WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

వై.వి.సుబ్బారెడ్డితో 'మంత్రి రావెల' రహస్యమంతనాలు...!

రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'రావెల కిశోర్‌బాబు' ఇక టిడిపితో తెగతెంపులు చేసుకున్నట్లే...! మంత్రిగా ప్రజలకు దూరమైన ఆయన రాజకీయభిక్ష పెట్టిన టిడిపికి క్రమం క్రమంగా దూరం అవుతున్నారు.ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని ఆయనను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసింది. మంత్రి పదవి దక్కిన తరువాత ఆయన పూర్తిగా ప్రజలకు, కార్యకర్తలకు దూరం అయి పరువు,ప్రతిష్టలను పోగొట్టుకున్నారు. నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో తగాదాలు, జడ్పీ చైరపర్స్‌న్‌తో వివాదాలు చిలికి చిలికి గాలివానలా మారి ఆయన పదవికి ముప్పు తెచ్చిపెట్టాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఆయనపై వేటు పడుతుందని మెజార్టీ పార్టీ నాయకులు ముక్తకంఠంతో చెబుతున్నారు. మంత్రి పనితీరుపై ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా హెచ్చరించారు. అయినా ఆయన తన వైఖరి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు ఖాయమైంది. అయితే తనపై వేటు వేస్తే పార్టీకి గుడ్‌బై చెబుతానని ఆయన బెదిరిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక రోజు హఠాత్తుగా ఆయన సెక్యూరిటీ సిబ్బందిని, ఇతర సిబ్బందిని వదలేసి మూడు గంటల పాటు అదృశ్యమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారో తెలియక భద్రతాసిబ్బంది విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఇంటిలిజెన్స్‌ వర్గాలు ఆయన ఎక్కడ ఉన్నారో ఆరా తీశారు. ఇంటిలిజెన్స్‌ వర్గాలు తెలుసుకున్న విషయం అటు సిఎంకు, ఇటు పార్టీ నాయకులకు షాక్‌కు గురిచేసిందట. మూడు గంటల పాటు అదృశ్యమైన మంత్రి రావెల తమ ప్రత్యర్థి పార్టీ అయిన వైకాపా ఎంపి, 'జగన్‌' బంధువు 'వై.వి.సుబ్బారెడ్డి'తో రహస్యంగా భేటీ జరిపారట.

    తనను మంత్రి పదవి నుంచి తొలగిస్తే...తాను టిడిపిలో ఉండనని ఆయన చెబుతున్నారట. అందుకే వైకాపా నేతలను కలసి తనను ఆ పార్టీలో చేర్చుకోవాలని కోరుతున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన 'జగన్‌' బంధువును కలశారనే చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే ఆ భేటీలో  ఏం జరిగిందో బయటకు తెలియడం లేదు కానీ...ఆయన వ్యవహరశైలి టిడిపి నేతలకు మింగుడుపడడం లేదు. తొలిసారి ఎమ్మెల్యే అయినా మంత్రి పదవి ఇచ్చినందుకు ఆయన పార్టీకి ఇచ్చే బహుమానం ఇదా...? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత వ్యక్తం అయితే ఆయన ప్రత్యర్థి పార్టీకి చెందిన వారితో భేటీ అవుతారా...? ఇటువంటి నాయకులను తెచ్చి తమపై రుద్దిన అధిష్టానంపై స్థానిక నాయకులు తీవ్రంగా రగిలిపోతున్నారు.


(7673)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ