లేటెస్ట్

'జవహర్‌రెడ్డి'కి కీలకశాఖ...!

గత పదేళ్ల నుంచి పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శిగా పనిచేసిన 'కె.ఎస్‌.జవహర్‌రెడ్డి'కి 'జగన్‌' ప్రభుత్వంలోనూ కీలకమైన పోస్టు దక్కింది. ఆయనను వైద్య,ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను సిఎంఒలోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. 'కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు' ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌శాఖ కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలు నిర్వహించిన ఆయన వైకాపా నాయకులతో సత్ససంబంధాలు నెరపారు. ఆయన దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆప్తుడనే పేరున్నా 'చంద్రబాబు' తన ప్రభుత్వంలో ఎంతో కీలకమైన పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖను కేటాయించారు. పైగా ఈశాఖకు తన కుమారుడ్ని మంత్రిగా చేశారు. వీరిద్దరూ కలసి పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధిశాఖను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారని ప్రచారం చేసుకున్నారు. 'చంద్రబాబు' ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులకు పోస్టింగ్‌ ఇవ్వని ప్రస్తుత ప్రభుత్వం 'జవహర్‌రెడ్డి'కి మాత్రం కీలకమైనశాఖను కేటాయించింది. వాస్తవానికి ఆయన సిఎంఒలోకి వెళతారని ప్రచారం జరిగినా..ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సన్నిహితడనే పేరుంది. దాంతో..ఆయనను సిఎంఒలోకి తీసుకోకుండా...ఆరోగ్యశాఖను అప్పచెప్పారని తెలుస్తోంది. 

కాగా 'చంద్రబాబు' ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన పలువురు ఐఎఎస్‌ అధికారులకు మళ్లీ కీలకమైన పోస్టులు లభించడం గమనార్హం. గుంటూరు జిల్లా కలెక్టర్‌ 'కోనశశిధర్‌'కు సివిల్‌సప్లయి కమీషనర్‌ పోస్టు దక్కింది. వాస్తవానికి ఆయన సిఎంఒలోకి తీసుకుంటారని మొదట్లో ప్రచారం జరిగింది. అయితే 'సాల్మాన్‌ ఆరోగ్యరాజ్‌'ను సిఎంఒలోకి తీసుకోవడంతో...'కోన'కు అవకాశం దక్కలేదు. యువకుడు, సమర్థుడు అయిన 'కోన'కు 'జగన్‌' నిత్యం ప్రజలతో సంబంధం ఉంటే శాఖను కేటాయించడం గమనార్హం. అప్పగించిన పనులను పూర్తి చేసి...లక్ష్యాలను సాధించే ఐఎఎస్‌గా పేరు తెచ్చుకున్న 'కోనశశిధర్‌'పై నమ్మకంతోనే ఆయనకు కీలకమైన శాఖ ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా గత ప్రభుత్వంలో ఆరోగ్యశాఖను నిర్వహించిన 'పూనం మాలకొండయ్య'కు వ్యవసాయశాఖ, వ్యవసాయశాఖకు కార్యదర్శిగా ఉన్న 'బుడితి రాజశేఖర్‌'కు పాఠశాల శాఖ కార్యదర్శి పోస్టు లభించింది. మున్సిపల్‌శాఖ కార్యదర్శిగా పనిచేసిన 'కరికాలవలవన్‌'కు బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా నియమించారు. ట్రైబల్‌వెల్ఫేర్‌శాఖ కార్యదర్శిగా ఉన్న 'రామ్‌ప్రకాష్‌ శిసోడియా'ను జిఎడి(పోలిటికల్‌) కార్యదర్శిగా నియమించడం ఆశ్చర్యకరమే. 'చంద్రబాబు' ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాణిజ్యపన్నుల కమీషనర్‌గా ఉన్న జె.శ్యామలరావుకు మున్సిపల్‌ కార్యదర్శి పోస్టు లభించింది. మొత్తం మీద టిడిపి హయాంలో ఒక వెలుగు వెలిగిన వారిలో చాలా మందికి మంచిపోస్టుల లభించడం గమనార్హం. 

(640)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ