WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్సీ రేసులో 'సుబ్బరాయుడు', రేణుక, అంగర...!

త్వరలో జరగనున్న 'పశ్చిమగోదావరి' జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటా నుండి ఇద్దరికి,ఎమ్మెల్యేల ద్వారా ఒకరికి లభించబోతున్నాయి. కాపు కుల కోటాలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడుకు మహిళల కోటాలో 'ముళ్లపూడి రేణుక'కు బిసి కోటాలో అంగర రామ్మోహన్‌కు లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు రామ్మోహన్‌ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం పూర్తి కావడంతో మళ్లీ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. 'చంద్రబాబు' కూడా 'అంగర' వైపు మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇందులో స్థానిక సంస్థల కోటా నుండి ఎవరెవరిని ఎంపిక చేస్తారు...? ఎమ్మెల్యేల ద్వారా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో స్పష్టత రావడం లేదు. స్థానిక సంస్థల కోటాలో 'సుబ్బరాయుడు'ను ఎంపిక చేస్తే 'ముళ్లపూడి రేణుక'ను ఎమ్మెల్యేల కోటాలో ఎంపిక చేయవచ్చు. ఒక వేళ 'రేణుక'ను స్థానిక సంస్థల ద్వారా ఎంపిక చేస్తే 'సుబ్బరాయుడు'ను ఎమ్మెల్యే ద్వారా ఎన్నికవుతారు. 'అంగర' మళ్లీ అవకాశం ఇస్తే స్థానిక సంస్థల ద్వారానే సాధ్యపడుతుంది. ఒక వేళ ఆయనను మార్చి మరో బిసీకి ఇవ్వాలనుకుంటే 'చంద్రబాబు' దృష్టిలో ఎవరు ఉన్నారో...? ఆయన అంతరంగం బయటపడలేదు. ఏ విధంగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా జిల్లా నుంచి ముగ్గురు నాయకులకు ఇవ్వడం ఖాయమని అధిష్టానం నుండి సంకేతకాలు అందాయి. ఇందులో మాజీ మంత్రి సుబ్బరాయుడుకు అన్ని వర్గాల్లో మంచి పేరు ఉన్నప్పటికి ఎన్నికలకు ముందు 'జగన్‌' పార్టీలో చేరి టిడిపి అభ్యర్థిపై 40వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఆయనను 'చంద్రబాబు' పిలిపించి పార్టీలో చేర్చుకున్నారు. 'ముళ్లపూడి రేణుక'కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పట్టుబడుతున్నారు. మహిళల కోటాలో ఆమెకు అవకాశం దక్కే అవకాశాలు ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో ఏదైనా మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని పార్టీ ముఖ్యుల నుంచి వస్తోన్న సమాచారం. 'అంగర రామ్మోహన్‌' ఆరేళ్లు ఎమ్మెల్సీ పదవి నిర్వహించారని, అదే సామాజికవర్గం నుండి మరొకరిని ఎంపిక చేయాలని పార్టీ నాయకులు కోరుతున్నప్పటికీ పార్టీకి వీరవిధేయుడైన 'అంగర' సేవలను మళ్లీ వినియోగించుకోవాలని 'చంద్రబాబు' భావిస్తున్నారు. సుబ్బరాయుడు విషయంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేసినా 'చంద్రబాబు' పట్టించుకోరు. మొదటి నుండీ ఆయన 'బాబు'కు ప్రియశిష్యుడు. ఏదో ఆవేశంలో తప్పు చేశారులే...అని...నాపై ఆయన ఎప్పుడూ విమర్శలు చేయలేదు...! అని 'చంద్రబాబు' కొందరి సమక్షంలో వ్యాఖ్యానించారట. మహిళల కోటాలో 'ముళ్లపూడి రేణుక'ను ఎంపిక చేయవద్దని ఆమె కుటుంబ సభ్యులు అడ్డుపడవచ్చు. కుటుంబ కలహాలు ఇతర కారణాలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి. దానిని 'చంద్రబాబు' పట్టించుకుంటారా...? లేదో వేచి చూడాల్సిందే...!
(986)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ