WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వైకాపాలో 'కాకినాడ' లొల్లి...!

సార్వత్రిక ఎన్నికలకు మరో రెండున్నరేళ్ల సమయం ఉన్నా రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికల్లో తాము ఎక్కడ నుంచి పోటీ చేయాలనేదానిపై అప్పుడే కుస్తీలు పడుతున్నారు. ప్రతిపక్ష వైకాపాలో ఈ సీట్ల గొడవ ఇప్పటి నుంచే ప్రారంభం అయింది. దానికి పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌ వైఖరి కూడా కొంత కారణమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎందు కంటే ఆయన అప్పుడే కొన్ని నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. దీంతో ఉత్సాహవంతులైన వారు అభ్యర్థిత్వం కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. అపారమైన రాజకీయ చైతన్యం గల 'తూర్పుగోదావరి' జిల్లాలో ఈ పోరు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా 'కాకినాడ' పార్లమెంట్‌ సీటు కోసం పలువురు నాయకులు తమకు కావాలంటే తమకు కావాలని పట్టుబడుతున్నారు. ఈ రేసులో ఆశ్చర్యకరంగా 'కాపు ఉద్యమనేత' 'ముద్రగడ పద్మనాభం' కూడా ఉన్నారట. ప్రస్తుతం 'కాపు'లకు రిజర్వేషన్లు కల్పించాలని తీవ్రంగా ఉద్యమిస్తున్న 'ముద్రగడ' రాబోయే రోజుల్లో వైకాపాలో చేరనున్నారని ఆయా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే ఆయన అధికార టిడిపిపై రోజూ దుమ్మెత్తిపోస్తున్నారు. 'చంద్రబాబు' కాపులను మోసం చేశారని, ఆయన సంగతి రాబోయే ఎన్నికల్లో తేలుస్తామని ఆయన వార్నింగ్‌లు ఇస్తున్నారు. అయితే వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌కు, 'ముద్రగడ'కు మధ్య ఒప్పందం కుదిరిందని అందుకే రిజర్వేషన్ల విషయంపై 'ముద్రగడ' అనవసర రాద్ధాంతం చేస్తున్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలు సంగతి పక్కన పెడితే రాబోయే రోజుల్లో 'ముద్రగడ' వైకాపాలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 

   వైకాపాలో ఆయన చేరితే 'కాకినాడ' నుంచి పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారట. గతంలో ఇదే స్థానం నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందారు. 1999 సాధారణ ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి 'తోట సుబ్బారావు'పై గెలుపొందారు. మళ్లీ 2004 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన మాజీ మంత్రి పల్లంరాజుపై ఓటమి చెందారు. అప్పటి నుంచి ఆయన రాజకీయంగా తెరమరుగు అయ్యారు. అయితే 2009 ఎన్నికల్లో పిఆర్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన 'చలమలశెట్టి సునీల్‌' తరువాత వైకాపాలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో పరాజయం చెందారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయినా ఆయన వెనకుడుగు వేయకుండా... మళ్లీ ఇక్కడ నుంచే పోటీ చేసి గెలుపొందాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

  ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ సీటు 'ముద్రగడ'కు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో తాను ఎప్పటి నుంచో పనిచేసుకుంటున్నానని, తనకు సీటు ఇవ్వకుండా వేరే వారికి ఇస్తే ఊరుకునేది లేదని ఆయన తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాపు ఉద్యమం ఉదృతంగా జరుగుతుండడం...దానికి 'ముద్రగడ' నేతృత్వం వహిస్తుండడంతో ఆయనను పార్టీలో చేర్చుకుని సీటు ఇస్తే పార్టీకి మంచి ఊపు వస్తుందనేది 'జగన్‌' విశ్వాసమట. అయితే దీన్ని 'సునీల్‌' వ్యతిరేకిస్తున్నారు. కాగా 'సునీల్‌'ను 'జగన్‌' బుజ్జగిస్తున్నారని సమాచారం. జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన కోరుతున్నారట. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ గెలుస్తుందని, ఇక్కడ విజయం సాధిస్తే మంత్రిని చేస్తానని 'సునీల్‌'కు 'జగన్‌' హామీ ఇస్తున్నారట. అయితే ఈ బుజ్జగింపులకు 'సునీల్‌' మెత్తబడలేదని సమాచారం. మొత్తం మీద 'సునీల్‌, 'ముద్రగడ'లు పోటా పోటీగా ఈ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది ఇలా ఉంటే ఇక్కడ నుంచే జనసేన అధినేత 'పవన్‌కళ్యాణ్‌' పోటీ చేస్తారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయన కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే పోటీ మరింత రంజుగా ఉంటుందని రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం.


(758)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ