WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్సీ కోసం 'కరణం' ఆరాటం...?

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 10వ తేదీ తరువాత నోటిఫికేషన్‌ వెలువడునున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుండి సీనియర్‌ నేతలు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అపదవులు ఆశిస్తున్న వారిలో మాజీ ఎమ్మెల్యే 'కరణం బలరాం' కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు తాను రాజకీయంగా ఎంతో సహాయసహకారాలు అందించడమే కాకుండా, మంత్రి పదవిని కూడా త్యాగం చేసి ఆయనకు ఇప్పించానని ఇటీవల ఆయన గొప్పలు చెప్పుకోవడం ఆయనకు శాపంగా మారనుంది. ఎప్పుడో ఏదో సహాయం చేశానని, అనేక సంవత్సరాలు తరువాత బయటపడితే...అది ఎంత వరకు నష్టమో...కరణం తెలుసుకోలేకపోతున్నారు. 'చంద్రబాబు'కు మంత్రి పదవిని 'కరణం' ఇప్పించారా...? లేదా...? అనేది తెలియదు. కానీ..'కరణం' రాజకీయంగా మళ్లీ వెలుగులోకి రావడానికి 'చంద్రబాబే' కారణం. 1985లో 'మార్టూరు' నుండి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం 'చంద్రబాబే' దివంగత ఎన్టీఆర్‌పై ఒత్తిడితెచ్చి ఇప్పించి, ఆర్థికంగా సహకరించి, గెలిపించారు. అప్పట్లో ఎన్టీఆర్‌ పెద్దల్లుడు 'దగ్గుబాటి వెంకటేశ్వరరావు'ను కాదని 'బలరాం'కు అవకాశం ఇప్పించారు 'చంద్రబాబు'. 1994 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన 'బలరాం' టిడిపి బలపర్చిన ఇంటిపెండెంట్‌ అభ్యర్థి గొట్టిపాటి హనుమంతరావుపై పోటీ చేసి ఓడిపోగా...1999లో ఆయనకు ఒంగోలు ఎంపిగా పోటీ చేసే అవకాశం 'చంద్రబాబు' కల్పించారు. దీనిని బట్టి ఎవరెవరు రాజకీయంగా సహకరించారో స్పష్టం అవుతుంది. ఇవన్నీమరిచి 'చంద్రబాబు'పై పరోక్ష విమర్శలు చేసి చేతులు కాల్చుకున్నారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. 

   2009లో 'బలరాం' ఓడిపోగా..2014లో ఆయన కుమారుడు కూడా ఓడిపోయారు. రాజకీయంగా, ఆర్థికంగా 'కరణం' కుటుంబాన్ని 'చంద్రబాబు' అన్ని విధాలుగా ఆదుకున్నారని ప్రకాశం జిల్లా నాయకులందరికీ తెలుసు. అయినా తృప్తిపడకుండా 'బాబు'పై పరోక్ష విమర్శలు చేసి మౌనం వహించి... తాజాగా ఎమ్మెల్సీ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో 'బలరాం'కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ప్రసక్తే లేదని 'చంద్రబాబు' ఇటీవల కొందరి సమక్షంలో బయటపడ్డారు. రాజకీయంగా రెండుసార్లు ఓడిపోయినా...గుర్తింపు ఇచ్చానని, పార్టీ పరువు, ప్రతిష్టలను బజారు పాలు చేస్తే సహించే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో పట్టుఉన్న ఎమ్మెల్యే గొట్టిపాటిరవి'ని పార్టీలో చేర్చుకుని రాజకీయంగా 'జగన్‌'ను దెబ్బకొట్టిన 'చంద్రబాబు', 'రవి'ని వదులుకునే ప్రసక్తేలేదని గట్టిపట్టుదలతో ఉన్నారు. మౌనంగా ఉంటే ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి ముందుగా దక్కేది. ఆ తరువాత ఎమ్మెల్సీ పదవి కూడా వరించేది. అతిగా ఊహించుకుని, ప్రజావిశ్వాసం కోల్పోయి...'చంద్రబాబు'పైనే అవాకులు..చెవాకులు పేలి...రాజకీయంగా దెబ్బతిన్నారు 'కరణం'. ఇటీవల ఆయన 'జగన్‌' పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతున్నా...వాటిని ఆయన ఖండించ లేదు. తనకూ...తన కుమారుని ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తే పార్టీలో చేరతానని మధ్యవర్తులతో 'బలరాం' చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి 'జగన్‌' కూడా అంగీకరించారని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇందులో ఏది నిజమో...? ఏది అవాస్తవమో...? మరి కొద్ది నెలలు గడిస్తే కానీ అసలు విషయం బయటపడదు.

(329)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ