WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

కోనసీమ ఎమ్మెల్సీ 'కాపు'లకే...!

తూర్పుగోదావరి జిల్లా స్థానిక సంస్థలకు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాపు సామాజికవర్గానికి చెందిన వారికే అవకాశం ఇవ్వాలని 'చంద్రబాబు' నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ 'బొడ్డు భాస్కరరామారావు' కూడా తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నప్పటికీ ఆయన 'కమ్మ' వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకు అవకాశం లేనట్లే. అంతే కాకుండా పార్టీ నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయం సాధించి 'జగన్‌' పార్టీలో చేరి మళ్లీ టిడిపి గూటికి చేరుకున్నారు. అదే ఆయన పాలిట శాపం అయి ఆయనకు అవకాశం లేకుండా చేసింది. 2009,2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా 'జగ్గంపేట' నుండి ఓడిపోయిన 'జ్యోతుల చంటిబాబు' ఆర్థికంగా దెబ్బతిన్నారని ఆయనకు అవకాశం ఇవ్వాలని కాపు నాయకులు కోరుతున్నారు.'నెహ్రూ' టిడిపిలో చేరడంతో 'చంటిబాబు' మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు. 'చంటిబాబు' పార్టీకి విధేయుడైనప్పటికీ అనవసర ఆవేశాలతో లేనిపోయిన సమస్యలను కొని తెచ్చుకుంటారనే విమర్శ ఉంది. మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కుమారుడు 'మెట్ల రమణబాబు' పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. కాకినాడ ఎంపి తోట నర్సింహంకు 'రమణబాబు' స్వయానా బావమరిది. 

   బావకు ఎంపి ఇచ్చాం...బావ మరిదికి ఎమ్మెల్సీ ఎలా ఇస్తాం..అనే విషయం కూడా చర్చకు వస్తోంది. రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకునిగా పేరున్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రంగంలోకి దిగి తన పేరును పరిశీలించి అవకాశం ఇవ్వాలని 'చంద్రబాబు'ను స్వయంగా కలసి కోరారు. కానీ ఆయన ఆరోగ్య, వయస్సును దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిగా 'చిక్కాల'ను ఎంపిక చేస్తారా...? అనే విషయంపై చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా 'జ్యోతుల చంటిబాబు'కు కానీ... మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు కానీ ఎమ్మెల్సీ పదవి లభించే అవకాశం ఉండగా...తన బావమరిదికి ఎమ్మెల్సీ ఇవ్వాలని తోట నర్సింహ్మం పట్టుబడుతున్నారు. ఎవరు ఎంత పట్టుబట్టినా..ఒత్తిడి తెచ్చినా 'చంద్రబాబు' దృష్టిలో ఒకరిద్దరి పేర్లు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. ఎవరిని అభ్యర్థిగా నిర్ణయించాలో అనేది అధినేతే నిర్ణయం తీసుకుంటారని హోంమంత్రి చినరాజప్ప, ఆర్థిక మంత్రి రామకృష్ణుడు బాహాటంగా చెబుతున్నారు. మీరు ఎవరికైనా సిఫార్సు చేశారా..? అని 'జనం ప్రత్యేక ప్రతినిధి' స్వయంగా కలసి ప్రశ్నించగా అటువంటిదేమీ  లేదని...తాను ఎవరికీ సిఫార్సు చేయలేదని...అధినేత నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు. ఆర్థిక మంత్రి 'యనమల' కూడా ఇదే మాట వల్లెవేస్తున్నారట. ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి మంత్రి ప‌ద‌వి నిర్వ‌హించిన చిక్కాల‌కు గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసే అవ‌కాశం ఇవ్వ‌క‌పోయినా పార్టీ అభ్య‌ర్ది విజ‌యానికి స‌హ‌క‌రించార‌ని, ఆయ‌న సీనియార్టీని, సిన్సియార్టీని దృష్టిలో పెట్టుకుని ఆయనకు అవకాశం ఇచ్చి గౌరవించాలని పలువురు నాయకులు, కార్యకర్తలు 'చంద్రబాబు'కు విజ్ఞప్తి చేశారు.


(736)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ