లేటెస్ట్

'జగన్‌' పరిణితో వ్యవహరించారంటున్న సచివాలయ ఉద్యోగులు....!

నూతన ముఖ్యమంత్రిగా సచివాలయంలో అడుగుపెట్టిన వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పరిణితో వ్యవహరించారని పలువురు సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఆయన వ్యవహారశైలిపై పలువురు ఉద్యోగులు స్పందిస్తూ...ఉద్యోగుల విషయంలో ఆయన అన్నమాటలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు సన్నిహితంగా ఉన్న ఉద్యోగుల విషయంలో తాను వివక్ష పాటించనని, అందరినీ సమానంగానే చూస్తానని చెప్పడంపై..ఉద్యోగుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రిగా 'జగన్‌' సచివాలయానికి రాక ముందు..ఉద్యోగుల్లో ఒకరకమైన ఆందోళన ఉంది. రెండు వర్గాలుగా ఉన్న ఉద్యోగుల పట్ల నూతన సిఎం ఎలా వ్యవహరిస్తారో..అని అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. 

మొన్నటి ఎన్నికల సందర్భంగా కానీ..గత ఎన్నికల సందర్భంగా కానీ, సచివాలయ సంఘ ఎన్నికల సందర్భంలో కానీ...ఉద్యోగులు రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు..అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును సమర్థిస్తే...మరి కొందరు 'జగన్‌'ను బాహాటంగా సమర్థించారు. ఈ సందర్భంగా పలుసార్లు...వీరి మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. తమ నాయకుడు ముఖ్యమంత్రి కాగానే...తమను వ్యతిరేకించే వర్గాల అంతు చూస్తామని అప్పట్లో 'జగన్‌'ను సమర్థించే ఉద్యోగులు వ్యాఖ్యానించేవారు. ఈ నేపథ్యంలో 'జగన్‌' ముఖ్యమంత్రిగా సచివాలయంలోకి రావడంతో గత ప్రభుత్వాన్ని సమర్థించిన ఉద్యోగుల విషయంలో ఎలా వ్యవహరిస్తారో..అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తం అయ్యాయి. అయితే ఆయన అదేమీ పట్టించుకోకుండా...ఉద్యోగులంతా తనకు సమానమేనని, రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేద్దామని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని..ఎవరూ ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడంతో..అప్పటి వరకు కొందరిలో నెలకొన్న భావనలు పటాపంచలు అయ్యాయి. ఉద్యోగుల విషయంలో 'జగన్‌'పరిణితో వ్యవహరించారని, ఆయన ఇంత పరిణితో వ్యవహరిస్తారని తాను భావించలేదని ఒక ఉద్యోగి 'జనమ్‌ఆన్‌లైన్‌.కామ్‌'తో వ్యాఖ్యానించారు. మొత్తం మీద..సచివాలయంలో ఇప్పటి వరకు రెండు వర్గాలుగా చీలిపోయిన ఉద్యోగులు..నూతన సిఎం వ్యాఖ్యలతో గతంలో ఉన్న స్పర్థలను మరిచిపోయి కలిసి పనిచేసే పరిస్థితి నెలకొంటుందనే భావన వ్యక్తం అయింది. 

(292)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ