WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలోకి 'బైరెడ్డి,శిల్పా సోదరులు...!?

ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల సమయం ఉన్నా అప్పుడే రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌ స్వంత జిల్లా అయిన కడపలో ఆయనను దెబ్బ కొట్టాలని భావిస్తూ శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నారు. 'జగన్‌' స్వంత నియోజకవర్గమైన 'పులివెందుల'కు కృష్ణా జలాలను పారించి..అక్కడ టిడిపిని బలోపేతం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కడప జిల్లాలో పట్టుసాధిస్తే రాయలసీమలో పట్టు దొరుకుతుందని ఆయన వ్యూహాలు పన్నుతున్నారు. అయితే ఆయన వ్యూహాలకు వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. 'బాబు' కడపపై గురిపెడితే 'జగన్‌' కర్నూలును లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటికే ఆ జిల్లాలో బలంగా ఉన్న వైకాపాను మరింత బలోపేతం చేసేందుకు తటస్తులను, టిడిపిలోని అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. 

   ఈ నేపథ్యంలో మాజీ టీడీపీ నేత 'బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి'ని ఆయన పార్టీలోకి ఆహ్వానించారట. ఆయన ఆహ్వానాన్ని 'బైరెడ్డి' అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. గతంలో టిడిపి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన 'బైరెడ్డి' 2004 అసెంబ్లీ ఎన్నికల తరువాత టిడిపికి దూరం అయ్యారు. తరువాత ఆయన 'రాయలసీమ పరిరక్షణ సమితి' అంటూ ఓ సంస్థను స్థాపించి పాదయాత్రలు, ఇతర సభల ద్వారా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతే కాకుండా ప్రత్యేక రాయలసీమ కావాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన వినూత్నమైన నిరసనలను చేస్తున్నారు. అయితే ఆయన నిరసనలకు కానీ, సభలకు కానీ ప్రజల నుంచి పెద్దగా స్పందన లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన వైకాపా వైపు చూస్తున్నారట. దానిలో భాగంగానే ఇప్పుడు ఆయనను ఆ పార్టీలో చేర్చుకోవడానికి 'జగన్‌' అంగీకరించారట. దీంతో ఆయన చేరిక లాంఛనమేనని వైకాపా వర్గాలు అంటున్నాయి. ఇక కర్నూలుకు చెందిన టిడిపి నాయకులు 'శిల్పామోహన్‌రెడ్డి బ్రదర్స్‌' టిడిపి అధినాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వీరు తాజాగా పరిస్థితులపై తీవ్రమైన అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కంటే వెనుక పార్టీలో చేరిన 'భూమా నాగిరెడ్డి'కి 'బాబు' ప్రాధాన్యత ఇస్తున్నారని 'కర్నూలు'లో 'నాగిరెడ్డి' తమను పట్టించుకోవడం లేదని వారు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. 'భూమా' చేరిక సందర్భంలోనే వీరు అసంతృప్త వ్యక్తం చేశారు. అయినా వారి నిరసనను పట్టించుకోకుండా 'బాబు' వారినిపార్టీలో చేర్చుకున్నారు. అయితే తరువాత వీరి మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయి. వీటిని పరిష్కరించడంలో పార్టీ నాయకత్వం విఫలమైందని, దీంతో తాము పార్టీలో ఉండమని 'శిల్పా సోదరులు' తెగేసి చెబుతున్నారు. దీంతో వారు కూడా పార్టీ మారతారని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా త్వరలో 'కర్నూలు ' జిల్లా రాజకీయాల్లో తీవ్రమైన మార్పులు వస్తాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


(354)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ