WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తూ.గో నాయకుల అవినీతికి అడ్డే లేదా...?

తూర్పుగోదావరి జిల్లాలో అధికారపార్టీలోని మెజార్టీ నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు, మంత్రి సోదరులు అవినీతి వ్యవహారంలో బరితెగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మినహా మిగతా వారందరూ అధికారం ఉండగానే మరో యాభై ఏళ్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రజలేమనుకుంటే మనకేమిటి...? వాళ్లు కూడా సొమ్ములు తీసుకుని ఓట్లు వేస్తున్నారు...మళ్లీ ఓటు కొనాలంటే ఇంత కన్నా ఎక్కువ సొమ్ము ఇవ్వాలని...ఎక్కడైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో...? ఆ మార్గాలను తెలుసుకుని పరస్పరం పోటీపడుతూ అవినీతిలో దూసుకుపోతున్నారు. మద్యం సిండికేట్ల నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలకు, ఇన్‌ఛార్జిలకు భారీగానే ముడుపులు అందాయి. గ్రావెల్‌దోపిడీ, ఇసుక దోపిడీని ఎవరూ ఆపలేకపోతున్నారు. చివరకు నామినేటెడ్‌పోస్టులను కూడా అమ్ముకుంటున్నారు. కాకినాడలో ఎమ్మెల్యే పేరుతో వసూళ్ల కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 

   రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల వద్ద ముక్కుపిండి వసూళ్లు చేస్తున్నారు. ఇసుక తవ్వకాలకు అనుమతి లేని ప్రదేశాల్లో కూడా ఇసుక దోపిడీని జరుగుతుండగా వారి వద్ద నుండి ఎమ్మెల్యేలు భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నారు. 'జగన్‌' పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ఆయా పార్టీ నాయకులతో, స్థానిక నాయకులతో చేతులు కలిపి ఇసుక దందాలు, ఇతర సెటిల్‌మెంట్లు, పేకాట క్లబ్‌ల ద్వారా కోట్లు గడిస్తున్నారు. చివరకు వివాదాల్లో కూరుకుపోయిన ఇంటి స్థలాలను, భూములను ఎమ్మెల్యేల పేరుతో వారి అనుచర వర్గం కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. ఈ జిల్లాలో క్రికెట్‌ బుకీలపై కేసులు పెట్టినప్పుడు ఎమ్మెల్యేలు వారిని విడిపించి, పోలీసులపై దౌర్జన్యాలకు దిగారు. హోంమంత్రి ఈ జిల్లాకు చెందిన వారైనప్పటికీ మాపై దాడి జరగడం బాధకల్గిస్తుందని అనేక విషయాల్లో మౌనంవహిస్తున్నామని, అప్పుడప్పుడు తమ ఉనికిని కాపాడేందుకు చేస్తోన్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారని  పోలీసులు చెబుతున్నారు. ఇసుక అక్రమాలకు, ఇతర అక్రమాలకు అండగా ఉండి ప్రజాప్రతినిధులు లంచాలు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి పనుల్లో, ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలకు వాటాలు అందుతున్నాయి. బినామీ పేర్లతో ఎమ్మెల్యేలు కొన్ని కాంట్రాక్టులు చేయిస్తున్నారట. 

  తుని నుండి గతంలో ప్రాతినిధ్యం వహించి ఆరుసార్లు విజయం సాధించి, ఏడోసారి ఓడిపోయి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న యనమల రామకృష్ణుడు బంధువులు అవినీతి రేట్లను నిర్ణయిస్తూ నిరాటంకంగా, నిర్భంధంగా, బెదిరింపులతో బాగా వెనుకేసుకుంటున్నారట. ఆర్థికమంత్రి దృష్టి విశాఖపట్నంపై ఉండగా ఆయన కుటుంబ సభ్యులు 'తుని' ప్రాంతంపై దృష్టిపెట్టి బాగా సంపాదిస్తున్నారట. పేదలకు ఇళ్లు ఇప్పిస్తున్నామని కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఎమ్మెల్యేల సోదరులు, ఇతర బంధువులపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఇటీవల 'జగన్‌' పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కూడా అధికారపార్టీతో కలసి పోయి ఈ అవినీతిలో పాలుపంచుకుంటున్నారట. హోంమంత్రి రాజప్ప తనకు అవినీతి రాకుండా కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను, అనుచరవర్గాన్ని అదుపులో పెట్టడంతో ఆయన ఒక్కడే నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్నారని ఆ జిల్లా అధికారులు 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అవినీతిపై పరిచయం ఉన్న అధికారులతో 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా మాట్లాడగా వారు ఈ విషయాన్ని తెలుపుతూ కాంగ్రెస్‌ హయాంలో ఎంత అవినీతి జరిగిందో అంతకన్నా రెట్టింపు ఈ రెండున్నరేళ్లలో జరిగిందని, ఏ నాయకుడూ ఎవరికీ భయపడడం లేదని, చివరకు పత్రికల్లో తమ అవినీతి బండారం బయటపడకుండా మీడియావర్గాలను ఆకట్టుకుంటున్నారని తెలిపారు.


(251)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ