WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఆ నలుగురి'కి టిక్కెట్‌ ఇవ్వరట...?

గుంటూరు జిల్లా టిడిపి రాజకీయాలు అనూహ్యమైన మలుపులు తిరుగుతున్నాయి. అపారమైన రాజకీయ చైతన్యం గల ఈ జిల్లాలో ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండగానే అధికార, ప్రతిపక్ష పార్టీలు అప్పుడే ఎన్నికల సహ్నాలు ప్రారంభించాయి. ముఖ్యంగా అధికార టిడిపిలో 'ఉగాది' నాటి భారీ స్థాయిలో మార్పులు జరుగుతాయని ఆ పార్టీలోని కీలక వ్యక్తులు చెబుతున్నారు. జిల్లాలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 'పత్తిపాటి పుల్లారావు', రావెల కిశోర్‌బాబు'ల పదవులు ఊడతాయని ఆయా వర్గాలు అంటున్నాయి.  వారితో పాటు జడ్పీచైర్‌పర్సన్‌ 'జానీమూన్‌' పదవికి కూడా ఎసరు వస్తుందని వారు చెబుతున్నారు.వీరిని పదవుల నుంచి తప్పించి వీరి స్థానంలో సమర్థులు, నిజాయితీపరులైన, ఎన్నికల క్యాబినెట్‌ను చంద్రబాబు ఏర్పాటు చేస్తారని వారు అంటున్నారు. అదే సమయంలో జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరికి వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు కూడా దక్కవని వారు చెబుతున్నారు.

   సాంఘికసంక్షేమశాఖ మంత్రి 'రావెల కిశోర్‌బాబు', తాడికొండ ఎమ్మెల్యే 'శ్రావణ్‌కుమార్‌, గుంటూరు-2 ఎమ్మెల్యే 'మోదుగుల వేణుగోపాలరెడ్డి, రేపల్లె ఎమ్మెల్యే 'అనగాని సత్యప్రకాష్‌'కు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వరని పార్టీలో 'చంద్రబాబు'కు సన్నిహితులైన వారు చెబుతున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన దగ్గర నుంచి ప్రజలకు దూరమై తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, వీరికి టిక్కెట్లు ఇస్తే ఈ సీట్లని ప్రతిపక్షానికి పువ్వుల్లో పెట్టి అప్పగించడమేనని వారు అంటున్నారు. ముఖ్యంగా మంత్రి 'రావెల'కు తన నియోజకవర్గ ప్రజల నుంచి, పార్టీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకుల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మంత్రికి వ్యతిరేకంగా వారు ఉద్యమిస్తున్నారు. నియోజకవర్గంలో స్వంత పార్టీ నాయకులను దూరంగా ఉంచుతూ...ప్రతిపక్ష వైకాపాకు చెందిన కార్యకర్తలకు, నాయకులకు ఆయన పనులు చేసిపెడుతున్నట్లు వారు విమర్శిస్తున్నారు. 'మంత్రి'పై పలుసార్లు వారు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. అయితే నూతనంగా 'రావెల' రాజకీయాల్లోకి రావడం, దళిత నాయకుడు కావడంతో ఆయన ఎన్ని తప్పులు చేసినా అధిష్టానం చూసీచూడనట్లు వ్యవహరించింది. అయితే కాలం గడిచే కొద్దీ ఆయన తన తీరును మార్చుకోకపోవడం, రోజు రోజుకు వివాదాదాల్లో కూరుకుపోతుండడంతో ఇక ఆయనను ఉపేక్షించేది లేదని అధిష్టానం బహిరంగానే చెప్పింది. మొదటి సారి ఎమ్మెల్యే అయినా...రాజకీయాల్లో ఆయనకు అనుభవం లేకపోయినా మంత్రిని చేసి పెద్ద పొరపాటు చేశామని..దాన్ని సరిదిద్దుకోక తప్పదనే భావనలో అధిష్టానం ఉంది. మొదట మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారని, ఎన్నికల నాటికి ఆయన స్థానంలో వేరొకరికి పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

   అదే విధంగా 'తాడికొండ' ఎమ్మెల్యే 'శ్రావణ్‌కుమార్‌' పనితీరు కూడా ఘోరంగా ఉందని ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇవ్వరని ఆయా వర్గాలు చెబుతున్నాయి. రాజధాని పరిధిలో ఉన్న ఈయన అధికార టిడిపికి చెందిన సామాజికవర్గాన్ని పూర్తిగా దూరం ఉంచుతున్నారట. దీంతో వారంతా 'శ్రావణ్‌'పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పలు గ్రామాల్లో 'శ్రావణ్‌కుమార్‌'ను రానీయవద్దని తీర్మానాలు చేశారట. ప్రజా సమస్యలపై ఆయనను కలిసేందుకు వెళ్లినవారిపై ఆయన మండిపడుతున్నారట. అంతే కాకుండా తాను వైకాపాలో చేరతాననే అర్థం వచ్చిటేట్లు మాట్లాడుతున్నారట. 'మీరు ఓట్లు వేయకపోయినా...ఫర్వాలేదు...నాకు ఓటు వేసేవారు...వేరే ఉన్నారని' అంటున్నారని ఆ నియోజకవర్గానికి చెందిన  కొందరు 'జనంఆన్‌లైన్‌.కామ్‌' ప్రతినిధితో చెబుతున్నారు. దీంతో ఆయనకు కూడా టిక్కెట్‌ రాదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

   ఇక గుంటూరు-2 ఎమ్మెల్యే 'మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి'ది మరో కథ. వైకాపా నాయకులతో బంధుత్వం ఉన్న 'వేణుగోపాల్‌రెడ్డి' టిడిపిలో గత పదేళ్ల నుంచి ఉంటున్నా...పార్టీకి అంటీ ముట్టనట్లే ఉంటున్నారు. 2009 ఎన్నికల్లో ఆయన నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపిగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి ఆయన బావ 'దశరథరామిరెడ్డి' వైకాపా నుంచి పోటీ చేస్తుండడంతో ఆయను టిడిపి అధిష్టానం 'గుంటూరు-2' నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించింది. అప్పట్లో ఆయన తాను గుంటూరు-2కు వెళ్లనని భీష్మించడంతో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిని చేస్తామని హామీ ఇచ్చారని ఆయన చెబుతుంటారు. అయితే అది ఎంత వరకు నిజమోకానీ...ఆయనను పార్టీలో పట్టించుకనేవారే లేరు. దీంతో ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా గుంటూరు మిర్చియార్డు ఛైర్మన్‌ వ్యవహారంలో తల దూర్చి తన సన్నిహితుడైన 'వెన్నాసాంబశివారెడ్డి'కి ఆ పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే ఆయనను పట్టును అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో తాను త్వరలోనే పార్టీ మారతానని ఆయన చెబుతున్నారట. ఆయన మారితే మాకేం ఇబ్బంది లేదని అధికార పార్టీ నాయకులు అంటున్నారు. అంటే ఈయనను పార్టీ వదిలించుకోవడానికి సిద్ధంగానే ఉందన్నమాట.

   ఇక 'రేపల్లె' ఎమ్మెల్యే 'అనగాని సత్యప్రసాద్‌' వ్యవహారం మరో రీతిలో ఉంది. ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన సామాన్య ప్రజలను కానీ, పార్టీ కార్యకర్తలను కానీ పట్టించుకోవడం లేదట. ఉంటే హైదరాబాద్‌ లేకుంటే 'శ్రీలంక'లో ఉంటారట. నియోజకవర్గంలో ఉండేదాని కన్నా ఆయన 'శ్రీలంక'లో ఉండేది ఎక్కువని పార్టీ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి గాలిలో గెలిచిన 'అనగాని'కి ఈ సారి టిక్కెట్‌ కష్టమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఈ నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ ఇవ్వదని పార్టీలోని కీలక వ్యక్తులు చెబుతున్నారు. చూద్దాం..మరి ఏం జరుగుతుందో...!


(8689)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ