WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మంత్రి గంటా' రాజీనామా...!?

నిన్నటి దాకా ఆయనంటే ఉత్తరాంధ్రలో ఆయనంటే అపరకుభేరుడని...రాజకీయ దురంధురడని...పేరుంది. పార్టీలు ఏవైనా ఆయన చుట్టూనే అధికారమంతా చక్కెరలు కొడుతుందని ఆయన మద్దతుదారులు అంటుంటారు. చిన్నస్థాయి నుంచి ఆయన ప్రత్యర్థులు కూడా ఊహించని స్థాయికి ఎదిగిన ఆయన నేడు బ్యాంకులకు హామీ దారుగా ఉండి వాటిని చెల్లించలేక నానా తిప్పలు పడుతున్నారు. నోట్ల రద్దుకుముందు వరకు ఆయన వాటిని చెల్లించాలంటే క్షణాల్లో చెల్లించేవారే. కానీ అప్పట్లో బ్యాంకులకు చెల్లించేదేముందిలే...అంత గట్టిగా వత్తిడి వస్తే అప్పుడు చూసుకుందాములే...అని వదిలేశారు. కానీ పరిస్థితులు తలకిందులు అయిపోయాయి...నోట్ల రద్దు తరువాత తమకు కట్టాల్సిన బాకీలను కట్టాలని బ్యాంక్‌ అధికారులు ఒత్తిడి తెచ్చారు. అంతే కాదు..ఆయన పరువును పత్రికలకు ఎక్కించారు. అదీ ఒక చిన్నపత్రికకు ఉప్పందించారు. తనకు బద్ధవైరి అయిన ఆ పత్రిక ఇప్పుడు పండుగ చేసుకుంటుంది. తాను రాసిన ప్రతిఅక్షరం నిజమేనని ఆ పత్రిక బల్లగుద్ది చెబుతోంది. బ్యాంకు అప్పు సంగతి ఎలా ఉన్నా ఆ పత్రికలో వచ్చిన వార్తే ఆయనకు చిర్రెత్తిస్తోంది. ఆ వార్తను పట్టుకుని ఇతర ప్రధాన పత్రికలు సదరు బడానాయకున్ని ఉతికి ఆరేస్తున్నాయి. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా...? రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి 'గంటా శ్రీనివాసరావు' గురించి.

     విశాఖపట్నంలో 'ప్రత్యూష' కంపెనీ ఎవరిది అని చిన్నపిల్లవాడిని అడిగా చెబుతారు..అది మంత్రి గంటాది...అని...అటువంటి కంపెనీకి ఇప్పుడు ఇక్కట్లు వచ్చాయట. ఇండియన్‌ బ్యాంక్‌ నుండి దాదాపు 193 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుని వారు చెల్లించడం లేదని, దానికి హామీగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు చెల్లించాలని ఆ బ్యాంక్‌ పట్టుపడుతోంది. ఈ విషయాన్ని నిన్నటి దాకా లోలోన ఒత్తిడి తెచ్చిన బ్యాంక్‌ అధికారులు తమ అప్పు గురించి పత్రికలకు ఉప్పందించారు. మొదట విశాఖపట్నంకు చెందిన 'లీడర్‌' పత్రిక ఈ విషయాన్ని బ్లాస్ట్‌ చేసింది. మొదట ఈ పత్రిక రాసిన కథనంపై పెద్దగా స్పందన కనిపించలేదు. అయితే దీన్ని తరువాత వెబ్‌మీడియా హైలెట్‌ చేయడంతో చివరకు ప్రధాన పత్రికలు కూడా అందుకోవాల్సి వచ్చింది. దీంతో మంత్రిగారి బండారం మొత్తం రచ్చకెక్కిపోయింది. బ్యాంక్‌కు తాను హామీగా ఉన్న సొమ్ములు మొత్తం చెల్లించాలని మంత్రికి ఉన్నా అదంతా వైట్‌లో జరగాల్సి రావడం ఇప్పుడు మంత్రికి ఇబ్బందులు సృష్టిస్తోంది. బ్యాంక్‌ అప్పు కింది హామీగా ఇచ్చిన స్థలాలు, ఇతర పొలాలు అన్నీ కలిపి ప్రభుత్వ రేటు ప్రకారం దాదాపు 70 నుంచి 100కోట్లు మాత్రమే చేస్తాయని బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వాటిని స్వాధీనం చేసుకున్నా మిగతా వాటిపై ఏమి చేస్తారనే చర్చ రాజకీయవర్గాలతో పాటు, బ్యాంక్‌ అధికారుల్లోనూ జరుగుతోంది. మిగిలిన సొమ్ము మంత్రి చెల్లించాలన్నా అదంతా వైట్‌గానే చెల్లించాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు మంత్రి ఏం చేస్తారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

   వేల కోట్ల ఆస్తులు కల్గిన మంత్రికి అది చెల్లించడం పెద్ద పనికాకపోయినా...దానికి కోసం తనకు ఉన్న ఇతర ఆస్తులను బయటపెట్టాల్సి ఉంటుంది. అయితే అవన్నీ బినామీ పేర్లతో ఉండడం మంత్రికి చికాకులు కల్గిస్తోంది. చంద్రబాబు మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రిగా ఉన్న గంటా ఈ ఇబ్బందులను ఎలా బయటపడతారో అనేదానిపై స్వంత పార్టీలోనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మంత్రిని రక్షించడానికి ఆయన వియ్యంకుడు మరో మంత్రి అయిన నారాయణ ఉన్నారని...'గంటా' చెల్లించాల్సిన సొమ్మును 'నారాయణ' చెల్లిస్తారని, దీంతో ఆయనకు ఇబ్బందులు తొలిగిపోతాయని వారు చర్చించుకుంటున్నారు. అయితే అప్పులు సంగతి ఎలా ఉన్నా...ఇప్పుడు మంత్రి పరువు పోయింది కదా...అని ఆయన అనుచర వర్గం ఒకటే మదనపడిపోతుందట.  అదీ కాక బ్యాంకులకు చెల్లించాల్సిన సొమ్ము, విద్యాశాఖలో జరుగుతున్న అవినీతి వ్యవహారాలపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి 'గంటా'పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఈ నేపథ్యంలో ఆయనను రాజీనామా చేయమని కోరే అవకాశం ఉంది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు రాజీనామా చేయించరని, మంత్రివర్గ విస్తరణలో ఆయన పదవిని పీకేస్తారని సీనియర్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో వివిధ ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు, అసమర్థులను మంత్రివర్గ  విస్తరణలో తొలగిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే మంత్రి 'గంటా' దీన్ని ఎలా ఎదుర్కొంటారనేదానిపై పార్టీలో మరో రకమైన చర్చ జరుగుతోంది. గతంలో టిడిపి నుంచి నాయకునిగా ఎదిగిన 'గంటా' తరువాత ఆ పార్టీకి జెల్లకొట్టి 'ప్రజారాజ్యం' తరువాత కాంగ్రెస్‌, మొన్న ఎన్నికలకు ముందు మళ్లీ తెలుగుదేశం చేరి తన రాజకీయ హవాను చాటుకున్న తీరుగానే దీనిలోంచి బయటపడతారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. గతంలో ఒక చిన్న పత్రికలో యాడ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి అపర కోటీశ్వరుడైన మంత్రి గంటా...తాను రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఈ కష్టం వచ్చిపడింది. చూద్దాం మరి ఏం జరుగుతుందో...!

(2192)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ