WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'తాడేపల్లిగూడెం' నుంచి 'పవన్‌' పోటీ...!

2019 అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే రాజకీయ పార్టీ సన్నద్దం అవుతున్నాయి. ఎన్నికలకు మరో రెండు సంవత్సరాలకు పైగా సమయం ఉన్నా...అప్పుడే రాష్ట్ర రాజకీయ పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైకాపా అప్పుడే కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పుడు తన వెంట ఉన్న ఎమ్మెల్యేలకు యధావిధిగా 'జగన్‌' టిక్కెట్లు ఇవ్వనున్నారు. వారితో పాటు మరి కొందరి టిక్కెట్లు ఇస్తానని ఆయన బహిరంగంగా ప్రకటించారు. వైకాపా ఈ విధంగా టిక్కెట్ల రేసులో ముందుండగా సినీనటుడు,జనసేన అధ్యక్షుడు 'పవన్‌కళ్యాణ్‌' కూడా ముందస్తుగా అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. కాగా ఆయన రాబోయే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇప్పటికే పార్టీవర్గాలకు స్పష్టత ఇచ్చారు. ఆయన తన ఓటును 'ఏలూరు'లో నమోదు చేయించుకున్నారు. అంటే 2019 ఎన్నికల్లో ఆయన 'పశ్చిమగోదావరి' జిల్లాలో ఏదో స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన పార్టీ నాయకులు చెబుతుండగా ఆయన అభిమానులు మాత్రం ఆయన 'తాడేపల్లిగూడెం' నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు.

  ప్రస్తుతం ఈ స్థానం నుంచి దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి,బిజెపి పొత్తులో భాగంగా ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఇదే కూటమి నుంచి ఆయన పోటీ చేయనున్నారు. ఆయనకు పోటీగా ఇప్పుడు 'జనసేన' అధ్యక్షుడు పోటీ చేయబోతున్నారు. కాగా గత ఎన్నికల్లో వైకాపా తరుపున పోటీ చేసిన 'తోట పూర్ణ గోపాల సత్యనారాయణ' మళ్లీ వైకాపా నుంచి పోటీ చేస్తారు. ముక్కోణపు పోటీలో 'పవన్‌' భారీ మెజార్టీతో గెలుస్తాడని ఆయన అభిమానులు భావిస్తున్నారు. 'కాపు' సామాజికవర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారు గెలుపొందుతూ వస్తున్నారు. గత ఎన్నికల్లో బిజెపి,టిడిపి కూటమి తరుపు 'మంత్రి మాణిక్యాలరావు' పోటీ చేయగా వైకాపా నుంచి 'తోట' పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో 'కాపు' సామాజికవర్గ ఓటర్లు టిడిపి,బిజెపి అభ్యర్థి మాణిక్యాలరావుకు ఓటు వేశారు. అదే సమయంలో సినీనటుడు 'పవన్‌కళ్యాణ్‌' కూటమికి ప్రచారం చేయడం ఆయనకు భారీగా కలసి వచ్చింది. ఈ నేపథ్యంలో టిడిపి,బిజెపి కూటమి అభ్యర్థి సులువుగా గెలుపొందగలిగారు. అయితే రాబోయే ఎన్నికల్లో స్వయంగా 'పవన్‌' రంగంలోకి దిగుతుండడంతో ఆయన సామాజికవర్గానికి చెందిన ఓట్లు గంపగుత్తగా ఆయనకే పడతాయి. దీంతో ఆయన సులువుగా గెలుస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు. మొత్తంమీద 'పవన్‌' కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే మంత్రి మాణిక్యాలరావు మాజీ కావడం ఖాయమే...!


(290)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ