WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రావెల' దళిత సింహమా...!?

స్వంత నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత కొని తెచ్చుకున్న సాంఘిక సంక్షేమశాఖ మంత్రి 'రావెల కిషోర్‌బాబు'ను దళిత సింహంగా పేర్కొంటూ కటౌట్‌లు వెలుస్తున్నాయి. ఈ కౌటట్‌లు వెనుక మంత్రి ప్రోద్బలం ఉందా...? లేక ఆయన ద్వారా లబ్ది పొందిన వారు ఈ కటౌట్‌లను ఏర్పాటు చేశారా...? అనేది త్వరలో బయటపడవచ్చు. పార్టీ కార్యకర్తల్లో పట్టుసాధించేందుకు ప్రయత్నించకుండా ముఠా తగాదాలనుప్రోత్సహిస్తూ సీనియర్లను అవమానిస్తూ... దళిత వర్గ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమైన మంత్రి రావెల దళితసింహంగా వర్ణించుకుంటారా...? అని గుంటూరు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటు దళిత ఓటర్లుకూ అందుబాటులో ఉండరు..ఇటు సామాన్య వర్గాలను పట్టించుకోరు. అధికార వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయన కుటుంబ సభ్యులు తండ్రి అధికారాన్ని అండగా చెలరేగిపోతున్నట్లు ఇటీవల పలు పత్రికలు కథనాలను కూడా ప్రచురించాయి. గుంటూరు జెడ్పీ ఛైర్మన్‌ జానీమూన్‌ను పదవి నుంచి దించేందుకు 'రావెల' చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మైనార్టీ వర్గ మహిళను పరోక్షంగా, ప్రత్యక్షంగా మంత్రి అవమానాలకు గురి చేశారని, ధర్నాలు, రాస్తారోకోలు జరిగాయి. 

   పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడకుండా 'జగన్‌' పార్టీ టిక్కెట్‌ కోసం ప్రయత్నించి విఫలమై, ఎవరిని ఎలా పట్టుకున్నారో కానీ...'చంద్రబాబు' దృష్టిని ఆకర్షించి టిక్కెట్‌ తెచ్చుకుని టిడిపి గాలిలో గెలిచి కులం కోటాలో మంత్రి పదవి పొందారు. 'జగన్‌' పార్టీ టిక్కెట్‌ కోసం 'రావెల' ప్రయత్నించారని...అప్పటికి 'చంద్రబాబు'కు తెలియకపోవడం 'రావెల' చేసుకున్న అదృష్టం. ఐఆర్‌ఎస్‌ అధికారిగా 'రావెల'కు ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న 'చంద్రబాబు' ఆయనకు మంత్రి పదవి ఇచ్చారే తప్ప...ఆయనేదో సమర్థుడనో...లేక దూసుకెళతారని ఇవ్వలేదనేది వాస్తవం. కలసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా 'జగన్‌' పార్టీ నాయకులకు, ఓటర్లకు పనులు చక్కపెట్టడంతో ఆగ్రహం చెందిన పత్తిపాడు నియోజకవర్గ  సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు, స్థానికసంస్థల ప్రతినిధులు, దళిత నాయకులు మంత్రిపై తిరుగుబాటుబావుటా ఎగురవేశారు. దానిని పక్కదారి పట్టించేందుకు జడ్పీ ఛైర్మన్‌ జానీమూన్‌ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి ముఖ్యమంత్రితో మొట్టికాయలు వేయించుకున్నారు. 

   ఇటువంటి నాయకున్ని దళిత సింహంగా వర్ణిస్తున్న ప్రబుద్దులు ఎవరో కానీ..వివరాలు తెలుసుకుని వారి భరతం పడతామని టిడిపి దళితనాయకులు అంటున్నారు. పేరుకే దళిత వర్గానికి చెందిన మంత్రి. దళిత వర్గఓటర్లను దరిచేరనివ్వరు...వారిని అంటరాని వారిగా చూస్తారనే విమర్శ ఉంది. పదవి కోసం కులాన్ని అడ్డుపెట్టుకోవడంలో 'రావెల'కు ఉన్న చాకచక్యం మరే నాయకునికి ఉండదేమో...తమ నాయకుని దళిత సింహంగా వర్ణిస్తూ కటౌట్‌లు ఎవరు ఏర్పాటు చేశారో...తెలియదని...అనుచర వర్గం చెబుతున్నా...ఆ కౌటౌట్‌పై అనేక మంది పార్టీ నాయకుల పేర్లుతో పాటు ఇతర పేర్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని వారిని ప్రశ్నిస్తే మంత్రికి తెలియకుండా ఆకౌటౌట్‌లు ఏర్పాటు చేసి ఉంటారని చెబుతున్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో 'రావెల' పదవి పోవడం ఖాయమని ముఖ్యమంత్రి నుండి సంకేతాలు రావడంతో కులాన్ని అడ్డుపెట్టుకుని మంత్రి పదవిని నిలుపుకోవాలని 'రావెల' చేస్తున్న ప్రయత్నాలే ఈ కౌటౌట్‌లని పలువురు సీనియర్‌ ఎమ్మెల్యేలు అంటున్నారు.

(691)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ