WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

అవినీతిలో 'శ్రీకాకుళం' టాప్‌...!

ఒకప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అవినీతి మచ్చుకైనా కనిపించేది కాదు..! అక్కడ అభివృద్ధి జరగకుండా బాగా వెనుకబడి పోయిందని ప్రచారం జరిగేది. అటువంటి జిల్లా అవినీతిలో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని ఆక్రమించిందట. ఇదంతా అధికారపార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వల్లేనని ప్రచారం జరుగుతుంది. గతంలో చంద్రబాబు హయాంలో ప్రారంభమైన అవినీతి, కాంగ్రెస్‌ హయాంలో రెట్టింపు అయింది. తాజాగా ఈ రెండున్నరేళ్ల కాలంలో ఆ రెట్టింపుకు డబుల్‌ రెట్టింపు అయిందని విమర్శలు వస్తున్నాయి. శ్రీకాకుళం ఎమ్మెల్యే మినహా మిగతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులందరూ అందినంత వరకు దండుకుంటూ దోచుకుని కోట్లకు పడగలెత్తారు. ప్రాంత అభివృద్ధి కన్నా సొంత అభివృద్ధినే మిన్నగా భావిస్తూ, ప్రజా సేవను మరిచిపోయి కోట్లు గడించారు. గత ఎన్నికల్లో పెట్టిన ఖర్చు కన్నా పదిరెట్లు అదనంగా సంపాదించాలన్న ఏకైక దృక్ఫదంతో అవినీతిలో రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో నీరు-చెట్టు, ఇంకుడు గుంతలు, రహదారుల నిర్మాణాలు, నీటిపారుదల కాంట్రాక్టు పనులు, కాల్వల మరమ్మత్తులు వాటి నిర్మాణాలు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌లు, ప్రమోషన్లు, పంచాతీరాజ్‌ క్రింద నిర్మించే రహదారులు, ఆర్‌డబ్ల్యుఎస్‌ కింద  జరిగే మంచినీటి ట్యాంకుల నిర్మాణాలు, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద విడుదల అవుతున్న నిధులు, ప్యాకేజీలు, చివరకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలను కూడా అమ్ముకుంటున్నారట. మీరు చేసే పనిలో నాణ్యత ఉందో లేదో...మాకు అవసరం లేదు...మా వాటా మాకు ఇవ్వాల్సిందే...! లేదంటే మీ అంతు చూస్తాం..మీరు చేసిన పనుల్లో నాణ్యత లేదని బయటపెడతాం...అని జిల్లా మంత్రి అచ్చెంనాయుడుతో సహా మెజార్టీ ఎమ్మెల్యేలు బెదిరించి పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.

    సీనియర్‌ శాసనసభ్యుడు గౌతుశ్యామ్‌సుందర్‌ శివాజీ పేరుతో ఆయన అల్లుడు చక్రం తిప్పుతున్నారని ఆ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెబుతారు. కేవలం ఇసుక అక్రమ సరఫరాతో కోట్లు సంపాదించారంటే ఎంత అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందో తెలుస్తుంది. రోజుకు వందల లారీల ఇసుక విశాఖపట్నానికి తరలిపోతుందట. మాజీ మంత్రి కావడంతో 'శివాజీ'కి ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత విలువ ఇస్తారు. మంత్రి పదవి రాలేదని అసంతృప్తి ఉన్నప్పటికీ ఇసుక అక్రమ మార్గాలను ఎన్నుకొని ప్రత్యర్థులు ఊహించని స్థాయికి ఆయన వెళ్లారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమీక్షల్లో, సమావేశాల్లో అభివృద్ధి పనుల తీరుపై కొంత మంది ఎమ్మెల్యేలు ఎండగట్టడం వెనుక వారికి కాంట్రాక్టర్లు నుంచి డబ్బులు ముట్టకపోవడమేనట. అన్ని జిల్లాల్లో పదిశాతం కమీషన్‌ ఇస్తున్నారు..మాకు కూడా ఇవ్వండి...అని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పాత తరం ఎమ్మెల్యేలు, నవతరం ఎమ్మెల్యేలు కూడా ఈ అవినీతిలో పరస్పరం పోటీ పడుతున్నారట. ఒక ఎమ్మెల్యే పదిహేను కోట్ల వరకు ఇప్పటి వరకు సంపాదించారంటే ఆయన ఎంత దోపిడీకి పాల్పడ్డారో స్పష్టం అవుతుంది. మరొక ఎమ్మెల్యే నిజాయితీ ముసుగులో ఖరీదైన కానుకలను తీసుకుంటూ కోట్లు సంపాదించారట. 

  సరిహద్దు ప్రాంతాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు లిక్కర్‌ వ్యాపారంతో కుమ్మక్కై బాగానే వెనకేసుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే నేరుగా ఎవరినీ లంచాలు అడగరు. తన స్వంత మనిషి ద్వారా ఆదేశాలు ఇప్పిస్తారు. వారి ద్వారా లంచాలు ఇస్తే ఈ ఎమ్మెల్యే పనిచేస్తారు. అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు నేరుగా ఆయనే మాట్లాడుకుంటారు. ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న వారు కూడా దుమ్ము దులుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలు అమాయకులు అనే పేరుంది. అప్పట్లో 'ధర్మాన' సోదరులతో... ఎర్రంనాయుడు సోదరులకు లోపాయికారీగా ఒప్పందాలు ఉండేవని విమర్శలు వచ్చాయి. అప్పుడు ఆ సోదరులు...ప్రస్తుతం ఎర్రం నాయుడు సోదరుడు అదే బాటలో నడుస్తున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే మినహా (ఆమె భర్త మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ ఆయన కూడా అత్యంత  నిజాయితీపరుడు) మిగతా వారందరూ పదీ,ఇరవై, యాభై, వంద కోట్ల ఆస్తులకు పడగలెత్తారని అధికారవర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ జిల్లా కలెక్టర్‌తో పాటు అతి కొద్ది మంది అధికారులు మాత్రమే నిజాయితీగా పనిచేస్తున్నారు. అధికార అవినీతి అంతంత మాత్రమే ఉండగా, రాజకీయ అవినీతి రాష్ట్రంలో మొదటి స్థానానికి చేరుకుంది.


(264)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ