లేటెస్ట్

'ఆంధ్రా'లో దళితులపై గురిపెట్టిన 'బిజెపి'...!

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వివిధ రీతుల్లో ఇబ్బంది పెట్టి..ఘోరంగా ఓడించిన బిజెపి పెద్దలు..ఇక రాష్ట్రంలో ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనే ఆలోచనలు చేస్తోంది. దీని కోసం ముందుగా టిడిపి క్యాడర్‌పై గురిపెట్టింది. 'బిజెపి'కి చెందిన కేంద్ర పెద్దలు..రాష్ట్రంలో చాపకింద నీరులా పర్యటిస్తూ..వివిధ వర్గాలకు చెందిన వారికి వల వేస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న టిడిపి నేతలను కలుస్తూ..తమ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలుకుతున్నారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో సీనియర్‌ టిడిపి నేతలు, యువ నేతలను కలుస్తూ..టిడిపి ఇక భవిష్యత్‌ లేదని, బిజెపిలోకి వస్తే..అధికారపార్టీలో భాగస్వాములు కావచ్చని..వారిని ఒప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 'చంద్రబాబు' సామాజికవర్గం, టిడిపిలో ఉన్న 'రెడ్డి' సామాజికవర్గాన్ని పార్టీలోకి తీసుకుని...టిడిపిని నామ మాత్రం చేయాలనే భావనతో ఉన్నారు. 

ఇది ఇలా ఉంటే...కేవలం 'కమ్మ,రెడ్డి, కాపు' సామాజికవర్గాలకు చెందిన వారినే కాకుండా...దళితులపై బిజెపి నాయకులు వల వేస్తున్నారు. పలువురు దళిత నాయకులను ప్రత్యక్షంగా కలుసుకుని పార్టీలో రావాలని...పార్టీలోకి వస్తే..నెలవారీ జీతాలు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. టిడిపిలో ఉన్న సీనియర్‌ దళిత నేతలను వారు కలుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు వివిధ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు అనుభవించిన వారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్నటి దాకా...టిడిపిలో ఉండి..ఎన్నికల ముందు 'జనసేన'లో చేరిన 'రావెల కిశోర్‌బాబు' త్వరలో బిజెపిలో చేరబోతున్నారు. ఆయన బాటలోనే టిడిపికి చెందిన దళిత నేతలను ఆకర్షించేందుకు బిజెపి జాతీయ నాయకులు యత్నాలు చేస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా దళితులను ఆకర్షించేందుకు, ఆ వర్గంలో పేరున్న నాయకుడిని బిజెపిలో చేర్పించేందుకు బిజెపి పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేయగా...ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించారని ప్రచారం జరుగుతోంది. తాను మొదటి నుంచి బిజెపి భావాలకు వ్యతిరేకినని, మొదటి నుంచి కమ్యూనిస్టు సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తున్నానని, తరువాత టిడిపిలోకి వచ్చినా...తాను అదే భావాలతో ఉన్నానని, మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్న బిజెపిలో తాను చేరనని తేల్చి చెప్పారట. ఆయనొక్కరే కాదు..మరో మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలపై కూడా..వారు వలవేశారు. మొత్తం మీద..ఒకే సమయంలో 'కమ్మ, రెడ్డి, కాపు, దళితులను పార్టీలోకి తీసుకుని..టిడిపిని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశ్యంతో..బిజెపి పెద్దలు పావులు కదుపుతున్నారు. మరి వారి ప్రయత్నాలు ఎంత వరకు సఫలం అవుతాయో..వేచి చూడాల్సిందే...!

(663)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ