‘బిజెపి’కి 271సీట్లు: ఇండియా టుడే సర్వేలో వెల్లడి
ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే అధికార బిజెపికి 271సీట్లు వస్తాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇండియా టుడే తెలిపింది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో నిర్వహించిన సర్వే వివరాలను గురువారం నాడు విడుదల చేసింది. ప్రతి ఏడాది ‘ఇండియాటుడే’ ఈ సర్వేలను నిర్వహిస్తూంటుంది. ప్రస్తుతం నిర్వహించిన సర్వే ప్రకారం ప్రజలు మరోసారి ‘మోడీ’ని ప్రధానమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. బిజెపికి స్వంతంగా 271 సీట్లు వస్తాయని, మొత్తం ఎన్‌డిఎతో కలిపితే 296 సీట్లు వస్తాయని సర్వే తెలిపింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 62 సీట్లు, టిఎంపికి 35సీట్లు,ఆప్‌కు 4 సీట్లు, ఇతర పార్టీలకు 171సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది. కాగా ప్రధానిగా ఎవరు ఉండాలనే ప్రశ్నకు 53శాతం మంది మోడీకి, 7శాతం మంది రాహుల్ గాంధీకి, 6శాతం మంది ‘యోగీ ఆధిత్యనాధ్ దాస్’కు, 4 శాతం మంది ‘అమిత్‌షా’కు మద్దతు తెలిపారు.
ప్రతిపక్షనేతగా ‘మమతాబెనర్జీ’ ఉండాలని17శాతం, 16శాతం మంది ‘అరవింద్ క్రేజీవాల్’ వైపు, 11శాతం ‘రాహుల్‌గాంధీ’ ఉండాలని కోరుకున్నారు. ఏ సమస్యను పరిష్కరించడంలో ‘మోడీ’ ప్రభుత్వం విఫలమైందన్న ప్రశ్నకు 23శాతం మంది ద్రవ్యోల్భణం, 14శాతం మంది నిరుద్యోగం, 10శాతం మంది రైతుల ఆందోళన గురించి చెప్పారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ‘మోడీ’ పాలన బాగుందని 58శాతం మంది చెప్పారు. గత సంవత్సరం ఇది 53శాతంగా ఉంది. ‘ఉత్తరప్రదేశ్’లో ‘బిజెపి’ 67 నుంచి 71 సీట్లును గెలుచుకుంటుందని, రాజస్థాన్‌లో ఎన్‌డిఎ24సీట్లు, గుజరాత్‌లో 25సీట్లు ఎన్‌డిఏ గెలుచుకుంటుందట. మహారాష్ట్రలో యుపిఎ 32సీట్లు, కర్ణాటకలో 10సీట్లను ఆ కూటమి గెలుచుకుంటుందట. కాగా ‘పంజాబ్’లో ‘ఎన్‌డిఎ’కు ఒక్కసీటు కూడా రాదని సర్వే స్పష్టం చేసింది.