లేటెస్ట్

ఓడిపోయిన ఇద్దరికి మంత్రి పదవులు...!

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తనను నమ్ముకున్న ఇద్దరి నాయకులకు న్యాయం చేశారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా..ఆది నుంచి తన వెంట నడిచిన 'పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ'లకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కాంగ్రెస్‌తో విభేదించి స్వంత పార్టీ స్థాపించినప్పుడు మంత్రిగా ఉన్న 'పిల్లి సుభాష్‌చంద్రబోస్‌' మంత్రి పదవికి రాజీనామా చేసి 'జగన్‌' వెంట నడిచారు. అప్పట్లో 'జగన్‌' కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రి 'సుభాష్‌చంద్రబోస్‌'. మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన ఆయన తరువాత జరిగిన ఉపఎన్నికల్లో ఓడిపోయినా..'జగన్‌'వెంటనే ఉన్నారు. 2014 ఎన్నికల్లో మరోసారి ఓడిపోయిన 'బోస్‌' మొన్నటి ఎన్నికల్లోనూ ఓడిపోయారు. అయితే తననే నమ్ముకుని, తన కోసం మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన 'బోస్‌'కు 'జగన్‌' ఇప్పుడు మంత్రి పదవి ఇస్తూ న్యాయం చేశారు. 'జగన్‌'ను నమ్ముకున్నందుకు తమ నేతకు న్యాయం జరిగిందని 'బోస్‌' అనుచరులు ఆనందంగా చెబుతున్నారు. 

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన 'మోపిదేవి వెంకటరమణ' 'జగన్‌' అక్రమాస్తుల కేసులో మంత్రిగా ఉండి జైలుకు వెళ్లారు. 'జగన్‌'తో పాటు జైలు జీవితం అనుభవించిన ఆయన తరువాత..జైలు నుంచి విడుదలై 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆరోగ్యం సహకరించకపోయినా..నియోజకవర్గాన్నే అట్టిపెట్టుకుని...మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారు. మొన్నటి ఎన్నికల సందర్భంగా..అనారోగ్యంతో ఉన్న 'మోపిదేవి'ని 'జగన్‌' పలుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..'అన్నా..మనం గెలవబోతున్నాం...ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో...నీకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇస్తానని హామీ ఇచ్చారట. అయితే..'జగన్‌' ఆశించినట్లు...ఆయన పార్టీ గెలిచినా...'మోపిదేవి' మాత్రం ఓడిపోయారు. తన సన్నిహితుడు ఓడిపోయినా...ముందే చెప్పినట్లు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని న్యాయం చేశారని..'మోపిదేవి' సన్నిహితులు చెప్పుకుంటూ మురిసిపోతున్నారు. మొత్తం మీద..తనకు మొదటి నుంచి అండగా ఉన్నవాళ్లకు 'జగన్‌' అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

(423)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ