WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శత్రుచర్ల'పై 'బాబు'కు అంత అభిమానమేల...?

శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శత్రుచర్ల విజయరామరాజును ఎంపిక చేయవద్దని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన అధికారపార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రతినిధులు పదే పదే అధిష్టానానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వారి మాట కాదని అధిష్టానం ఆయనను ఎంపికచేసి ఏకగ్రీవంగా గెలిపించగలిగిన సంగతి తెలిసిందే.పదేళ్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో మంత్రిగా పనిచేసి తెలుగుదేశం కార్యకర్తలను పలు ఇబ్బందులకు గురిచేసిన ఆయనను పార్టీలో ఎలా చేర్చుకున్నారు...? ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎలా ఇచ్చారు..? ఓడిపోయిన తరువాత కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికచేయడమేమిటి...? దీని వెనుక కారణాలు ఏమిటో తమకు అర్థం కావడం లేదని పై జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు కూడా శత్రుచర్ల ఎంపికను తప్పుబట్టి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఆయన మాటను కూడా 'చంద్రబాబు' ఖాతరు చేయకపోవడంపై పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు చంద్రబాబు ఆయనపై ఇంత అభిమానం చూపారనే విషయంపై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో చేరి మూడేళ్లు గడుస్తున్నా ఆయనకు ఇంకా కాంగ్రెస్‌ వాసనలు పోలేదని, విపక్షాల నాయకులకు, కార్యకర్తలకు పనులు చేసి పెడుతున్నారని ఆయనపై పలు ఫిర్యాదులు అధిష్టానానికి అందాయి. 

    శత్రుచర్ల గిరిజనుడు కాదని 'సుప్రీంకోర్టు' తీర్పు ఇవ్వడంతో ఆయన 2009లో పాతపట్నం నుంచి ఓసి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. 2014లో ఓడిపోయినా ఆయనను అగ్రకుల అభ్యర్థిగానే పరిగణిస్తామే తప్ప ఆయన గిరిజన కులానికి చెందిన వారు కాదని ఈ విషయాన్ని అనేక సార్లు పెదబాబు, చినబాబు దృష్టికి తీసుకెళ్లామని, వారిద్దరు కూడా ఎందుకు ఆయనపై మొగ్గుచూపారో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు పార్టీ నాయకులు.1998లో టిడిపి ఎంపిగా విజయం సాధించిన శత్రుచర్ల వాజ్‌పేయి నాయకత్వంలోని ఎడిఎన్‌ ప్రభుత్వం అవిశ్వాసం ఎదుర్కొన్నప్పుడు 'చంద్రబాబు' ఆదేశాలను ఖాతరు చేయకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటువేసి ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఆయన తరువాత కాంగ్రెస్‌లో చేరిపోయారు. వై.ఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన శత్రుచర్లకు ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు..? అప్పట్లో ఆయన చేసిన నిర్వాకం చంద్రబాబుకు గుర్తు లేదా..? ఎన్‌డిఎ ప్రభుత్వం కూలిపోవడం వల్ల మళ్లీ ఎన్నికలు జరగడంతో వచ్చిన ఎన్నికల్లో టిడిపి ఘనవిజయం సాధించింది. ఇదంతా 'శత్రుచర్ల' వల్లేనని..'బాబు' భావించి ఆ కృతజ్ఞతతో ఇప్పుడు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారేమో...!

(1055)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ