WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఒకరి కులం...ప్లస్‌...మరొకరికి మైనస్‌...!

గుంటూరు జిల్లాలో గత ముప్పయి సంవత్సరాలుగా పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన 'పుష్పరాజ్‌'కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా, నిన్న కాక మొన్న పార్టీలో చేరిన మాజీ మంత్రి మాణిక్యవరప్రసాద్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం వెనుక కులాల ఈక్వేషన్‌ పనిచేసింది. 'పుష్పరాజ్‌' దళితవర్గానికి చెందిన మాల వర్గానికి చెందిన వారు కాగా, మాణిక్యవరప్రసాద్‌ మాదిగ వర్గానికి చెందిన వారు. ఇదే 'వరప్రసాద్‌'కు కలసి వచ్చింది. ఎంపి రాయపాటి ఒత్తిడి కూడా బాగా పనిచేసింది. 'పుష్పరాజ్‌' సామాజికవర్గానికి చెందిన ఓటర్లు 90శాతంపైగా 'జగన్‌' పార్టీ అభిమానులేనని గత ఎన్నికల్లో స్పష్టం అయింది. ఎన్ని సౌకర్యాలు కల్పించినా, వారికి ఎన్ని పనులు చేసిపెట్టినా వారిలో ఎటువంటి మార్పు రాలేదని పాలకులకు అనుభవంతో తెలిసివచ్చింది. మాదిగ సామాజికవర్గానికి చెందిన మెజార్టీ ఓటర్లు టిడిపివైపు మొగ్గుచూపుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు. 2004లో 'పుష్పరాజ్‌'పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించిన 'వరప్రసాద్‌'కే ఇప్పుడు ఎమ్మెల్సీగా అభ్యర్థిత్వం దక్కింది. 

   కాంగ్రెస్‌ వ్యతిరేకిగా 'పుష్పరాజ్‌'కు గుర్తింపు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు అమ్ముకుంటున్నారన్న ఆయన ప్రకటనే ఇప్పుడు ఆయన కొంప ముంచింది. ఎన్ని పదవులు ఇచ్చినా, ఎంత ప్రోత్సహించినా 'పుష్పరాజ్‌' తన సామాజికవర్గానికి చేరువ కాలేకపోయారని 'చంద్రబాబు' భావిస్తున్నారు. తనకు విధేయత కన్నా, సమర్థత ముఖ్యమని, మళ్లీ పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని సామాజికవర్గాలకు దరి చేర్చుకోవాలని 'చంద్రబాబు' ఇటీవల కొందరితో వ్యాఖ్యానించారట. దళిత వర్గానికి చెందిన మాలల్లో ఎక్కువ మంది క్రైస్తవలు కావడంతో వారు 'జగన్‌' వైపు మొగ్గు చూపుతున్నారని టిడిపి నాయకులు అంటున్నా వారు మొదటి నుంచి కాంగ్రెస్‌ మద్దతుదారులే అనే విషయాన్ని వారు మరిచిపోతున్నారని మరో వర్గం అంటోంది. నోటి దురుసుతనంతో తన అవకాశాలను తానే దెబ్బతీసుకున్నారు 'పుష్పరాజ్‌'. అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీలో చేరిన 'వరప్రసాద్‌' 'రాయపాటి'ని వదిలిపెట్టకుండా..తన అంతరంగికం బయటపడకుండా ఆయన ద్వారా ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్సీ పదవి పొందారు. ఇటువంటి ప్రయత్నాలు ఏమీ చేయకుండా తాను పార్టీలో చాలా మందికన్నా సీనియర్‌ను అని...తనకు పిలిచి పదవి ఇస్తారని భావించిన 'పుష్పరాజ్‌'కు 'చంద్రబాబు' చుక్కలు చూపించారు. ఇటీవల 'పుష్పరాజ్‌' చేస్తోన్న విమర్శలు 'చంద్రబాబు' దృష్టికి వచ్చాయి. నోటి దురుసుతనం తగ్గించుకోవాలని, అధినేతపై విమర్శలు చేయవద్దని కొంత మంది నాయకులు చెప్పినా 'పుష్పరాజ్‌' వినిపించుకోలేదు. విచిత్రమైన విషయం ఏమిటంటే 'చంద్రబాబు' వైపే ఆయన మొదటి నుంచి ఉండేవారు. ఆ కోపంతో 1994లో తాటికొండ సీటును సిపీఐకి ఇచ్చే విధంగా 'దగ్గుబాటి' ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చారు. 

   1999 ఎన్నికల్లో ఆయనకే టిడిపి టిక్కెట్‌ ఇచ్చారు చంద్రబాబు. విధేయత కన్నా...సమర్థతకన్నా...సీనియార్టీని పరిగణలోకి తీసుకుంటారని భావించిన 'పుష్పరాజ్‌' పరిస్థితి తారు మారు కావడంతో ఖంగుతిన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి రావడం ఖాయమని, మాణిక్యవరప్రసాద్‌ కొందరితో చెప్పినప్పటికీ వారిలో ఏ ఒక్కరూ నమ్మలేదట. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,మంత్రులు కూడా 'మాణిక్యవరప్రసాద్‌' ఎంపిక ఆశ్చర్యపరిచింది. మరో రెండేళ్ల అనంతరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 'మాదిగ' సామాజికవర్గంలో పట్టున్న 'వరప్రసాద్‌'ను ఎమ్మెల్సీ చేయడం సరైన నిర్ణయమేనని కొంతమంది ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఆయనకు కులం కలసి వచ్చింది...దానితో పాటు కాలం కూడా కలసి వచ్చింది...'రాయపాటి' ఒత్తిడి పనిచేసింది...ఇతర నాయకులు ఎవరూ అభ్యంతరాలు పెట్టలేదు...!పుష్పరాజ్‌కు ఎమ్మెల్సీ ఇవ్వాలని గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలుకానీ, ఇతర ముఖ్యనాయకుల కానీ 'చంద్రబాబు'కు సిఫార్సు చేశారో లేదో బయటకు రావడం లేదు. ఆవేశంతోనే...ఆవేదనతోనే తెలిసో తెలియకో...కొన్ని వ్యాఖ్యలు చేసిన 'పుష్పరాజ్‌'ను పక్కన పెట్టి, నిన్నకాక మొన్న పార్టీలోకి వచ్చిన 'వరప్రసాద్‌'కు ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వితీయశ్రేణి నాయకులకు, కార్యకర్తలకు మింగుడుపడడం లేదు. ఎక్కడ కోల్పోయామో..అక్కడే పొందాలనే ఆలోచన 'పుష్పరాజ్‌'కు లేదు. రాజకీయాల్లో సమర్థత, సీనియార్టీ కన్నా...లౌక్యం, సిఫార్సులు ముఖ్యమన్న సంగతికి ఆయనకు పెద్దగా తెలియనట్లుంది.

(592)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ