WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

నెల్లూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో...ఒకటి ఒకే...రెండోది డౌట్‌...మూడోది అవుట్‌...!

నెల్లూరు జిల్లా నుండి ఎమ్మెల్సీ పదవుల కోసం జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 'వాకాటి నారాయణరెడ్డి' విజయం సాధించడం ఖాయమని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ నాయకులు చేతులు ఎత్తేశారు. రోజు రోజుకు మారుతున్న పరిణామాలను బట్టి టిడిపి అభ్యర్థి విజయం నల్లేరుపై నడకకానుంది. 'వాకాటి' గెలుపును ఎవరూ ఆపలేరని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి 'జనం ప్రత్యేక ప్రతినిధి'కి తెలిపారు. తాను పోటీ చేసే అవకాశం కోరినప్పటికీ 'నారాయణరెడ్డి'కి సీటు ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాని పార్టీ అగ్రనేతల్లో నిత్యం మాట్లాడుతూనే ఉన్నానని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఇది ఇలా ఉండగా పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో మంత్రి నారాయణ సిఫారుసుతో పోటీలో దిగిన 'పట్టాభిరామిరెడ్డి' నడక నల్లేరుపై నడకలా భావించగా...తాజాగా ఆయన గెలుపుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

  అనేక మంది యువ గ్రాడ్యుయేటర్లను ఓటర్లుగా నమోదు చేయించినప్పటికీ విపక్షాల నాయకులు కూడా అదే రీతిలో ఓటర్లను నమోదు చేయించారని టిడిపి నాయకులు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. టిడిపి నాయకులు చేర్పించిన ఓటర్లలో కొంత మంది విపక్షాల అభ్యర్థి వైపు మొగ్గు చూపిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీచర్స్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీకి చుక్కెదురు అవుతుంది. ఇక్కడ విపక్షాలు బలపరిచిన అభ్యర్థి వైపు మొగ్గు కనిపిస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్నటి వరకూ గట్టిపోటీ ఇస్తామని బీరాలు పలికిన మంత్రి నారాయణ ఆయన అనుచరులు రోజులు గడిచిన కొద్దీ నిరాశ,నిస్పృహలోకి వెళ్ళిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా విజయం సాధించాలని 'చంద్రబాబు' హెచ్చరించడంలో సర్వశక్తులు ఒడ్డి ఓటర్ల మెప్పుపొందేందుకు ప్రాంతాల వారీగా నాయకులు  తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న టిడిపి అభ్యర్థిని ఏదో విధంగా గెలిపించుకుంటామని, టీచర్ల నియోజకవర్గాల అభ్యర్థిపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని మీడియా వర్గాలకు ఆఫ్‌ ది రికార్డుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం వస్తోంది. ఇది ఇలా ఉండగా బ్యాంక్‌ల నుండి అప్పులు తీసుకుని ఎగవేసిన కేసులో హైకోర్టులో కేసు వేసేందుకు విపక్షాలు సిద్దమయ్యాయనే ప్రచారాన్ని టిడిపి నాయకులు కొట్టిపారేస్తున్నారు. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న చందంగా అభ్యర్థిగా 'నారాయణరెడ్డి' ఎంపిక చేసి అప్రదిష్టపాలు కావాల్సి వచ్చిందని పలువురు సీనియర్‌ నాయకులు వాపోతున్నారు. నిన్న కాక మొన్న కాంగ్రెస్‌ నుంచి వచ్చిన 'వాకాటి'కి 'చినబాబు' మద్దతు ఉందని జరుగుతున్న ప్రచారంపై ఆయన మద్దతుదారులు మాట్లాడుతూ 'వాకాటి' ఎంపికలో తమ నేత ప్రమేయం లేదని అంటున్నారు. అవలీలగా గెలిచే అభ్యర్థి అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోపణలు ఉన్న వారిని ఎంపిక చేయడంతో పార్టీకి కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని మంత్రి నారాయణ సన్నిహితులు చెబుతున్నారు. 'చంద్రబాబు' హెచ్చరికలతో, సూచనలతో నాయకులంతా ఏకతాటిపై నడుస్తూ మనస్పూర్తిగా 'వాకాటి' గెలుపుకు నాయకులు కృషి చేస్తున్నారు.


(339)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ