WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒకరే మంత్రి...ఒకరే అధికారి...!

విద్యాశాఖలోని ప్రాధమిక విద్యాశాఖ, ఉన్నతవిద్యాశాఖలకు ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఆశాఖకు ఒకే మంత్రి ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండు శాఖలకు ఒకే ఐఎఎస్‌ అధికారిని నియమించారు. దీని బట్టి ఒకేశాఖకు ఒకే మంత్రి, ఒకరే ఐఎఎస్‌ అధికారి ఉండాలని సిఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ప్రాధమిక, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖలకు ఆధిత్యనాథ్‌దాస్‌ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ శాఖలన్నింటికి 'గంటా శ్రీనివాసరావు' మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ విధమైన మార్పులు మిగతా శాఖలకు కూడా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖలకు ఇద్దరు ఐఎఎస్‌ అధికారులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా మంత్రులు ఇద్దరు ఉన్నారు. పంచాయితీరాజ్‌కు 'అయన్నపాత్రుడు', గ్రామీణాభివృద్ధికి 'మృణాళి' మంత్రిగా ఉండగా, జవహర్‌రెడ్డి పంచాయితీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శిగా గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శిగా 'దినేష్‌కుమార్‌' ఉన్నారు. ఈ రెండు శాఖలకు కలిపి ఒక సీనియర్‌ ఐఎఎస్‌నునియమించడంతో పాటు ఒకే మంత్రి పరిధికి వీటిని తీసుకురానున్నారు. అదే విధంగా వ్యవసాయశాఖ పరిధిలో ఉన్న సహకారశాఖ,మార్కెటింగ్‌శాఖ ఇతర శాఖలన్నింటినీ కలిపి మరో సీనియర్‌ అధికారిని నియమించే అవకాశాలు ఉన్నాయి. వీటిన్నింటిని కలిపి ఒకే మంత్రిని నియమించాలని ప్రభుత్వం భావిస్తుంది. 

   రెవిన్యూశాఖలో ముగ్గురు సీనియర్‌ అధికారులు వివిధ శాఖలకు బాధ్యత వహిస్తున్నారు. ఆయా శాఖలను ఇద్దరికి అప్పచెప్పే అవకాశం ఉంది. దేవాదాయశాఖకు ప్రస్తుతం జెఎస్వీ ప్రసాద్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ శాఖను కూడా రెవిన్యూశాఖాధిపతికి అప్పచెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇతర శాఖలను కూడా ఒకే గూటికి తెచ్చి ఒకే అధికారిని శాఖాధిపతిగా నియమించి, ఒకే మంత్రికి సదరు శాఖల నిర్వహణ చూసే అవకాశం కల్పించబోతున్నారు. విద్యాశాఖ పరిధిలో ఉన్న విభాగాలన్నింటికీ ఒకే అధికారిని నియమించాలని సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'ఆధిత్యనాథ్‌దాస్‌' చేసిన సూచనలను ముఖ్యమంత్రి 'చంద్రబాబు' అంగీకరించి ఆయనను ఆశాఖల అధిపతిగా నియమించారు. ఇతర శాఖలపై దృష్టిసారించబోతున్నారు. ఒక వైపు అధికారుల కొరత ఉందని చెబుతున్న పాలకులు మరోవైపు చిన్న చిన్న శాఖలకు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను నియమించారు. ఇప్పుడు విభిజించిన శాఖలన్నింటిని తిరిగి కలిపి సీనియర్‌ ఐఎఎస్‌లను ఆయాశాఖాధిపతులుగా నియమించి పరిపాలనలో మార్పులు,చేర్పులు చేయబోతున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా అసెంబ్లీ సమావేశాల ముందు కానీ, తరువాత  కానీ చేయబోతున్నారు. ఒకేసారి మంత్రివర్గ విస్తరణ జరిపి ఈ విధానాన్ని అమలులోకి తీసుకువస్తే పరిపాలన గాడినపడుతుందని సిఎం భావిస్తున్నారట. విద్యాశాఖతో శ్రీకారం చుట్టారు...త్వరలో ఇతర శాఖలను కూడా అదే విధంగా చేయబోతున్నారు.

(310)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ