WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌'ది పిచ్చిప్రయత్నమా...?(వీడియో)

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ గణతంత్ర దినోత్సవం రోజున విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో ఏపీ యువత ఆందోళన నిర్వహించనుంది. దీని వెనుక ఎవరు ఉన్నారో కానీ...సోషల్‌మీడియాలో దీనిపై ఉధృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రత్యేకహోదా కావాలనే వారు...వద్దనేవారు దీనిపై సోషల్‌మీడియాలో వాదులాడుకుంటున్నారు. ప్రత్యేకించి సినీ నటుడు 'పవన్‌కళ్యాణ్‌' దీని కోసం ప్రత్యేకంగా శ్రద్ద తీసుకొని ముందు ఉండడంతో ఆయనపై కూడా విమర్శల వర్షం కురుస్తోంది. టిడిపి అనుకూలురు ఆయనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. హోదా కోసం పోరాటం చేస్తే కేంద్రం దిగిరాదని, ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ అమలు కోసం పోరాటం చేయాలని...ఇప్పుడు ఇటువంటి ఆందోళనలకు దిగి వచ్చేవాటిని కూడా రాకుండా అడ్డుపడడం సమంజసం కాదని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి ఆందోళనల వల్ల రాష్ట్రం చాలా నష్టపోయిందని మరోసారి ఆందోళన చేసి మళ్లీ నష్టపరచవద్దని వారు అంటున్నారు. 

  'జల్లికట్టు'ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌ యువత కూడా స్వచ్చంధంగా ముందుకు వచ్చి ఉద్యమించాలని 'పవన్‌' ఇప్పటికే పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే 'పవన్‌' సభలను నిర్వహించి కేంద్రప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. అయితే అప్పట్లో ఆయన విమర్శలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తాజాగా 'జల్లికట్టు' ఉద్యమం విజయం సాధించడంతో ఇక్కడ కూడా అటువంటి ప్రయత్నమే చేయాలనే భావన ఆయనలో కలిగింది. ఇదే సమయంలో ప్రతిపక్ష వైకాపా కూడా దీనికి తెరవెనుక నుంచి మద్దతు ఇస్తోంది. వాస్తవానికి 'పవన్‌'కు, వైకాపా అధినేత 'జగన్‌'కు రాజకీయంగా వైరం ఉంది. ఈ పరిస్థితుల్లో వీరిద్దరూ కలసి ఈ ఉద్యమాన్ని నిర్వహించబోతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కావడంతో అధికారపార్టీ ఆచితూచి స్పందిస్తోంది. కాగా ప్రత్యేక హోదా కోసం సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' రూపొందించిన ప్రత్యేక ఆల్బమ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది. హోదా కోసమంటూ విడుదల చేసిన పాటపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. తాను నటించిన 'తమ్ముడు' చిత్రంలోని ట్రావెలింగ్‌ సోల్జర్‌ పాటనే ఈ ఆల్బమ్‌లో పెట్టేసి ఇంతకుముందు 'పవన్‌' నిర్వహించిన సభల్లోని డైలాగ్‌లు దీనిలో చేర్చారు. ఆల్బమ్‌ కోసం 'పవన్‌' కొత్తగా చేసిందేమీ లేదని వారు అంటున్నారు. ఒక ప్రత్యేకమైన విషయం కోసం చేస్తోన్న ఉద్యమంలో ఇటువంటి పాటలు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.ఇదంతా ఆషామాషీ వ్యవహారంలా ఉంది తప్ప దీనిలో సీరియస్‌నెస్‌ లేదని, ఉద్యమ స్ఫూర్తి ఇటువంటి పాటల ద్వారా ఎలా వస్తుందని వారు అంటున్నారు. మొత్తం మీద 'పవన్‌' చేస్తోన్న ప్రయత్నంపై విమర్శలు వస్తున్నాయి.




(677)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ