WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మోహన్‌లాల్‌' అద్బుత నటన:కనుపాప...!

మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ 'మన్యం పులి' విజయం తరువాత తన మరో సూపర్‌ హిట్‌ సినిమా కనుపాపను తెలుగులో డబ్‌ చేసి నేడు ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'మనమంతా, జనతా గ్యారేజ్‌, మన్యం పులి' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఆయన ఈ సినిమాతో మెప్పించగలిగారా? చూద్దాం..

కథ :

జయరామ్‌ (మోహన్‌ లాల్‌) ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పనిచేస్తూంటాడు. అంధుడైన అతడికి మాట, వాసన పసిగెట్టి ఎవ్వరినైనా గుర్తుపట్టగల సామర్థ్యం ఉంటుంది. జయరామ్‌తో అపార్ట్‌మెంట్‌లోని వారంతా చక్కగా మెలుగుతూంటారు. ముఖ్యంగా కృష్ణమూర్తి (నెడుమూడి వేణు) అనే రిటైర్డ్‌ సుప్రీమ్‌ కోర్టు జడ్జి తన జీవితంలో అందరికంటే ఎక్కువగా జయరామ్‌నే నమ్ముతూంటాడు. జయరామ్‌కు మూర్తి ఒక పెద్ద బాధ్యతను కూడా అప్పగిస్తాడు. ఇదిలా ఉండగానే వాసు (సముద్రఖని) అనే ఓ నిందితుడి చేతిలో కృష్ణమూర్తి హత్యకాబడతాడు.కృష్ణమూర్తి మరణంతో ఈ కథ ఏయే మలుపులు తిరిగిందీ? జయరామ్‌కు కృష్ణమూర్తి అప్పగించిన బాధ్యత ఏంటి? వాసు ఎవరు? అతడు మూర్తిని ఎందుకు చంపాలనుకుంటూంటాడు? ఈ కథలో శ్రీదేవి (విమలా రామన్‌), గంగ (అనుశ్రీ), నందిని (బేబీ మీనాక్షి) అంతా ఎవరు? చివరకు ఈ కథ ఎక్కడకు చేరుతుందన్నదే సినిమా.మోహన్‌ లాల్‌నే ఈ సినిమాకు ప్రధాన బలంగా చెప్పుకోవాలి. ఆయన తప్ప ఇంకెవ్వరూ ఈ పాత్ర చేయలేరేమో అన్నంత అద్భుతంగా, చాలా తెలివిగా నటించారు. సినిమా అంతా అంధుడిగా నటించడం, అందులో ఏ సన్నివేశంలోనూ తప్పులు వెతకనీకుండా చేయడంలో మోహన్‌లాల్‌ అనితర సాధ్యమైన ప్రతిభను చూడొచ్చు. ఇక అసలు కథ కొత్తదేమీ కాకపోయినా, దానిని అంధుడి పాత్రతో లింక్‌ చేయడం, థ్రిల్లింగ్‌గా ఆ కథను నడపడంలో స్క్రీన్‌ప్లే చాలా బాగుంది.ముఖ్యంగా ఫస్టాఫ్‌ వరకూ అసలు కథను కొద్దికొద్దిగానే పరిచయం చేస్తూ, ఇంటర్వెల్‌కు ఆ పాయింట్‌ను రివీల్‌ చేయడం బాగుంది. ఆ తర్వాత సెకండాఫ్‌ అంతా హీరో-విలన్ల మధ్య గేమ్‌లా పలు ఆసక్తికర సన్నివేశాలతో బాగా నడిచింది. క్లైమాక్స్‌లో వచ్చే మరో ట్విస్ట్‌ కూడా బాగా ఆకట్టుకుంది. మోహన్‌ లాల్‌ సహా మిగతాపాత్రధారులైన సముద్రఖని, విమలా రామన్‌, వేణు, బేబీ మీనాక్షి, అనుశ్రీ.. ఇలా అందరూ బాగా నటించి క్యాస్టింగ్‌ పరంగా సినిమాకు బలాన్నిచ్చారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే, సెకండాఫ్‌నే హైలైట్‌గా చెప్పుకోవచ్చు.సినిమా పేరుకే థ్రిల్లర్‌ అయినా చాలాచోట్ల నెమ్మదిగా సాగినట్లు అనిపించింది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సన్నివేశాలను సాగదీశారు. రన్‌టైమ్‌ రెగ్యులర్‌ సినిమాల మాదిరే ఉన్నా, లెంగ్తీగా ఉన్నట్లు అనిపించింది. అసలు కథకు మూలకారణమైన అంశం విషయంలో పెద్దగా లాజిక్‌ పట్టించుకున్నట్లు అనిపించలేదు. పగ అంటూ తిరిగే వాసు క్యారెక్టరైజేషన్‌ విషయంలోనూ జాగ్రత్త పడాల్సింది.


చాలాసేపు సాగే ఓ సంగీత్‌ పాట అవసరం లేదనిపించింది. ఫస్టాఫ్‌లో కూడా అనవసరమైన సన్నివేశాలకు ఎక్కువ చోటిచ్చినట్లు కనిపించింది. ఇక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా ఫార్మాట్‌కు దూరంగా ఉన్న ఈ సినిమా అలాంటి అంశాలే కోరేవారిని నిరుత్సాహ పరచే అంశం.ముందుగా దర్శకుడు ప్రియదర్శన్‌ గురించి చెప్పుకుంటే, ఇండియన్‌ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్న ఆయన, ఈ సినిమాలోనూ తన స్థాయికి తగ్గ ప్రతిభ చూపారు. గోవింద్‌ రాజన్‌ అందించిన కథకు ప్రియదర్శన్‌ సమకూర్చిన స్క్రీన్‌ప్లేకి వంకపెట్టలేం. అయితే సన్నివేశాల్లో ఎక్కువ డీటైలింగ్‌ చూపాలనుకోవడం, కాస్త స్లో నెరేటివ్‌ ఎంచుకోవడం విషయంలో తడబడ్డట్టు అనిపించింది. మేకింగ్‌ పరంగా మాత్రం అడుగడుగునా ప్రియదర్శన్‌ స్థాయి ప్రతిభ ఏంటో చూడొచ్చు.రోన్‌ ఎథన్‌ యోహన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకు ఓ ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్‌ సీన్‌లో వచ్చే స్కోర్‌ అద్భుతంగా ఉంది. 4 మ్యూజిక్స్‌ బ్రాండ్‌ అందించిన పాటల్లో రెండు వినడానికి చాలా బాగున్నాయి. ఎన్‌.కే.ఏకాంబరం సినిమాటోగ్రఫీ గురించి ఎంతచెప్పినా తక్కువే! ఏరియల్‌, ట్రాక్‌ ఇన్‌ షాట్స్‌తో పలు చోట్ల ఆయన చేసిన ప్రయోగం బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదనే స్థాయిలోనే ఉంది. ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ చాలా బాగున్నాయి.


అతి సాధారణంగా కనిపించే ఓ కథను, ఒక స్టార్‌, కట్టిపడేసే కథనం వేరే స్థాయికి తీసుకెళ్ళగలవని మరోసారి ఋజువు చేసిన సినిమా 'కనుపాప'. అంధుడిగా మోహన్‌ లాల్‌ అద్భుతమైన నటన, అంధుడైనా తనకు ఎదురైన అతిపెద్ద సమస్యను బుద్ధిబలంతో ఎదుర్కొంటూ సాగే అతడి పాత్ర చిత్రణ, కట్టిపడేసే సన్నివేశాలతో సాగే కథనం లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమాలో విలన్‌ పాత్ర చిత్రణ సాధారణంగా ఉండడం, సినిమా కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపించడం లాంటివి మైనస్‌లుగా చెప్పుకోవచ్చు.


(279)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ