జగన్ జీవితచరిత్రపై సినిమా...!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్రపై సినిమా రాబోతోంది. ఈ సినిమాకు యాత్ర దర్శకుడు మహి రాఘవ దర్శకత్వం వహించబోతున్నారు. మహి గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమాను తెరకెక్కించారు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ చిత్రం వైకాపాకు బాగానే ఉపయోగపడింది. 2004 ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ జీవితచరిత్రను సినిమాగా తీసేందుకు రాఘవ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ చిత్రంలో జగన్ పాత్రను హిందీ నటుడు పాత్రిక్ గాంధీ పోషిస్తారట. స్కామ్ 1992 చిత్రంలో అద్భుతంగా నటించిన పాత్రిక్ జగన్ పోలికలు ఉన్నాయని, ఆయన అయితే జగన్ క్యారెక్టర్ కు న్యాయం చేస్తారని, ఆయనను ఇందులో హీరోగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. జగన్ పాత్ర గురించి పాత్రిక్ కు చెప్పిన వెంటనే ఆయన థ్రిల్ కు గురయ్యారని, స్టోరీ కూడా నచ్చిందని, వెంటనే ఒప్పుకున్నారని రాఘవ చెప్పారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారని, అందుకే పాత్రిక్ ను కధానాయకుడిగా ఎన్నుకున్నారని చెబుతున్నారు. 2009 హెలీకాప్టర్ ప్రమాదంలో వై.ఎస్ మరణించిన దగ్గర నుంచి చిత్రం ప్రారంభం అవుతుందని, అక్కడ నుంచి రాజకీయంగా జగన్ ఎలా ఎదిగిందీ, నూతన పార్టీ ఎలా ప్రారంభించి అధికారంలోకి ఇచ్చిన వరకు చెబుతారని అంటున్నారు. జగన్ కాంగ్రెస్ తో విబేధించి స్వంతంగా రాజకీయపార్టీ పెట్టడం, ఈ సమయంలో ఆయనపై అవినీతి కేసులు నమోదు కావడం, తరువాత ఆయన జైలుకు వెళ్లడం, బెయిల్ పై రావడం, 2014 ఎన్నికల్లో ఓడిపోవడం వంటి అంశాలను కూడా సినిమాలో ప్రస్తావిస్తారు. రాజశేఖర్ రెడ్డి వలే జగన్ కూడా మాస్ లీడరని, ప్రజలను ఎలా ఆయన ఆకట్టుకున్నారో..జగన్ కూడా అదే విధంగా ఆకట్టుకుంటున్నారి, అందుకే ఆయన జీవితచరిత్రను సినిమాగా తీయాలని భావిస్తున్నామని దర్శకుడు రాఘవ చెబుతున్నారు.