానిని కొందరు సోషల్ మీడియా మహాశయులు, కొన్ని పత్రికలూ కోతికి కొబ్బరి కాయ దొరికిన చందంగా మోయడం గర్హించదగ్గది. సమాజంలో సమస్యలే లేనట్లు ఇదే వారి ప్రధాన సమస్యగా ప్రసారం చేయడం, కథనాలు వండి వార్చేయడం దారుణం. నీచాతి నీచం. ఇది జర్నలిస్టులుగా ఉన్న  అనేక మందికి బాధ కల్గించే విషయం.

    ప్రస్తుతం జీతాలివ్వని, ఎప్పుడిస్తారో క్లారిటీలేని మీడియాలో పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఆర్థిక సంక్షోభంలో కొట్టమిట్టాడుతూ కొన్ని మీడియా సంస్థలు, డబ్బున్నా విదల్చలేని స్థితిలో మరి కొన్ని సంస్థలు, జర్నలిస్టులతో ఆటలాడుకుంటున్న ఘటనలు కొత్తగా చెప్పవలసిన పనే లేదు. చాలీ చాలని జీతంతో ఏ రోజుకారోజు ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అనే రోజులు లెక్కపెట్టుకుంటు జీవిత పయనం సాగిస్తున్నాడు సాధారణ జర్నలిస్ట్. వీలయినంతలో నిజాయితీగా పని చేస్తూ, ప్రజల సమస్యలపై స్పందిస్తూ ఈ వృత్తినే నమ్ముకుని శేష జీవితం గడిపేద్దామా అంటే..  భరోసా లేదు. ఇటువంటి విపత్కర పరిస్థితి నుంచి బయట పడడానికి, కుటుంబం గడవడానికి తన వృత్తితో సంబంధమైన ఇతరత్రా ఉద్యోగ ఉపాధి వేటలో పడ్డారు చాల మంది. ప్రజా సంబంధాల అధికారులగానో, మీడియా లైజనింగ్ అధికారులగానో, పత్రిక సంబంధ వ్యవహారాలను పర్యవేక్షించే వ్యక్తులుగానో తమ ఉద్యోగ అవకాశాలను వెతుక్కొంటున్న అనేక ఉదాహరణలు మన ముందు కనిపిస్తున్నాయి.

    జాతీయ స్థాయిలో మీడియా లో ఉన్నత స్థానాలలో ఉన్నవారి దగ్గర నుంచి కింద స్థాయి లో వివిధ హోదాల్లో పత్రిక రంగంలో పనిచేస్తున్న అనేక మంది ఈ ప్రయత్నాలకు అతీతులు కారనేది నిర్వివాదం. ఇటువంటి వ్యక్తుల అవసరాలు అనేక దశాబ్దాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటున్నాయి. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకూ అవసరమే. ఎకనామిక్ టైమ్స్, బిజినెస్ స్టాండర్డ్ వంటి ప్రతిష్టాత్మకమైన మీడియా హౌస్ లలో పని చేసిన సంజయ్ బారూ మొదలుకొని, సీనియర్ జర్నలిస్టులు పొత్తూరి వెంకటేశ్వర రావు గారు, దేవులపల్లి అమర్, వల్లీశ్వర్ గారు ... ఇలా అనేక మంది పేరు గడించిన జర్నలిస్టులు గడచిన రెండు దశాబ్దాలలో ప్రభుత్వాల్లో పని చేసిన ఉదంతాలు మనం చూడలేదా?.  వీరంతా వారి పదవుల పేర్లు ఏమైనప్పటికీ జర్నలిస్టులుగా గడచిన ప్రభుత్వాల్లో పని చేయలేదా?  వారి దగ్గర నుంచి  ఈ తరంలోని మనమంతా జర్నలిజం పాఠాలు నేర్చుకోలేదా? ఉద్యోగార్థం తనకు వచ్చే అవకాశాలను కాదనకుండా ప్రభుత్వాల్లో పనిచేసే వారు కొందరు, ఉద్యోగం కావాలంటూ ప్రభుత్వాలు చుట్టూ తిరిగే కొందరిని చూస్తున్నాం. భుక్తి మార్గాన్ని అన్వేషించక తప్పడం లేదు. వృత్తిని అమ్ముకొనే వారి సంగతెలా ఉన్న, వృత్తిని నమ్ము కున్న వారి పరిస్థితి మాత్రం వేదనా భరితంగా ఉంది. సాధారణ మీడియా నుంచి ప్రపంచం డిజిటల్ మీడియా వరకు విస్తరిస్తోంది. ఇంకా పాత పద్ధతులతో పరుగు పందెంలో నిలవగలమా లేదా అనేది ప్రతి ఒక జర్నలిస్ట్ తనకు తానూ ప్రశ్న వేసుకుంటే పరిస్థితి కళ్లకు కడుతుంది.

   తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాలం లో సమాచార, పౌరసంబంధాల శాఖతో పాటు కొందరు మంత్రుల దగ్గర కూడా అనేక మంది జర్నలిస్టులు పనిచేస్తూ వస్తున్నారు. పార్టీలకి బలంగా నిలుస్తున్న వారూ జర్నలిస్టులే. ఎంఎన్ సీ కంపెనీలకు, సినిమాలకు పీఆర్ఓలుగా పని చేసేది జర్నలిస్టులే. జర్నలిస్టుల అవసరం, ఆవశ్యకత లేని రంగాల లిస్టు చెప్పడం అసాధ్యం. ప్రభుత్వాలు చేసే వివిధ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతలను మీడియా సాధక బాధకాలు తెలిసిన వ్యక్తులకు ఇస్తేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది అనే అభిప్రాయం పాలకుల్లో ఉండడం తప్పు కాదు. తప్పే లేదు. అందుకు తగ్గ జీతంతో ఉద్యోగిగా పనిచేయడం ఎవరిని నొప్పించేది కాదు.పైగా ఇంకొంతమందికి ఉపాధికి, కుటుంబ భారాలను మోసేందుకు అది ఉపయోగకరం. దీనిలో ఇమిడి ఉన్న మరో ముఖ్య అంశం... కేవలం  భజన చేసే కార్యక్రమం కాకుండా, నిర్ణయాలు, విధానాలు గాడి తప్పుతున్న సందర్భాల్లో ప్రజల అభిప్రాయాలకు అద్దం  పడుతూ సునిశిత విమర్శనాత్మకంగా దృష్టితో తగు సలహాలు ఇచ్చే అవకాశం కూడా కల్పించిన ప్రస్తుత పరిస్థితి చాల మందికి అర్థం కానీ విషయం. అర్థమయిన దాన్ని పట్టించుకోకుండా అనవసరమైన వాటినే వెలుగులోకి తెచ్చి నానా యాగి చేయడం కొందరికి లాభం. మరికొందరికి సరదా. మీడియాలో వచ్చే సానుకూల వార్తలే కాదు, విమర్శనాత్మకమైన వార్తలకు కూడా తగు విధంగా ప్రభుత్వం వ్యవహరించాలనే స్వీయ వ్యవస్థ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం బయటకు చెప్పనవసరం లేని ముఖ్య అంశం. స్పందించాల్సిన మానవీయ కథనాలను సీఎం, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లడం కూడా మన విధి.

ఈ నేపధ్యాన్ని తెలుసుకోకుండా అవగాహనా రాహిత్యంతో వారికున్న లౌక్యాన్ని రంగరించి..అనుభవాన్నంతా ఈ విషయంపైనే కుమ్మరించి సామజిక మాధ్యమంలో ఎటువంటి వ్యాఖ్యలైన చేయవచ్చు అనే ఆలోచన ధోరణి ప్రశాంత్ భూషణ్ స్థాయి న్యాయ కోవిదులకు సరికాదు. ఆయనకు వంత పడుతూ వేలం వెర్రిగా తమ రచనా కౌశలాన్ని..కలం బలాన్ని మీడియా వేదిక గా దుర్వినియోగం చేయడం కూడా జర్నలిస్టు మిత్రులకు మంచిది కాదు. వారికి వ్యక్తిగతంగా లాభం చేసేదీ కాదన్నది  విజ్ఞప్తి !మీడియా మిత్రులారా ఇక ఈ  అనవసర రాద్ధాంతానికి దయచేసి స్వస్తిపలకండి!. మీ వల్ల మీతో పని చేసిన సహ జర్నలిస్ట్ ల జీవితాలు, వారి కుటుంబాలు ఇప్పటికే  రోడ్డున పడనున్నాయి. మానవత్వంతో స్పందించండి. లేదా దమ్ముంటే మీరే వారికి ఉద్యోగావకాశాలివ్వండి. వచ్చిన అవకాశంతో ఏదోలా బతుకీడుస్తుంటే దయచేసి ఆ జర్నలిస్ట్ ల పొట్ట కొట్టకండి.

(గోపాల‌రావు)


(422)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ