WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఠక్కర్‌' సిఫార్సుకు 'సిఎం' ఓకే...!

ఐఎఎస్‌ అధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 'ఠక్కర్‌' సిఫార్సులకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు విలువిస్తున్నారట. ఇటీవల జరిగిన కొన్ని బదిలీలలో రోడ్లు,భవనాలశాఖాధిపతి గా 'సుమిత్రాదావా' నియమించారు. అంతకు ముందు ఆమె ఉన్నతవిద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రవాణా,రోడ్లు,భవనాలశాఖకు ఇంతకు ముందు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఎఎస్‌ అధికారి బాధ్యతలను నిర్వహించేవారు. అదే హోదాలో ఉన్న అధికారిని నియమించాల్సి ఉన్నప్పటికీ ప్రధాన కార్యదర్శి 'ఠక్కర్‌' కలుగ చేసుకుని 'సుమిత్రా దావా'ను సిఫార్సు చేసి ఆమెను నియమింపచేశారు. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాకు రానున్న 'నీరబ్‌కుమార్‌ప్రసాద్‌'ను టిఆర్‌ అండ్‌ బి శాఖాదిపతిగా నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయనను కార్మికశాఖాధిపతిగా నియమించారు.ఈ శాఖకు ఇంతకు ముందు జూనియర్‌  అధికారులే శాఖాధిపతులుగా బాధ్యతలునిర్వహించారు. 

   'నీరబ్‌కుమార్‌ప్రసాద్‌'కు నిజాయితీపరుడైన అధికారిగా పేరుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా చిన్నశాఖలో నియమించామని పాలకులు చెబుతున్నప్పటికీ వాస్తవానికి ఆయన పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అప్పటికీ ఆయనను 60రోజులు పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచారు. ఈవిషయం సిఎస్‌కు, సిఎంఒ అధికారులకు తెలుసు. రెండు మాసాలు వెయిటింగ్‌లో పెట్టినా...ఆయన టిఆర్‌ అండ్‌ బి శాఖాధిపతిగా నియమించకుండా ఆయనకన్నా ఎంతో జూనియర్‌ అయిన 'సుమిత్రాదావా'ను నియమించారు. అదే విధంగా అడవులు, పర్యావరణశాఖాధిపతిగా ఇంతకు ముందు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఎఎస్‌ అధికారులే బాధ్యతలు నిర్వహించారు. కనీసం ఆ శాఖలో కూడా 'నీరబ్‌'నునియమించలేదు. ఆయన కన్నా జూనియర్‌ అయిన 'అనంతరాము'ను నియమించారు. త్వరలో 'అనంతరాము'ను తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ అత్యంత ప్రాధాన్యత కల శాఖలో నియమించడంలో ఎవరి ప్రమేయం పనిచేసిందో...? ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న వ్యవసాయం, మార్కెటింగ్‌శాఖలను యధావిధిగా ఇన్‌ఛార్జి పరిధిలోనే ఉంచారు. అత్యంత ముఖ్యమైన ఈ శాఖలకు శాశ్విత అధికారిని నియమించకపోవడం గమనార్హం. ఇదే విషయంపై ప్రధాన కార్యదర్శి 'ఠక్కర్‌'ను పలువురు అధికారులు స్వయంగా కలసి తమను ఆ శాఖలో నియమించాలని కోరినప్పటికీ అది నావల్ల కాదు...సిఎంను కలవమని చేతులు దులుపుకున్నారు. కానీ..'సుమిత్రాదావ్రా' విషయంలో ఆయన ఎందుకు పట్టుబట్టారో ఏ ఒక్కరికీ అంతుబట్టడం లేదు. ఫిభ్రవరి మాసాంతానికి 'ఠక్కర్‌' రిటైర్‌ కాబోతున్నారు...ఏదో ఒకటీ రెండు పోస్టులు ఆయన అడిగారు...ఆయనను బాధపెట్టడం ఎందుకని 'చంద్రబాబు' వాటికి అనుమతించారని సచివాలయంలో ప్రచారం జరుగుతోంది. శాఖాధిపతి పోస్టింగ్‌లలో సమతుల్యం పాటించకుండా జూనియర్లకు,నచ్చినవారికి పెద్దపీట వేస్తూ...సీనియర్లను అవమానిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. దీనిని సిఎం చంద్రబాబు ఎలా సరిదిద్దుతారో ఎదురు చూడాల్సిందే...!

(501)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ