WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

స్వంత సామాజికవర్గంలోనే 'సాంబు'పై అసంతృప్తి...!

టిటిడి ఇఒ సాంబశివరావును బదిలీ చేసి ఆయన స్థానంలో ఢిల్లీలో ఒఎస్‌డిగా పనిచేస్తోన్న 'అశోక్‌కుమార్‌సింఘాల్‌'ను నియమించాలని ఇద్దరు కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఒత్తిడి తెస్తున్నారట. నిజాయితీపరుడు, సమర్థుడైన అధికారిగా పేరున్న 'సాంబశివరావు'కు లౌక్యం ప్రదర్శించడంలో విఫలమయ్యారని టిటిడి ఉద్యోగులు చెబుతున్నారు. మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు, అటవీశాఖ మంత్రి బి.గోపాలకృష్ణారెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు  'సాంబశివరావు' పనితీరును తప్పుబడుతున్నారు. చిన్నపాటి ఉద్యోగుల బదిలీలకు, పోస్టింగ్‌లకు సిఫార్సులు చేస్తే కావాలని పనిగట్టుకుని వారిని వేరే ప్రదేశాలకు బదిలీ చేశారని, అదేమిటని అడిగితే...పరిపాలనా వ్యవహారంలో ఏ ఒక్కరి జోక్యం తాను సహించనని ఆయన చెబుతున్నారట. దీంతో నిన్నటి వరకు రాష్ట్రానికే పరిమితమైన 'సాంబు'పై వ్యతిరేకత 'ఢిల్లీ' స్థాయికి చేరింది. 

  ముఖ్యంగా సిఎంకు అత్యంత సన్నిహితుడైన కేంద్రమంత్రి 'సుజనాచౌదరి' 'సాంబశివరావు'పై వ్యతిరేకంగా ఉన్నారు. ఆయనేం సిఫార్సు చేశారో...ఈయన ఏమి అమలు చేయలేదో బయటకు తెలియడం లేదు. ఏదో జరిగింది...దీనిపై 'సాంబశివరావు' నోరు మెదకపపోయినా..'సుజనాచౌదరి' ముఖ్యమంత్రిని పదే పదే ఈ బదిలీ వ్యవహారంపైనే కలుస్తున్నారట. టిటిడి ఇఒగా ఇంతకు ముందు తెలుగేతర ఐఎఎస్‌ అధికారులను ఎవరినీ నియమించలేదు. తాజాగా 'అశోక్‌కుమార్‌సింఘాల్‌' పేరు తెరపైకి వస్తుండడంతో టిటిడి ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా 'సింఘాల్‌' టిటిడి ఇఒగా నియమించాలని 'చంద్రబాబు'కు సిఫార్సు చేశారట. ఆయన చేసిన సిఫార్సు సుజనాచౌదరి ఒత్తిడితోనా...లేక మరేకారణాలతోనా...? అనేది స్పష్టం కావడం లేదు. ఏది ఏమైనా 'సాంబశివరావు'ను బదిలీ చేయాలని ఆయన సామాజికవర్గానికి చెందిన రాజకీయనాయకుల్లో ఎక్కువ మంది కోరుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం అవుతుంది. 

   నిజాయితీ, సమర్థతనే పరిగణలోకి తీసుకునే 'సాంబు' కొంత లౌక్యం ప్రదర్శించాల్సి ఉండగా...ఆ తోవలో నడవకుండా ఆయనకు నచ్చిన తోవలోనే వెళుతున్నారు. సామాన్య భక్తులకు శీఘ్రమే శ్రీవారి దర్శనం లభించేలా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఫలించాయి. కేవలం దానిపై దృష్టిసారిస్తున్నారే తప్ప..వీవీఐపీ దర్శనాల టిక్కెట్ల కేటాయింపును పట్టించుకోవడం లేదు. ఎవరైనా సిఫార్సు చేస్తే ఆయన వ్యతిరేకంగా చేసేవరకు నిద్రపోరట. ఒక వేళ మరీ ఒత్తిడి తెస్తే...'నీకు ప్రమోషన్‌ కావాలా...? వద్దా...? మళ్లీ సిఫార్సు చేపించావంటే...జాగ్రత్త...అని హెచ్చరిస్తున్నారట. అయితే ఆయన ఇటీవల చేసిన కొన్ని పోస్టింగ్‌లలో 'చంద్రబాబు' వ్యతిరేకులు ఎక్కువమంది ఉన్నారట. దీనిపై ఆగ్రహం చెందిన మాజీ మంత్రి ముద్దు, ప్రస్తుత మంత్రి గోపాలకృష్ణారెడ్డిలు సిఎంఒ అధికారులను స్వయంగా కలసి ఫిర్యాదు చేశారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ టిటిడీ ఇఒ 'సాంబు'ను బదిలీ చేయాల్సిందేనని రోజు రోజుకు కోరేవారి సంఖ్య చాంతాడులా పెరిగిపోతోంది.

(933)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ