WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీటీడీ ఇఒ రేసులో 'శ్రీకాంత్‌'...!

టీటీడీ ఇఒ సాంబశివరావును బదిలీ చేయనున్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ పోస్టు పొందేందుకు అనేక మంది సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఎఎస్‌ అధికారులు టీటీడీ ఇఒ పదవి పొందాలని 'ఢిల్లీ' స్థాయిలో లాబీయింగ్‌ చేస్తున్నారట. కేంద్రమంత్రి 'సుజనాచౌదరి' సిఫార్సు కోసం కొంత మంది అధికారులు ఆయనకు సన్నిహితులైన వ్యక్తులను కలసి తమ విజ్ఞాపనలను తెలియజేసుకుంటున్నారట. ఇఒ 'సాంబు'ను బదిలీ చేస్తే ఆయన స్థానంలో 'అనిల్‌కుమార్‌ సింఘాల్‌'ను నియమించబోతున్నారని,ఆయనకు కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఆశీస్సులు ఉన్నాయని 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'  కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న కొంత మంది ఐఎఎస్‌ అధికారులు తమ వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కొంత మంది 'చినబాబు' చుట్టూ ప్రదిక్షణలు చేస్తుండగా మరి కొందరు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా ప్రయత్నించబోతున్నారు. 'సింఘాల్‌' నియామకంపై కొంత అపనమ్మకం ఏర్పడడంతో కొంతమంది తెలుగేతర ఐఎఎస్‌ అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. 

     నిన్నటి వరకు సిఆర్‌డిఎ కమీషనర్‌గా ఉండి జిఎడి పొలిటికల్‌ కార్యదర్శిగా బదిలీ అయిన 'శ్రీకాంత్‌' టీటీడీ ఇఒ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నారట. కులం, ప్రాంతాలను బట్టి ఎంపిక చేసే విధానాన్ని 'చంద్రబాబు' ప్రారంభించిన నేపథ్యంలో కాపు సామాజికవర్గానికి చెందిన శ్రీకాంత్‌ను టీటీడీ ఇఒగా నియమించాలని ముఖ్యమంత్రిపై ఆ సామాజికవర్గ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. 'సాంబశివరావు'ను బదిలీ చేయడానికి కారణాలు ఏమిటో పాలకులు చెప్పలేకపోతున్నారు. టీటీడీ ఇఒగా ఆయనకు రెండేళ్లు సర్వీసు పూర్తి అయిందని, అందుకే బదిలీ చేయబోతున్నారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నప్పటికీ మరో సంవత్సరం టీటీడీ ఇఒగా కొనసాగించేందుకు నిబంధనలు అడ్డుపడతాయా? అన్న ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. పాలకుల ఇష్టా ఇష్టాలను బట్టి రెండేళ్లే కాదు...మరో రెండేళ్లు అదే పోస్టులో కొనసాగవచ్చు. గత మూడు రోజుల నుంచి తెలుగేతర ఐఎఎస్‌ అధికారులు కొందరు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయ అధికారుల ద్వారా ఈ పోస్టును పొందాలని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. 'సాంబశివరావు' బదిలీ వ్యవహారం బయటకు పొక్కడంతో లేనిపోని తలనొప్పులు తెచ్చుకుంటున్నారు 'చంద్రబాబు'. ఏది ఏమైనప్పటికీ టీటీడీ ఇఒ పోస్టు వ్యవహారంలో జరుగుతున్న ప్రచారం...ఆ పోస్టు కోసం సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు సఫలమవుతాయో వేచి చూడాల్సి ఉంది.


(534)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ