లేటెస్ట్

'కమ్మ'లకు ఒక్కటేనా...!?

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సామాజిక సమతౌల్యాన్ని పాటించి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నా...రాష్ట్రంలో గుర్తింపు పొందిన 'కమ్మ' సామాజికవర్గానికి న్యాయం చేయలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 'కమ్మ' సామాజికవర్గం మొత్తం 'చంద్రబాబు' వెంట ఉంటుందని..వారికి మంత్రి పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయం పార్టీలో ఉన్నా..అది నిజం కాదని మొన్నటి ఎన్నికలు నిరూపించాయి. ఈ ఎన్నికల్లో...'కమ్మ' ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట్ల కూడా వైకాపా అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సామాజికవర్గం అధికంగా ఉండే గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరిలో కొంత ప్రాంతం, ప్రకాశం, అనంతపురం తదితర జిల్లాల్లో వైకాపా అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఆది నుంచి టిడిపిని సమర్థిస్తారని ఈ సామాజికవర్గానికి పేరున్నా..గత ఎన్నికల్లో వారు...టిడిపికి గంపగుత్తగా ఓట్లు వేయలేదన్న నిజం..ఈ సామాజికవర్గానికి చెందిన వారిలో దాదాపు 40శాతం వైకాపాకు ఓట్లు వేశారని ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత...తేలిపోయింది. 'కమ్మ' సామాజికవర్గం అధికంగా ఉండే 'పల్నాడు' ప్రాంతం కానీ..కృష్ణాలోని మెట్ట ప్రాంతంలో కానీ..వైకాపా ఘన విజయం సాధించింది. నర్సరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని అన్ని సీట్లల్లో ఈ సామాజికవర్గ ఓటర్లు అధికార పార్టీని ఆదరించారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే వీరు ఎంత ఆదరించినా..ఈ వర్గానికి మంత్రివర్గంలో ఒక్కరికే స్థానం కల్పిస్తూ..ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 

ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత..ఈ సామాజికవర్గానికి ఖచ్చితంగా రెండు మంత్రి పదవులు వస్తాయని రాజకీయ పరిశీలకులు భావించారు. గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే 'మర్రి రాజశేఖర్‌'కు మంత్రి పదవి ఇస్తానని 'జగన్‌' హామీ ఇవ్వడంతో..ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన 'కొడాలి నాని'కి మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తుందని ఆ సామాజికవర్గానికి చెందిన వారు ఆశించారు. కానీ..ముఖ్యమంత్రి 'మర్రి'ని పక్కన పెట్టి..'కొడాలి'ని మాత్రమే మంత్రివర్గం లోకి తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు... ఈ సామాజికవర్గానికి చెందిన 'గల్లా అరుణ, మాగంటి బాబు'లకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆ తరువాత..స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని 'మాగంటి బాబు'ను మంత్రివర్గం నుంచి తప్పించారు. 2009 ఎన్నికల్లో వై.ఎస్‌ మళ్లీ గెలిచిన తరువాత..ఈ సామాజికవర్గానికి ఒక్కటే మంత్రి పదవి ఇచ్చారు. అప్పట్లో 'గల్లా అరుణ'కు మాత్రమే స్థానం కల్పించారు. ఇప్పుడు...వై.ఎస్‌.జగన్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. తనను సమర్థించని వర్గాలకు మంత్రి పదవులు భారీగా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లుంది. మొత్తం మీద...వైకాపాను సమర్థించే ఈసామాజికవర్గ నేతలు..తమకు సరైన గుర్తింపు రాలేదనే అభిప్రాయంతో ఉన్నారు. 

(736)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ