లేటెస్ట్

ప‌వ‌న్ వ్యూహ‌మేమిటో...!?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ‌వ్యూహాలు ఆయ‌న పార్టీ నేత‌ల‌తో పాటు, టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌ను గంద‌ర‌గోళంలోకి నెడుతున్నాయి. చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత ఆక‌స్మాత్తుగా రాజ‌మండ్రి వ‌చ్చి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి,జ‌న‌సేన క‌లిసిపోటీ చేస్తాయ‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఆ త‌రువాత ఆయ‌న కృష్ణా జిల్లాలో ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తాను టిడిపి కోసం బిజెపిని వ‌దులుకున్నాన‌ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోరెండు పార్టీలు క‌లిసి ప‌నిచేయాల‌ని, టిడిపి, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు క‌లివిడిగా ఉండాల‌ని చిన్న చిన్న విష‌యాల‌ను వివాదాస్ప‌దం చేసుకోవ‌ద్ద‌ని సూచించారు. అంతే కాకుండా ఇప్పుడు టిడిపి ఇబ్బందుల్లో ఉంది క‌నుక టిడిపిని చిన్న‌చూపు చూడ‌వ‌ద్ద‌ని త‌న పార్టీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్తల‌ను హెచ్చ‌రించారు. అంతే కాకుండా పొత్తుకు వ్య‌తిరేకంగా మాట్లాడుతున్న జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌ను, కార్య‌క‌ర్తల‌ను ఆయ‌న తీవ్రంగా మందలించారు. దీంతో టిడిపి, జ‌న‌సేన కూట‌మి మాత్ర‌మే క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళుతుంద‌ని, బిజెపిని క‌లుపుకోద‌నే స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లైంది. అయితే గ‌త రెండు రోజుల నుంచి ఆయ‌న వాయిస్ మ‌రో ర‌కంగా వినిపిస్తోంది. తాను ఇంకా ఎన్‌డిఏలోనే ఉన్నాన‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిడిపి, జ‌న‌సేన‌, బిజెపి కూట‌మి క‌లిసి పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో టిడిపి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు హ‌తాశుల‌వుతున్నారు. ఒక‌వైపు త‌మ అధినేత చంద్ర‌బాబు అరెస్టు వెనుక బిజెపి పెద్ద‌లు ఉన్నార‌ని ఆవేద‌న, ఆక్రోశాన్ని వారు వ్య‌క్తం చేస్తుంటే...బిజెపిని కూట‌మిలోకి తీసుకువ‌స్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌డాన్ని టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్తలు జీర్ణించుకోలేక‌పోతున్నారు. ప‌వ‌న్‌లో నిల‌క‌డ లేద‌ని, నిన్న,మొన్న టిడిపి, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ‌తాయ‌ని చెప్పిన ఆయ‌న ఈ రోజు తాను ఇంకా ఎన్‌డిఏలో ఉన్నాన‌ని, బిజెపిని కూటమిలోకి తెస్తాన‌ని చెప్ప‌డం ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయ‌న ఏమి చేస్తున్నారో..తెలియ‌డం లేద‌ని, బిజెపి త‌మ కూట‌మిలోకి ఎలా వ‌స్తుంద‌ని, త‌మ అధినేత‌ను అరెస్టు చేసి జైలులో మ‌గ్గ‌బెడుతుంటే, క‌నీసం బిజెపి పెద్ద‌లు స్పందించ‌డం లేద‌ని, పైగా ప‌రోక్షంగా న్యాయ‌స్థానాల‌ను ప్ర‌భావితం చేస్తున్నార‌నే అనుమానాలు ఉన్న ప‌రిస్థితుల్లో, వంద‌కు 90శాతం మంది బిజెపి పెద్ద‌ల ఆశీస్సుల‌తోనే చంద్ర‌బాబు అరెస్టు జ‌రిగింద‌ని న‌మ్ముత‌న్న ప‌రిస్థితుల్లో బిజెపితో క‌లిసి వెళ‌తామ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించ‌డం వెనుక ఏమి జ‌రుగుతుందో అన్న అనుమానాలు టిడిపి నేత‌లు, కార్య‌క‌ర్తలు, ఆ పార్టీ సానుభూతిప‌రులు వ్య‌క్తం చేస్తున్నారు. తాము అడ‌గ‌క ముందే ప‌వ‌న్ త‌మ‌తో వ‌చ్చి చేతులు క‌లిపార‌ని, ఆయ‌న మంచి హృద‌యానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని భావించిన టిడిపి వాళ్లు ఇప్పుడు ప‌వ‌న్ ప‌దే ప‌దే బిజెపిని కూట‌మితో క‌లుపుతాన‌ని చెప్ప‌డంపై అయోమ‌యానికి, అనుమానాల‌కు గుర‌వుతున్నారు. మొత్తం మీద చంద్ర‌బాబు అరెస్టు త‌రువాత ప్ర‌తిదాన్ని అనుమానిస్తోన్న టిడిపి సానుభూతిప‌రులు, ఇప్పుడు ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న వెనుక ఏమైనా ఉందేమోన‌న్న శంక‌ల‌ను, అనుమానాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

  • ( 0)
  • -
  • ( 0)

అభిప్రాయాలూ