లేటెస్ట్

'కులముద్ర' లేకుండా 'జగన్‌' జాగ్రత్తలు...!

గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన తప్పులను తాను చేయకుండా నూతన ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుంచి ఆయన ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అధికారుల ఎంపిక నుంచి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రుల ఎంపిక వరకు ఆయన ఒక వ్యూహం ప్రకారం వెళుతున్నారని ఆయన చేస్తోన్న నిర్ణయాలను బట్టి అర్థం అవుతోంది. ముందుగా సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులకు పోస్టింగ్‌ ఇచ్చే విషయంలో ఆయన ప్రభుత్వం వ్యవహరించిన తీరు విమర్శకుల ప్రశంసలు తెచ్చి పెట్టింది. తన కులానికే పెద్దపీట వేస్తారనే అభిప్రాయాన్ని పక్కన పెట్టి...సమర్థులు, నిజాయితీపరులకు పెద్ద పీట వేశారు. ఈ పోస్టింగ్‌ల విషయంలో ఒకటీ రెండు తప్ప..మిగతావన్నీ సరైనవే అని చెప్పక తప్పదు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి..అవినీతికి పాల్పాడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో దాదాపు 90శాతం మందిని 'జగన్‌' పక్కన పెట్టారు. అయితే అదే సమయంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్న ఓ అధికారికి మాత్రం కీలకమైనపోస్టు ఇచ్చారు. ఆయన కాకుండా మరో ఇద్దరికీ కీలకమైన పోస్టులు లభించాయి. ఇవి తప్ప అధికారుల విషయంలో తప్పు పట్టడానికి ఏమీ లేకుండా పోయింది. 

అధికారుల విషయం వదిలేస్తే..మంత్రివర్గ కూర్పు విషయంలో...'జగన్‌' నిర్ణయాలు టిడిపి నేతలను ఆశ్చర్యపరిచాయి. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ...తనకు పట్టున్న వర్గాల్లో మరింత పట్టుసాధిస్తూ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్న తీరు ఆయనపై ప్రశసంలు కురిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, కాపు వర్గాలకు మంత్రివర్గంలో పెద్దపీట వేశారు. ఈ విషయంలో తన స్వంత కులానికి అన్యాయం జరిగినా..ఆయన పట్టించుకోలేదు. వాస్తవానికి 'జగన్‌' ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే ఆయన కులానికి 8 నుంచి 9 వరకు మంత్రి పదవులు దక్కుతాయని ఆయన సహచరులు, సన్నిహితులు, మిత్రులు,బంధువులు, కార్యకర్తలు, అభిమానులు భావించారు. కానీ వారి ఆశలను వమ్ము చేస్తూ..ఆ వర్గానికి కేవలం నాలుగు మంత్రి పదవులే ఇచ్చారు. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆ సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇచ్చారంటే...తన ప్రభుత్వంపై కుల ముద్ర పడకుండా ఉండడానికి..ఆయన ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారో దీనిని బట్టి అర్థం అవుతోంది. అదే విధంగా తనకు ఓట్లు వేయరని భావించిన 'కమ్మ' సామాజిక వర్గానికి కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తనకు పట్టులేని వర్గాల్లో పట్టుసాధించడం కోసం...'చంద్రబాబు' చేసినట్లు మంత్రి పదవులు పంచి పెట్టలేదు. అదే విధంగా తన మనుషులు అనుకున్న వారి విషయంలో వెనుకా ముందు చూడకుండా..వారిని పిలిచి పెద్దపీట వేశారు. మొత్తం మీద...ఐదుగురు ఉప ముఖ్య మంత్రులు అనే హాస్యాస్పదమైన నిర్ణయం ఒక్కటి తప్ప...మిగతావన్నీ...సక్రమంగానే చేశారనే అభిప్రాయం..మెజార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

(254)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ