లేటెస్ట్

గుంటూరు మంత్రులు వీరే...!

'జగన్‌' మంత్రి వర్గంలో గుంటూరు జిల్లాకు పెద్దపీట వేశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపా ఈ జిల్లాల్లో దాదాపు స్వీప్‌ చేయడంతో పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కాకుండా... మాజీ ఎమ్మెల్యే 'మర్రి రాజశేఖర్‌'కు మంత్రి పదవి ఇస్తానని స్వయంగా 'జగన్‌' హామీ ఇవ్వడంతో..ఆయనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు భావించారు. కానీ..ఆయన ను ప్రస్తుతానికి కాదని 'పత్తిపాడు' నుంచి గెలుపొందిన మేకతోటి సుచరిత, ఆళ్లరామకృష్ణారెడ్డి, మోపిదేవి వెంకటరమణల కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు.

'సుచరిత': 'పత్తిపాడు' నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ఆమె తొలిసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి 'వీరయ్య'పై 2వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. ముక్కోణపు ఎన్నికల్లో ఆమె స్వల్ప తేడాతో విజయం సాధించారు. అయితే తరువాత 'జగన్‌' కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి వైకాపా స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో ఆమె టిడిపి అభ్యర్థి 'రావెల కిశోర్‌బాబు'పై ఓడిపోయారు. ఓడిపోయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ఆమె మొన్న జరిగిన ఎన్నికల్లో పత్తిపాడు నుంచి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌పై ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో వైకాపా ఘన విజయం సాధించడంతో..ఆమెకు మంత్రి పదవి లభిస్తుందని మొదటి నుంచి చాలా మంది భావించారు. అందరూ ఊహించిన విధంగానే ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటూ 'జగన్‌' నిర్ణయం తీసుకున్నారు. 

'ఆళ్ల రామకృష్ణారెడ్డి': 'జగన్‌'కు అత్యంత సన్నిహితుడైన 'ఆళ్ల' 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి 'చిరంజీవి'పై 12 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి ఆయన అధికార టిడిపిపై పలు కోర్టుల్లో న్యాయపోరాటాలు చేశారు. రాజధాని ప్రాంతంలో ఆయన పోరాటాలు సంచలనం సృష్టించాయి. దీంతో..ఆయనను ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి రానీయకూడదనే భావనతో 'చంద్రబాబు' స్వయంగా తన కుమారుడ్నే ఆయనపై పోటీ చేయించారు. అయితే ఎప్పుడూ ప్రజల్లో ఉంటే 'ఆళ్ల' ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో 'ఆళ్ల'ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానంటూ..'జగన్‌' హామీ ఇవ్వడం..'ఆళ్ల' గెలవడంతో..ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. 

'మోపిదేవి వెంకటరమణ: దివంగత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడైన 'వెంకటరమణ' పలుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. అయితే 'జగన్‌' అక్రమాస్తుల కేసులో నిందితుడిగా.. ఆయన 'జగన్‌'తో పాటు జైలు జీవితం గడిపారు. గత ఎన్నికల్లో 'రేపల్లె' నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బీసీ వర్గానికి చెందిన నేత కావడం, తనతో పాటు జైలు జీవితం గడపడంతో..ఆయన ఓడిపోయినా... మంత్రివర్గంలోకి తీసుకున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఏది ఏమైనా జిల్లాలో 'పల్నాడు' ప్రాంతాన్ని మినహాయించి కృష్ణా పరివాహ ప్రాంతానికి మంత్రి పదవులు దక్కాయి. గుంటూరు పార్లమెంట్‌ స్థానంలో రెండు పదవులు, బాపట్ల పార్లమెంట్‌ స్థానంలో ఒక పదవి లభించింది. 

(558)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ