లేటెస్ట్

'పల్నాడు'పై 'జగన్‌' శీతకన్ను...!

నూతన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు. మొత్తం 25 మందితో రేపు మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. తన మంత్రివర్గంలో 50శాతం మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకుచెందిన వారు ఉంటారని ఆయన చెప్పుకున్నారు. ఆయన చెప్పిన విధంగానే మంత్రివర్గంలో ఆయా వర్గాలకు స్థానం కల్పించారు. అయితే ప్రాంతాల వారీగా చూసుకుంటే కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాలను ఆయన పూర్తిగా మరిచిపోయినట్లు కనిపిస్తోంది. రాజకీయ చైతన్యం అధికంగా కలిగిన గుంటూరు జిల్లాల్లో ముగ్గురికి మంత్రి పదవులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పత్తిపాడు నుంచి గెలిచిన 'సుచరిత', మంగళగిరి నుంచి గెలుపొందిన 'ఆళ్ల రామకృష్ణారెడ్డి'తో పాటు 'రేపల్లె'లో ఓడిపోయిన 'మోపిదేవి వెంకటరమణ'లకు మంత్రి పదవులు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో 'సుచిరిత' ఎస్సీ వర్గానికి చెందిన వారు కాగా..'ఆళ్ల' 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారు. ఇక ఓడిపోయిన 'మోపిదేవి' మత్స్యకార వర్గానికి చెందిన నేత. సామాజికపరంగా చూసుకుంటే కొంత వరకు బాగానే ఉన్నా..ప్రాంతాలవారీగా మాత్రం చూసుకుంటే 'పల్నాడు' ప్రాంతానికి అన్యాయం జరిగినట్లు స్పష్టమవుతోంది.

గుంటూరు జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా 'పల్నాడు' ప్రాంతానికి మొదట ప్రాధాన్యత ఇస్తారు. కాంగ్రెస్‌ హయాంలో కానీ, టిడిపి హయాంలో కానీ..ఈ ప్రాంతానికి మంత్రి పదవి కేటాయించడం ఆనవాయితీగా ఉంది. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన 'పల్నాడు' విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి శీత కన్ను వేసినట్లు కనిపిస్తోంది. ఈ ప్రాంతంలో 'జగన్‌' పార్టీ స్వీప్‌ చేసినా...మంత్రి పదవి విషయంలో న్యాయం చేయలేదనే అభిప్రాయం కనిపిస్తోంది. పల్నాడు ప్రాంతంలోని 'వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల, గురజాల, పెదకూరపాడు, చిలకలూరిపేట, నర్సరావుపేట' నియోజకవర్గాల్లో వైకాపా ఘనవిజయం సాధించింది. ఇక్కడ నుంచి వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీలతో గెలుపొందారు. వైకాపా స్థాపించిన దగ్గర నుంచి వైకాపాలోనే కొనసాగుతున్న సీనియర్‌ ఎమ్మెల్యేలకైనా మంత్రి పదవి ఇవ్వాల్సిందనే అభిప్రాయం ఈ ప్రాంత ప్రజల్లో ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల సమస్యలపై దృష్టి సారించక పోవడంతో..మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది. పలుసార్లు ఇక్కడ నుంచి గెలుపొందిన సీనియర్‌ ఎమ్మెల్యేలు.. ఈసారి ప్రజాగ్రహానికి కొట్టుకుపోయారు. రాజకీయచైతన్యం అధికంగా కలిగిన ఈ ప్రాంత ప్రజలు..ఎవరు ఏమి చేస్తున్నారో.. నిత్యం గమనిస్తూనే ఉంటారు. రాజకీయంగా అతి సున్నితమైన ఈ ప్రాంతాన్ని 'జగన్‌' మరిచిపోవడం పార్టీకి మంచిది కాదని..పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు అభిప్రాయపడుతున్నారు. చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే 'మర్రి రాజశేఖర్‌'కు మంత్రి పదవి ఇస్తానని 'జగన్‌' హామీ ఇచ్చినా..ప్రస్తుతానికి ఆ హామీని నిలబెట్టుకోలేదు. రెండున్నరేళ్ల తరువాత..ఆయనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారేమో...? ఏది ఏమైనా ఎంతో అభిమానంతో 'జగన్‌'కు ఓటు వేసిన..ఈ ప్రాంత ప్రజలు తమ ప్రాంతానికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై నిరాశ చెందుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

(599)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ