WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శత్రుచర్లకు వద్దు...తూర్పుకాపులే ముద్దు...!

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలని మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామారావు ఉబలాటపడుతుండగా...విజయనగరం జిల్లాకు చెందిన శత్రుచర్లను ఏ విధంగా శ్రీకాకుళం జిల్లా అభ్యర్థిగా ఎంపిక చేస్తారని ఆ జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్షత్రియ కులానికి చెందిన శత్రుచర్లకు ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ సీటు ముఖ్యమంత్రి ఇస్తారు...ఓట్లు మావి...సీటు శత్రుచర్లకా...? అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వెలమ కులానికి చెందిన అచ్చెంనాయుడుకు మంత్రి పదవి ఇచ్చారు..తూర్పు కాపు కులానికి చెందిన 'కళావెంకటరావు'కు టిడిపి అధ్యక్షపదవి ఇచ్చారు..ఆ రెండు వర్గాలకు చెందని తనకు ఎమ్మెల్సీ సీటు ఎందుకు ఇవ్వకూడదని శత్రుచర్ల ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన శ్రీకాకుళం టిడిపి నాయకులు శత్రుచర్లపై విమర్శలు కురిపిస్తున్నారు. పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉండి అధికారాన్ని అనుభవించి  టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన శత్రుచర్ల ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి పాతపట్నం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. అంతే కాదు...1998లో జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో టిడిపిలో చేరి ఎంపిగా విజయం సాధించిన శత్రుచర్ల అప్పట్లో వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోవడానికి ముఖ్య కారణం ఆయన కాదా...? అప్పట్లో కేవలం ఒకే ఒక్క ఓటుతో వాజ్‌పేయి ప్రభుత్వం కూలిపోయింది. టిడిపి ఎంపిగా ఉన్న శత్రుచర్ల వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకంగా ఓటు వేయడంతో ప్రభుత్వం పడిపోయింది. 

   అప్పట్లో పార్టీకి ద్రోహం చేసిన శత్రుచర్లను మళ్లీ 2014 ఎన్నికల ముందు పార్టీలో చేర్చుకుని పాతపట్నం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించి పెద్ద తప్పిదం చేశారని, మళ్లీ ఎమ్మెల్సీ సీటు ఇచ్చి మరో తప్పుకు అవకాశం ఇవ్వద్దని శ్రీకాకుళం జిల్లా నాయకులు కోరుతున్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న తూర్పుకాపు ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఆ సామాజికవర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని రోజు రోజుకు ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ జిల్లాకు చెందిన మృణాళినిని విజయనగరం జిల్లా పరిధిలోని ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వడమే కాకుండా విజయం సాధించిన తరువాత మంత్రి పదవి కూడా ఇవ్వలేదా...? ఆ జిల్లాకు చెందిన తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇస్తే అభ్యంతరం ఏమిటని శత్రుచర్ల  రుసరుసలాడుతున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వ్యక్తం కాని అభ్యంతరాలు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే అభ్యంతరం వ్యక్తం చేస్తారా..? శత్రుచర్ల అగ్గిపై గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే 'చంద్రబాబు' తనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని, తనకు మద్దతు ఇవ్వాలని జిల్లాకు చెందిన మంత్రి అచ్చెంనాయుడుకు, ఎంపి రామ్మోహన్‌కు ఫోన్‌ చేశారట. 

   ఎట్టి పరిస్థితుల్లో శత్రుచర్లకు మద్దతు ఇచ్చే ప్రసక్తేలేదని మెజార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపి, మంత్రి అచ్చెంనాయుడులు గట్టిపట్టుదలతో ఉన్నారు. తూర్పు కాపు సామాజికవర్గానికి చెందిన వారికే ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇస్తారని, మంత్రి అచ్చెం,ఎంపి తమ సన్నిహితులతో ఆఫ్‌ ది రికార్డుగా తెలిపారు. దీంతో ఖంగుతిన్న శత్రుచర్ల ఏమి చేయాలో పాలుపోక కేవలం 'చంద్రబాబు'పైనే ఆశలు పెట్టుకున్నారు. కానీ 'చినబాబు' స్థానిక తూర్పుకాపు కులానికి చెందిన తన అనుచరునికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా తూర్పుకాపు కులానికి చెందిన కళా వెంకటరావుకు మంత్రి పదవి ఇస్తారని ఈ నేపథ్యంలో మరో సామాజికవర్గానికి చెందిన వారిని పరిశీలించాలని 'చంద్రబాబు'ను పలువురు నాయకులు కోరుతున్నారు. మాజీ మంత్రి, సీనియర్‌ ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌సుందర్‌ శివాజీ తన కుమార్తెకు  పోటీ చేసే అవకాశం ఇవ్వాలని బాహాటంగా బయటపడకపోయినప్పటికీ మనసులో మాత్రం కోరుకుంటున్నట్లు పలువురు నాయకులు చెబుతున్నారు.


(700)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ