WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'బాబాయి...అబ్బాయి'ల మధ్య కోల్డ్‌వార్‌...!

ఒకరు తండ్రి వారసుడిగా చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారు. నీతి,నిజాయితీగా వ్యవహరించి పేరు తెచ్చుకోవాలని తపనపడ్డారు..ఆ విధంగానే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఆయన తండ్రిపై ఎటువంటి ముద్ర ఉన్న విషయం పక్కన పెడితే తనయుడిపై మాత్రం అన్ని వర్గాల్లో సంతృప్తి వ్యక్తం అవుతుంది. మరొకరు...అన్నకు చేదోదుడుగా...వాదోడుగా ఉంటూ ఆయన ఉన్న కాలంలోనే ఆయన తమ్ముడిగా రాజకీయాల్లోకి వచ్చి పలుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 'పెద్దాయన' పేరుతో 'బాబాయి...అబ్బాయిలు' ఘన విజయం సాధించారు. ఇంతకీ వారెవరనుకుంటున్నారా...? వారెవరో కాదు...శ్రీకాకుళం జిల్లాలో 'ఎర్రన్న'గా పేరు తెచ్చుకుని వరుసుగా ఐదుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికై, తెలుగుదేశం పార్టీలో 'చంద్రబాబు'కు అత్యంత నమ్మకస్తుడైన 'ఎర్రంనాయుడు' వారసులు. 

   'ఎర్రన్న' వారసులుగా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వీరు పరిపాలన మొత్తం తమ గుప్పెటలోకి తెచ్చుకున్నారు. తండ్రి తరువాత ఎంపి అయిన ఆయన కుమారుడు 'రామ్మోహన్‌నాయుడు' తండ్రిబాటలో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటుండగా...తమ్ముడు 'అచ్చెన్న'కు మాత్రం అవినీతిపరుడనే పేరు వస్తోంది. ఎర్రంనాయుడు కుటుంబంపై ఉన్న అభిమానంతో 'అచ్చెంనాయుడి' కి మంత్రి పదవి ఇచ్చారు 'చంద్రబాబు'. అంతకు ముందు పదేళ్లు 'ధర్మాన' సోదరులు అధికారం చెలాయించి జిల్లాను చెరపట్టారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించనంత ఆర్థిక స్థాయికి చేరుకున్నారు. తరువాత పరిస్థితి తారుమారైంది. 'ధర్మాన' సోదరులు ఎన్నికల్లో ఓడిపోయారు..'ఎర్రన్న' కుటుంబ సభ్యులు ఎన్నికల్లో ఘన విజయంసాధించారు. 'ఎర్రన్న' పై ఉన్న అభిమానంతో 'అచ్చెన్న'కు మంత్రి పదవి కట్టబెట్టారు 'చంద్రబాబు'.  ఇక చూసుకోండి...ఆయన చెలరేగిపోతున్నారు. జిల్లాలో ఆయన అధికారానికి అడ్డూ...అదుపూ లేకుండా పోయింది. ప్రశ్నించేవారు లేరు...? ఎదురు తిరిగేవారు లేరు..?  అంతా వన్‌మ్యాన్‌ షో. ఆంధ్రప్రదేశ్‌కు 'చంద్రబాబు' ముఖ్యమంత్రి కాగా...శ్రీకాకుళం జిల్లాకు 'అచ్చెంనాయుడే' ముఖ్యమంత్రి అన్నంత రీతిలో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లు,ప్రమోషన్లు ఇతర ముఖ్య విషయాలన్నీ మంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. 

   అభివృద్ధిలో జిల్లా బాగా వెనుకబడిందని దేశం మొత్తం భావిస్తుండగా...అవినీతిలో మాత్రం నెంబర్‌ వన్‌ జిల్లాగా పేరు తెచ్చుకుంది. పదేళ్లు 'ధర్మాన' కుటుంబం...తాజాగా 'అచ్చెంనాయుడు' 'ధర్మాన' కుటుంబం పదేళ్లు ఇష్టారాజ్యంగా దోచుకుందని విమర్శలు చేసిన అధికార పార్టీ నాయకులే ప్రస్తుతం 'అచ్చెన్న' హయాంలో జరుగుతున్న అవినీతిపై నోరు మెదపలేకపోతున్నారు. అధికారం ఉన్నప్పుడే వెనుకేసుకొనే మనస్వత్వం 'అచ్చెన్న'ది. ఎవరినీ లెక్కచేయరు..ఆవేశం, అహంకారం,అహంభావం ఎక్కువ. అధికారులను నోటికి వచ్చినట్లు తూలనాడతారనే విమర్శ ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అవినీతిలో 'శ్రీకాకుళం' జిల్లా నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుందట. జరుగుతున్న విషయాలను ఎంపి రామ్మోహన్‌నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారట. 'బాబాయి' అవినీతి, అహంకార రాజకీయాలపై ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. దీనికి ఎక్కడో ఓ చోట పుల్‌స్టాప్‌ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. 

  జిల్లాలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించేందుకు ఆయన సిద్ధం కాగా...ఆయన తల్లి, దివంగత 'ఎర్రంనాయుడు' భార్య అయిన ఆమె కొడుకును సముదాయిస్తుందట. త్వరలో వివాహం చేసుకోబోతున్నావు...కొన్నాళ్లు ఈ విషయంపై ఏమీ మాట్లాడవద్దని సూచించిందట. అంతే కాకుండా ఇప్పటి వరకు ఉమ్మడి కుటుంబంలో ఉన్న తాము..పెళ్లికి ముందు 'బాబాయి' వ్యవహారం ప్రశ్నిస్తే...ఇబ్బందులు ఎదురవుతాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 'రామ్మోహన్‌నాయుడు' ప్రస్తుతానికి  మౌనం వహిస్తున్నారట. అంతే కాకుండా తమ కుటుంబ ఆస్తుల వివాదం కూడా పరిష్కారం చేసుకోవాలని ఆయన భావిస్తున్నారట. దివంగత 'ఎర్రంనాయుడు'కు ఎంత ఆస్తులు ఉన్నాయో...'రామ్మోహన్‌నాయుడు'కు తెలియదట. ఆ విషయాలను కూడా సరి చేసుకొని తన వివాహం తరువాత అన్నీ బయట పెట్టాలని ఆయన అనుకుంటున్నారట.  

  మొత్తం మీద 'బాబాయి..అబ్బాయి'ల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైందని..ఇది ఎప్పుడైనా బద్దలు కావచ్చని జిల్లా అధికారపార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారట. మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలతో ఎంపి రామ్మోహన్‌నాయుడు దూసుకుపోతున్నారట. అందరికీ అందుబాటులో ఉంటూ నిజాయితీపరుడిగా ఉంటూ తండ్రిలా కలుపుగోలుగా వెళుతున్నారు. అయితే 'అచ్చెన్న' వ్యవహారంపై 'బాబు' ఎందుకు మౌనం వహిస్తున్నారనే ప్రశ్నకు పలు రకాలైన సమాధానాలు వస్తున్నాయి.   'అచ్చెంనాయుడు' వ్యవహారం మొత్తం 'చంద్రబాబు'కు తెలుసు. కానీ ఆర్థికపరంగా ఎదిగితేనే రాజకీయాల్లో మనుగడ ఉంటుందని...ఈ విషయం కాంగ్రెస్‌ పాలకులు రుజువు చేశారని అదే బాటలో తమ పార్టీ నాయకులు కూడా నడిస్తేనే మళ్లీ అధికారం దక్కుతుందనే నమ్మకం ఆయనకు ఉందట. అందుకే 'అచ్చెన్న' వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని జిల్లా పార్టీ నాయకులు అంటున్నారు.

(1629)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ